​​​​​​ఎల్‌ఐసీ ద్వారానే ₹లక్ష కోట్లు! - lic ipo to bring in rs 1 lakh cr
close

Updated : 27/03/2021 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​ఎల్‌ఐసీ ద్వారానే ₹లక్ష కోట్లు!

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను అందుకుంటాం
ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ (2021-22) నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను తొందరగానే అందుకుంటామని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ₹1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకుంటామని తెలిపారు. ఒక్క ఎల్‌ఐసీ ఐపీవో ద్వారానే ₹ లక్ష కోట్ల మేర సమకూరుతుందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ వర్చువల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పెట్టుబడుల ఉపసంహరణలో ప్రధానమైనవి బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ అని కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ద్వారా ₹75-80 వేల కోట్లు, అంతకంటే ఎక్కువే సమకూరే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా సుమారు ₹ లక్ష కోట్లు వస్తుందని చెప్పారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు ప్రారంభమైన నేపథ్యంలో 2022 లక్ష్యాలను సులువుగానే అందుకోగలమని చెప్పారు. బీపీసీఎల్‌లో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కోసం ఇప్పటికే ఎల్‌ఐసీ చట్టానికి ఇటీవలే సవరణలు చేసింది.

వ్యాపారం ప్రభుత్వం విధి కాదని, వ్యూహాత్మకమైన నాలుగు రంగాల తప్ప మిగిలినవన్నీ ప్రైవేటీకరిస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలనూ సుబ్రమణియన్‌ కొనియాడారు. కీలకమైన మార్పులుగా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. అలాగే భారత్‌లో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. భారత్‌లో మూడో వంతు జనాభా కలిగిన అమెరికాలో సుమారు 25-30వేల బ్యాంకులున్నాయని ఉదాహరణగా చూపారు. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశం రెండంకెల వృద్ధిరేటు నమోదు చేస్తుందని అంచనా వేశారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని