ఆంక్షలతో అతలాకుతలమైన స్టాక్‌ మార్కెట్లు! - markets ended in deep red
close

Updated : 19/04/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంక్షలతో అతలాకుతలమైన స్టాక్‌ మార్కెట్లు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. కరోనా ఉద్ధృతి.. సంబంధిత ఆంక్షలు, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఫలితంగా ఉదయం 47,940 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,470 పాయింట్లు కుప్పకూలి 47,362 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక 14,306 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 426 పాయింట్లు దిగజారి 14,191 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. తర్వాత రెండు సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 882 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగియగా.. నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 14,359 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.85 వద్ద నిలిచింది.

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ బలంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 2,73,810 కేసులు వెలుగు చూశాయి. మరో 1,619 మంది ప్రాణాలు వదిలారు. కేసుల ఉద్ధృతితో అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూలు ప్రకటించాయి. వారాంతపు లాక్‌డౌన్‌లు విధించాయి. దేశరాజధాని దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్ విధించారు. మరోవైపు రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని అందుకే జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని తెలిపాయి. వీటికి తోడు విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏప్రిల్‌లో రూ.4,615 కోట్లు వెనక్కి వెళ్లాయి. ఈ పరిణామాలే నేడు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బ్రిటానియా లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లిమిటెడ్‌, సిప్లా షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని