Financial Planning : 30లలో ఈ తప్పులు చేయొద్దు! - Dont commit these financial mistakes in your 30s
close

Updated : 28/09/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Financial Planning : 30లలో ఈ తప్పులు చేయొద్దు!

ఇంటర్నెట్‌ డెస్క్‌ : డబ్బు ఒక శక్తిమంతమైన సాధనం. దాన్ని ఎంత తెలివిగా వినియోగించుకుంటే మన జీవితం అంత సాఫీగా ముందుకు సాగుతుంది. దీనికి ఒక నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా మన వయసు 30 ఏళ్లకు చేరిందంటే మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. ఈ వయసులో అసలైన బాధ్యతలు మన భుజాలపైకి వస్తాయి. రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం హాయిగా గడవాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే కీలకం. మరి ఈ వయసులో ఆర్థికంగా చేయకూడని కొన్ని తప్పులేంటో చూద్దాం..!

స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం..

30కి చేరే సరికే మనం కొంత పొదుపు చేసి ఉండాలి. చిన్న చిన్న పెట్టుబడులు ప్రారంభించాలి. ఒకవేళ ఇవేవీ చేయకపోతే 30లలో ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. మీ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా పొదుపు, మదుపును ఎంచుకోండి. ప్రతి మదుపునకు ఓ లక్ష్యం ఉండాలి. ఇళ్లు, కారు కొనడం, పిల్లల చదువులు.. ఇలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అవి ఎప్పటికి సాధించాలో నిర్ణయించాలి. అందుకు అనుగుణంగా మీ ప్రణాళిక ఉండాలి.

రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ని ఆలస్యం చేయడం..

సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్‌ అవుతుంటారు. అయితే, 30లలోకి ప్రవేశించిన వారు ఇప్పటి నుంచి రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం గురించి ఎందుకని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకా మూడు దశాబ్దాల సమయం ఉంది కదా అని మదుపును వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ, ఇది పెద్ద తప్పు. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్ట్‌ చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి తక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే ఎంతో కొంత రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం కోసం పక్కన పెట్టడం ప్రారంభించాలి. మంచి రిటర్న్స్‌ ఇచ్చే పథకాల్లో మదుపు చేయాలి.

ఉదాహరణకు మీరు 35 ఏళ్ల వయసులో మదుపు ప్రారంభించారనుకుందాం.  ప్రతినెలా రూ.10,000 మదుపు చేస్తున్నారు. 60 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ.30 లక్షలు మదుపు చేస్తారు. దీనికి ఏటా 12 శాతం రిటర్న్న్‌ వచ్చాయనుకుంటే చివరకు మీ చేతికి రూ.1.6కోట్లు అందుతాయి. అయితే 30 ఏళ్ల వయసులో మదుపు ప్రారంభిస్తే 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టేందుకు మీకు అవకాశం ఉంటుంది. అదనంగా రూ.6 లక్షలు మదుపు చేస్తారు. కానీ, 60 ఏళ్లు వచ్చేసరికి మీ చేతికి రూ.2.9 కోట్లు అందుతాయి. అంటే ఐదేళ్లలో అదనంగా రూ.6 లక్షలే మదుపు చేస్తున్నప్పటికీ.. మీ చేతికి వచ్చే సొమ్ము మాత్రం రూ.1.3 కోట్లు పెరుగుతుంది. అంటే ఐదేళ్లు ఆలస్యం చేయడం వల్ల రూ.1.3 కోట్లు కోల్పోతున్నారన్నమాట!

అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం..

30లకు చేరుకునేటప్పటికీ ఖర్చులు పెరిగిపోతాయి. పిల్లలు స్కూల్‌ ఫీజులు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు ఇలా చాలా ఉంటాయి. కాబట్టి అత్యవసర పరిస్థితులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మీ ఉద్యోగం లేదా బిజినెస్‌లో ఏమైనా సమస్యలు తలెత్తినా.. తప్పనిసరి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ప్లాన్‌ చేసుకోవాలి. కనీసం 6 నెలలకు సరిపడా డబ్బు ఎప్పుడూ అత్యవసర నిధిలో ఉండాలి. ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ.. చిన్న వయసులోనే ప్రతి నెలా కొంత తీసి పక్కన పెడితే.. సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద నిధిగా మారుతుంది. దీని వల్ల అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కూడా ఉంటారు.

బీమా తీసుకోకపోవడం..

30లలో పూర్తిగా ఓ కుటుంబం మనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులకైనా మనం ముందే సిద్ధంగా ఉండాలి. ఆర్థికంగా మనం చేసే ప్రతి తప్పు మన కుటుంబంపై ప్రభావం చూపుతుంది. వారి భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి మనతో పాటు మన కుటుంబ రక్షణ కోసం చిన్న వయసులోనే బీమా తీసుకోవాలి. మీ స్తోమత, అవసరం, లక్ష్యాన్ని బట్టి ఆరోగ్య మీమా, జీవిత బీమా, అవధి బీమా తీసుకోవాలి. కుటుంబం మొత్తానికీ బీమా ఉండడం మరింత ఉత్తమం. ఒకవేళ ఆరోగ్యపరంగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడినా.. బీమా ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే ఇబ్బందులు తప్పవు.

వీటితో పాటు క్రెడిట్‌ కార్డుని అనవసరంగా వాడడం, తాహతుకు మించి ఇళ్లు, కారు కొనడం, విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేయడం, చెడు సావాసాలు, తగిన మోతాదులో మదుపు చేయకపోవడం, తరచూ అప్పులు చేయడం వంటి తప్పులను సైతం వీలైనంత వరకు అరికట్టాలి. 30లలో తీసుకునే నిర్ణయాలే.. 60ల తర్వాత జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఆచితూచి అడుగేయాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని