ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్.. పెట్టుబ‌డులు ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?  - Floting-rate-savings-bonds-latest-interest-rate-and-other-details
close

Updated : 02/07/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్.. పెట్టుబ‌డులు ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా? 

ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్-2020.. జులై-డిసెంబ‌రు2021 కాలానికి వ‌ర్తించే వ‌డ్డీ రేట్ల‌ను ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది.  మొద‌టి కూప‌న్ పిరియ‌డ్ జ‌న‌వ‌రి1,2021కి 7.15 వ‌డ్డీని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రెండ‌వ కూప‌న్ పిరియ‌డ్ జులై1, 2021కి అదే వ‌డ్డీ రేటును కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జులై1 నుంచి డిసెంబ‌రు 31 వ‌ర‌కు ఉన్న ఆరు నెల‌ల కాలానికి ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌పై 7.15 శాతం వ‌డ్డీ వ‌ర్తించ‌నుంది. 

ఈ ప‌థ‌కంపై వ‌ర్తించే కూప‌న్ రేటు లేదా వ‌డ్డీ రేటు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ)కి వ‌ర్తించే వడ్డీ రేటుతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎన్ఎస్‌సీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీ రేటు ఉంటుంది. ప్ర‌స్తుతం 5 సంవ‌త్స‌రాల ఎన్ఎస్‌సీ వ‌డ్డీ రేటు సెప్టెంబ‌రు 30,2021 వ‌ర‌కు 6.8 శాతంగా కొన‌సాగ‌నుంది. అందువ‌ల్ల ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌ వ‌డ్డీ రేటు కూడా 7.15 శాతంగా కొన‌సాగనుంది. 

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్-2020 (పన్ను వర్తిస్తుంది) ఇత‌ర ముఖ్య విష‌యాలు..
* ఇవి నూరు శాతం ప్రభుత్వ హామీతో వెనక్కి వచ్చే పెట్టుబడులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు జాతీయ బ్యాంకులు, నాలుగు నిర్దిష్ట ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు.

* వీటికి 7 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేటు మారుతుంటుంది. సీనియర్ సిటిజన్లలోని కొన్ని నిర్ధిష్ట‌ వర్గాలను కాలపరిమితి కంటే ముందుగానే విత్‌డ్రాలకు అనుమతిస్తారు.

* ప్ర‌స్తుత వార్షిక వడ్డీ రేటు 7.15 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి, జులై 1వ తేదీన వడ్డీ చెల్లిస్తారు. కుమ్యులేటివ్ బేసిస్లో వడ్డీ పొందే ఆప్షన్ లేదు.

* బాండ్లను కొనుగోలు చేసిన వెంటనే అవి కస్టమర్ బాండ్ లెడ్జర్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. వీటిని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయాలి. నగదు రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. అయితే నగదు రూపంలో కొనుగోలు చేస్తే రూ.20వేల పరిమితి ఉంది. ఆన్‌లైన్‌లో అయితే ఎలాంటి గ‌రిష్ట పరిమితి ఉండదు. కనీస పెట్టుబ‌డి మొత్తం రూ.1000.

పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..
ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు మంచి రాబ‌డినే ఇస్తున్నాయ‌ని చెప్పాలి. ప్ర‌త్యేకించి సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇవి లాభ‌దాయ‌కంగా ఉంటాయి. జాతీయ పొద‌పు ప‌త్రాలు(ఎన్ఎస్‌సి)కంటే ఎక్కువ రాబ‌డి ఇస్తున్నాయి. అయితే ఎన్ఎస్‌సీతో పోలిస్తే కాల‌ప‌రిమితి కాస్త ఎక్కువ‌. కానీ ఎన్ఎస్‌సీ పెట్టుబ‌డుల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్రకారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌లో ఈ స‌దుపాయం లేదు. పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తాయి. వ‌డ్డీ ఆదాయంపై కూడా ప‌న్ను వ‌ర్తిస్తుంది. వ్య‌క్తికి వ‌ర్తించే స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి. కాల‌ప‌రిమితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే లిక్విడిటి అవ‌కాశాలు త‌క్కువ‌.. బ‌దిలీ చేసేందుకు వీలులేదు.. ట్రేడింగ్ కూడా అందుబాటులో లేదు క‌నుక వ్య‌క్తికి వ‌ర్తించే ప‌న్ను స్లాబ్‌.. కాల‌ప‌రిమితుల‌ను దృష్టిలో ఉంచుకుని సంద‌ర్భోచితంగా పెట్టుబ‌డులు పెట్టాలి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని