మొదటి జీతం అందుకున్నారా.. ఏం చేయాలో ప్లాన్ చేశారా? - Got your first salary what is the plan
close

Updated : 12/08/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొదటి జీతం అందుకున్నారా.. ఏం చేయాలో ప్లాన్ చేశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొదటి జీతం చాలా ప్రత్యేకం. చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యంతో కష్టపడి చదివి.. కోరుకున్న ఉద్యోగం సంపాదించిన అనంతరం వచ్చే మొదటి నెల జీతం చేతికి వచ్చినప్పుడు కలిగే ఆనందమే వేరు. అంత ప్రత్యేకం కనుకనే మొదటి జీతం ఎలా ఖర్చుచేయాలా? అని చాలా మంది ముందే నిర్ణయించుకుంటారు. అమ్మానాన్నలకు, కుటుంబ సభ్యులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనో.. జీవితాంతం గుర్తుండి పోయేలా ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలనో... ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలని విష్ లిస్ట్‌లో ఉంచిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను కొనాలనో.. ఇలా ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి. అయితే ఇలాంటి మధురమైన క్షణాలను ఆస్వాదించేందుకు మొదటి నెల జీతం ఖర్చుపెట్టడంలో తప్పులేదు. కానీ ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడడం లేదు కదాని ఇష్టానుసారం ఖర్చుపెట్టడం కూడా మంచిది కాదు. పొదుపు, ఖర్చులకు మధ్య సమతుల్యత ఉండాలి. కొంత భాగం ఖర్చుచేసినా మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులు పెట్టాలి.

ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి..?
1. బడ్జెట్‌ను రూపొందించండి..

మొదటి జీతం అందుకోగానే చేయాల్సిన మొట్టమొదటి పని.. బడ్జెట్ వేసుకోవడం. ఖర్చులు అందరూ చేస్తారు. ప్లాన్ ప్రకారం ఖర్చు చేయడం ముఖ్యం. ఒక జాబితాను రూపొందించుకుని, దాని ప్రకారం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోవాలి. బడ్జెట్ అనేది కేవలం ఖర్చుల కోసం మాత్రమే కాదు. వచ్చిన ఆదాయంలో ఎంత భాగం ఖర్చవుతుంది? ఎంత భాగం పొదుపు చేస్తున్నారు? ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు? అనే అంశాలపై మీకు స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం కాదు.. పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చెయ్యి అని చెప్తారు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడి దారుల్లో ఒకరైన వారెన్ బఫెట్. మొదటి జీతం పొందినప్పటి నుంచే బడ్జెట్ ప్రకారం నడవడం నేర్చుకుంటే దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం కొనసాగించవచ్చు.

2. రుణాలు..
రుణం లేకపోతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల సంపాదన ప్రారంభమైన వెంటనే అప్పటికి ఉన్న రుణాలను తీర్చేందుకు ముందుగా ప్రయత్నించాలి. ప్రస్తుతం చాలామంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి లోన్స్ ఉంటే.. వాటికి సంబంధించిన ఈఎంఐ మొదటి నెల నుంచే చెల్లించేందుకు ప్రయత్నించండి.

3. అత్యవసర నిధి..
ఎప్పుడు ఏం జరుగుతుంతో మనం అంచనా వేయలేం. అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర స్థితిలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కొంత నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దీన్నే అత్యవసర నిధి అంటారు. రోజువారీ ఖర్చులకు, విందులు వంటి వాటికి ఇందులో నుంచి డబ్బు ఖర్చుచేయకూడదు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఉద్యోగం కోల్పోవడం వంటి వాటికి మాత్రమే వినియోగించాలి. కనీసం ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం డబ్బును పొదుపు ఖాతాలో కానీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గానీ, లిక్విడ్ ఫండ్లలో గానీ ఉంచవచ్చు. 

4. జీవిత/ ఆరోగ్య బీమా..

సంపాదించే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా ఉండాలి. సంపాదించే వ్యక్తిని కుటుంబం కోల్పోతే.. ఆ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటుంది టర్మ్ పాలసీ. పాలసీ కాలవ్యవధిలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే.. హామీ మొత్తం నామినీకి అందుతుంది. లేకపోతే ఎటువంటి ప్రయోజనాలూ లభించవు. ఇతర పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే విధంగా వైద్య అత్యవసర పరిస్థితులలో ఆరోగ్య బీమా సహాయపడుతుంది. కుటుంబం మొత్తానికి పాలసీ తీసుకోవాలనుకునే వారు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు. మీ వైద్య చరిత్ర ఆధారంగా పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ట‌ర్మ్‌ బీమా, ఆరోగ్య బీమా పాలసీలు రెండింటినీ చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది.

5. పెట్టుబడులు..
ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కుబుంబ బాధ్యతలు దాదాపు ఉండవు. కాబట్టి పొదుపు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే నష్టభయాన్ని తట్టుకోగల సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మ‌దుపు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. 'సిప్' ద్వారా ప్రతి నెలా మ‌దుపు చేస్తే కొంత వ‌ర‌కు రిస్క్ త‌గ్గుతుంది. ఆదాయం పెరిగేకొద్ది 'సిప్' మొత్తాన్ని పెంచండి. ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూర్చుకోగలరు. ఫండ్ల ఎంపిక విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం 10 ఏళ్ల పాటు మదుపు చేయడం మేలు. సురక్షితమైన పెట్టుబడులు కావాలనుకునే వారు పీపీఎఫ్ లాంటి పథకాలను ఎంచుకోవచ్చు.

6. ఆర్థిక నిర్వహణ..
ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం.. డబ్బును పొదుపు చేయడం మాత్రమే కాదు. ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయీ నుంచీ మరో రూపాయి పొందగలడమే.. అసలైన పెట్టుబడి వ్యూహం. మొదటి జీతం తీసుకున్నప్పటి నుంచి ఆర్థిక నిర్వహణ మొదలుపెడితే నేర్చుకునేందుకు కావలసిన సమయం దొరుకుతుంది. డబ్బు పట్ల భాద్యతగా వ్యవహరించడం తెలుస్తుంది. 

చివరిగా..
మొదటి జీతం క్రెడిట్ అవ్వడంతోనే జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. ఈ మొత్తాన్ని ఎలా అయినా ఖర్చుచేయవచ్చు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం నడిస్తే ఆర్థిక జీవితానికి ఒక మంచి ప్రారంభం దొరుకుతుంది. ఇది విజయం వైపు తీసుకెళ్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని