వీలునామా ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. - Here-is-what-you-need-to-know-about-creating-a-will
close

Updated : 30/04/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీలునామా ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

కోవిడ్ మరోసారి విజృంభిస్తుంది. ఈ మహమ్మారి దాటికి పెద్దలే కాదు, చిన్న వయసులో ఉన్నవారు ప్రమాదం అంచులకు వెళ్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి ఏమౌతుంతో తెలియడం లేదు.. ఈ అనిశ్చిత సమయంలో.. ఆర్ధిక విష‌యాల‌లోనూ జాగ్ర‌త్త ప‌డాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ పెద్ద మరణానంతరం స్థిర, చరాస్థుల విషయంలో వివాదాలు, వారసుల నడుమ గొడవలు జరగకూడదని కోరుకునే వారికి చక్కని పరిష్కారం.. విల్లు.

1. వీలునామా రాయకపోతే..
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, వారసత్వ చట్టాలు (హిందూ, షరియత్ చట్టాలు మొదలైనవి) అమలులోకి వస్తాయి. ఇది చట్టపరిదిని పెంచుతుంది. వారసత్వ చట్ట ప్రకారం పంపిణి జరుగుతుంది. కోర్టు ద్వారా జ‌రిగే పంప‌కాలు చ‌నిపోయిన వ్య‌క్తి అభీష్టం మేర‌కు జరగకపోవచ్చు. అంతేకాకుండా వారసత్వపు సర్టిఫికేట్లు, కోర్టు, లాయర్ ఫీజులంటూ చాలా కర్చవుతుంది. ప్రాసెసింగ్ పూర్తయ్యి, ఆస్తి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆస్తి పంపకాల విషయంలో సొంత కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో పాటు, పిల్లలకు ఎంత నిష్పత్తిలో వాటా ఇవ్వాలి. తల్లిదండ్రులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలనుకుంటున్నారో.. స్పష్టమైన సూచనలతో  వీలునామా రాయడం మంచిది. నామినీని ఏర్పాటు చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. పైగా స్థిరాస్తులకు నామినీలను నియమించలేరు. ఆస్తి విషయంలో నామినేషన్లు జవాబు కాదని గుర్తుంచుకోండి. కారణం..నామినీ కేవలం ఆస్తి సంరక్షకుడు మాత్రమే.. చట్టబద్ధమైన వారసుడు కాకపోవచ్చు.

2. ఎలా రాయాలి?
చట్టపరంగా వీలునామాను సిద్ధంచేసేందుకు న్యాయవాదిని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా విల్లు సిద్ధం చేసుకునే సదుపాయం ఉంది. అనేక బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చట్టపరమైన సంస్థలతో టైఅప్ చేసుకుని ఆన్లైన్లో వీలునామా తయారు చేయడంలో సహాయపడుతున్నాయి.  డిజిటల్ పద్ధతిలో వీలునామా సిద్ధం చేయించడం చాలా సులభం. ముందుగా మీరు ఏ సంస్థ సేవాలను ఎంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, ఇతర వివరాలతో వెబ్సైట్కు రిజిస్టర్ చేసుకోవాలి.  క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్లలో.. ఏదొక విధానాన్ని ఉపయోగించుకుని నిర్ణీత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన మరిన్ని వివరాలను అడుగుతారు. ఇందులో మీ వయసు,  నివాస చిరునామా, భార‌త‌దేశంలో నివ‌సిస్తున్నారా.. లేదా.. విదేశాల‌లో నివ‌సిస్తున్నారా.. మీ వృత్తి తదితర వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల‌ వివరాలు, మీకున్న ఆస్తుల వివ‌రాలు తెలియజేయాలి. తర్వాత వాటిని ఏవిధంగా పంచాలనుకుంటున్నారు.. మొద‌లైన‌ సమాచారాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స‌మాచార‌మంతా సేక‌రించిన త‌రువాత‌  మీకు సేవలందించే సంస్థ వీలునామా కాపీని త‌యారుచేసి పంపిస్తుంది. ఈ డ్రాఫ్ట్‌ను పూర్తిగా చదివి నిర్ధారణ చేస్తే ఫైనల్ కాపిని మెయిల్ చేస్తారు. ఈ విల్లును రిజిస్టర్ చేయించుకోవడం మంచిది. ఇందుకోసం ఎక్సిక్యూటర్‌ను కూడా సంస్థలు నియమిస్తాయి.

3. ఏమి ఉండచ్చు.. ఏమి ఉండకూడదు..
సొంతంగా సంపాదించుకున్న స్థిర, చరాస్థులకు సంబంధించి ఏవైనా వీలునామాలో ప్ర‌స్తావించవ‌చ్చు. ఏదైనా ఆస్తి నేరుగా తండ్రి, తాత, ముత్తాతల నుంచి సంక్రమిస్తే దాన్ని సొంతంగా సంపాదించిన దాంతో సమానంగా చూస్తారు. కాబట్టి దీనిని వీలునామాలో జతచేయవచ్చు. అయితే వారసత్వంగా నుంచి వచ్చిన ఆస్తులు, వీలునామాలో చేర్చే ముందు జాగ్రత్త వహించాలి. వాటిపై మీకు చట్టబద్ధమైన స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే చేర్చాలి. ఉదాహరణకు, హిందూ అవిభాజ్య కుటుంబంలోని వాటాను వీలునామాలో ప్రస్తావించకూడదు.

4. వివాదాలు రాకుండా..
 భవిష్యత్తులో ఎలాంటి  వివాదాలకు తావివ్వకుండా విల్లును సబ్-రిజిస్టార్ వద్ద రిజిస్ట్రేష‌న్‌ చేయించాలి. ఇందుకోసం ఇద్దరు సాక్షలు, రిజిస్ట్రేషన్ సమయంలో మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ధృవీకరించే వైద్యుని సర్టిఫికేట్ ఉండాలి. ప్ర‌స్తుతం.. వీలునామాపై సంతకం చేసే సమయంలో విడియో రికార్డింగ్ చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఒరిజినల్ విల్లుతో పాటు, వీలునామా వ్రాసిన వారు స్వయంగా సంతకం చేసినట్లు సాక్ష్యం ఉంటుంది.  ఒకవేళ కుటుంబలోని ఒక‌రిద్ద‌రు సభ్యుల‌కు ఆస్తిలో వాటా ఇవ్వకపోయినప్పటికీ, వారి పేర్ల‌ను వీలునామాలో తప్పనిసరిగా పేర్కొనాలి. అంతేకాకుండా వారి పేర్ల‌పై ఎలాంటి ఆస్తిని రాయడం లేదని స్పష్టంగా చెప్పాలి. ఇందుకోసం ఒక కార్య నిర్వహణ అధికారిని నియమించడం మంచిది. 

5. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పన్నులు..
రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానప్పటికీ, విల్లు రిజిస్టర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దాదాపు రూ. 1,000 వరకు ఉండచ్చు. మీరు విల్లు ద్వారా ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే, దానిపై పన్ను ఉండదు. ఒకవేళ మీ కుమారుడు విల్లు ద్వారా ఆస్తిని స్వీకరించినట్లయితే (రిజిస్టర్ చేయబడినా లేదా కాకపోయినా), అప్పుడు కూడా అతనిపై పన్ను బాధ్యత ఉండదు. అలాగే, చట్టబద్ధమైన వారసుడు కాకుండా వేరే వ్యక్తికి విల్లు ద్వారా ఆస్తి లభించినప్పుడు కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు.  విల్లు ద్వారా వారసత్వంగా పొందిన ఆస్తిపై పన్ను మినహాయింపు ఉంటుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని