మీ ఆదాయంపై మీ జీవిత భాగ‌స్వామి హ‌క్కు ఎంత‌? - How-much-right-does-your-partner-have-on-your-earnings
close

Updated : 08/06/2021 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ఆదాయంపై మీ జీవిత భాగ‌స్వామి హ‌క్కు ఎంత‌?

ఈ ప్ర‌శ్నకు స‌మాధానం తెలుసుకోవాలంటే .. ఎవ‌రు ఈ ప్ర‌శ్న‌ అడుగుతున్నారో ముందుగా తెలుసుకోవాలి. భ‌ర్త లేక‌ భార్యనా.. అనే దానిపై స‌మాధానం ఆధార‌ప‌డుతుంది. ఇక్క‌డ లింగం అనేది ఏ పాత్ర పోషించ‌దు. కానీ మ‌న‌ చుట్టూ ఉన్నసంస్కృతి, సాంప్ర‌దాయాలు ప్రాధాన పాత్ర పోషిస్తాయి. అది కుటుంబం కావ‌చ్చు, స‌మాజం కావ‌చ్చు.. ఇవి స్త్రీ, పురుషుల పైన భిన్న ప్రభావాన్ని చూపుతాయి.

ఉదాహ‌ర‌ణ‌కు, భ‌ర్త‌.. త‌న సంపాద‌న‌పై త‌న‌కు మాత్ర‌మే అధికారం ఉంది, భార్య‌కు ఎలాంటి అధికారం గానీ, వాటా గానీ ఉండ‌ద‌ని భావించ‌వ‌చ్చు. అలాగే ఇది పూర్తిగా తన స్వవిషయం అనుకోవచ్చు. కానీ ఇది సముచితం కాదు.  ఇటువంటి ఆలోచ‌నలు ఉద్యోగం చేయ‌ని, ఆర్థికంగా స్థిర‌ప‌డని భార్య‌ను మరింతగా బాధపెడతాయి. ఆర్థికప‌ర‌మైన విష‌యాల‌లో త‌న పాత్ర ఏమి ఉండ‌ద‌ని వారు భావించేలా చేస్తాయి.

మ‌రోవైపు ఉద్యోగం చేసే కొందరుమహిళలు .. వారు  సంపాదించే ప్ర‌తీ పైసా .. ఆటోమేటిక్‌ గా భ‌ర్త‌, పిల్ల‌లు, కుటుంబానికి చెందుతుంది అన్న ఆలోచనలో ఉంటారు. అలాగే తమ అవసరాలు, కోరికలు, ముఖ్యంగా భర్త ఆలోచనలకు విరుద్ధంగా వున్నవి, స్వార్ధపూరితమని లేక వ్యర్ధమన్న  భావనలో ఉండవచ్చు.

అందువ‌ల్ల ఈ విష‌యాన్ని మరింత అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిద్దాము. 

ఒక కుటుంబంలో, భర్త మాత్రమే సంపాద‌నాప‌రుడైతే, పూర్తి సమయం గృహిణిగా, త‌ల్లిగా ఇంటి భాద్య‌త‌లు నిర్వ‌హించే భార్య‌కు, త‌న భ‌ర్త‌ సంపాద‌న‌పై స‌మాన హ‌క్కులు ఉంటాయ‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఇది చట్టపరం కూడా. కేవ‌లం సానుభూతితో కల్పించిన హక్కు కాదు. ఇంటిని సంర‌క్షించ‌డం, పిల్ల‌లనుపోషించ‌డం వారి ప‌ట్ల అన్ని బాధ్యతలు నిర్వహించడం అనేవి బ‌య‌ట ఉద్యోగ భాద్య‌త‌లు నిర్వ‌హించ‌డం కంటే త‌క్కువేమికాదు. నిజానికి అవి అత్యంత కఠినమైన ఉద్యోగంతో సమానం. ఇక్కడ మిగతా ఉద్యోగాల వలె, ఒకే రకమైన పని లేక ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయడం అన్ని వేళల సాధ్యం కాదు. అంతే కాకుండా ఇక్కడ ఎంత కష్టపడ్డా, ఎంత నైపుణ్యం చూపిన ఎటువంటి గుర్తింపు లభించదు సరికదా పైపెచ్చు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు లాంటి మాటలను ఎదుర్కోవలసి వస్తుంది. 

పూర్వం డ‌బ్బు సంపాదన అనేది క‌ష్టత‌ర‌మైన‌దిగా భావించి.. ఉద్యోగం చేసే వారిని మ‌న స‌మాజంలో ఆరాధించేవారు. అయితే ప్ర‌స్తుతం సమాజంలో పైన చెప్పుకున్నట్లుగా పూర్తిస‌మ‌యం త‌ల్లిగా భాద్య‌త‌లు నిర్వ‌హించ‌డం అంత తేలిక కాద‌ని గుర్తించడం ఎంతో అవసరం. డ‌బ్బు సంతోష‌క‌ర‌మైన ఇంటిని, ఆరోగ్య‌క‌ర‌మైన పిల్ల‌ల‌ను సృష్టించద‌ని గుర్తుంచుకోవాలి. కుటుంబంలోని మ‌హిళ‌లే డ‌బ్బును జీవితంలోని సంతోషాలుగా మారుస్తారు. అందువ‌ల్లే చ‌ట్టం కూడా బ‌య‌టికి వెళ్లి ఉద్యోగం చేయ‌ని భాగ‌స్వామికి, ఉద్యోగం చేసే భాగ‌స్వామి సంపాద‌న‌పై స‌మాన హ‌క్కును క‌ల్పించింది. 

ఇప్పుడు ఉద్యోగం చేసే త‌ల్లుల ఆలోచ‌నా విధానం ఎలా ఉంటుంతో చూద్దాం. పైన చెప్పుకున్నట్లుగా మన సమాజంలో చాల మంది మహిళలు తమ సంపాదన త‌మ భ‌ర్త‌కు చెందుతుంద‌ని న‌మ్ముతారు. కొంద‌రు స‌హ‌జంగానే ఈ భావ‌న‌తో ఉంటే, మ‌రికొంద‌రిని చుట్టూ ఉన్న స‌మాజం న‌మ్మేలాచేస్తుంది. (అయితే అందరు భర్తలు ఇలాగే ఉంటారని కాదు. మన చుట్టూ చూస్తే, ఎంతో మంది తమ భార్య‌ల‌ను, వారి అభిప్రాయాలను గౌరవంగా  చూసే భర్తలు కనబడతారు) 

ఈ కారణాల వలన మ‌హిళ‌లు.. త‌మ‌ సంపాద‌న‌ను త‌మ‌కోసం, త‌మ‌ సంతృప్తి కోసం వినియోగించుకుంటే, స్వార్థ‌ప‌రుల‌మ‌నే భావ‌న వారికే స్వ‌యంగా క‌లిగే అవ‌కాశం ఉంది. దీనికి కుటుంబ స‌భ్యుల స్వ‌రం కూడా తోడైతే.. మ‌హిళ‌లు త‌మ‌పై ఉన్నన‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని కోల్పోవ‌డం మాత్ర‌మే కాకుండా, ఎంతో మనస్తాపానికి గురి కావలసి వస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కు, ఒక మ‌హిళ త‌న త‌ల్లిదండ్రుల‌కు లేదా త‌న పుట్టినింటి కుంటుంబ స‌భ్య‌లకు ఏదైనా బ‌హుమ‌తి ఇవ్వాల‌నుకున్నా, లేక తమ శారీరక, మానసిక అభ్యున్నతి కి ఉపయోగించాలన్న  ఆమెకు ఎటువంటి సంకోచం, బెరుకు ఉండ‌కూడ‌దు. అలాగే దానికోసం పోరాడాల్సిన అవసరం రాకూడదు. అదే స‌మ‌యంలో భార్య, త‌న భ‌ర్త ఇష్టాయిస్టాల‌ను, వారి తల్లితండ్రుల పట్ల, ఇతర కుటుంబ సభ్యుల పట్ల వారికున్న బాధ్యతను గౌరవించడం మరువకూడదు. 

సంపాద‌న ఎవరి దైనప్పటికీ .. ఎవ‌రికైనా ఏదైనా ఇవ్వాల‌నుకున్నా, ఖ‌ర్చు చేయాల‌న్నా..భార్యాభ‌ర్తలిద్ద‌రూ క‌లిసి చ‌ర్చించుకోవాలి. వాస్త‌వానికి ఈ విధమైన చ‌ర్చ‌లు ఒక‌రి ఇష్టాయిస్టాల‌ను మ‌రొక‌రికి తెలియ‌జేయ‌డంతో పాటు, ఒక‌రిని ఒక‌రు అర్థం చేసుకునేందుకు తోడ్ప‌డ‌తాయి. దీంతో బంధాలు బ‌ల‌ప‌డ‌తాయి.

అయితే ఈ చ‌ర్చ‌లు ఒక‌రి ఆలోచ‌న‌లు మ‌రొక‌రితో పంచుకోవ‌డానికి, వారి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవ‌డానికే త‌ప్ప, వాదులాడుకోవటానికి కానీ, ఎక్కువ తక్కువలు తేల్చుకోవటానికి కానీ కాద‌ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇవ్వడం, ఖ‌ర్చు చేయ‌డం లాంటివి  స‌ముచితంగా అనిపించ‌క‌పోయినా, భాగస్వామి కోరిక‌లు కుటుంబ ఆర్థిక స‌మ‌తుల్య‌త‌కు హానికలిగించనివిగా ఉంటే.. మీరు వాటిని గౌరవించటం మీ బంధానికి శ్రేయస్కరం. ఒకవేళ మితిమీరి ఖర్చు చేయడం, అడిగినవారికల్లా ముందు వెనుక ఆలోచించకుండా ఇవ్వడం మీ ఇరువురిలో ఎవరికైనా సమస్యగా పరిణమిస్తే, దీనికి కార‌ణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అభ‌ద్ర‌తా భావాలు ఉన్నాయా అన్నది సొంతంగా గానీ, నిపుణుల స‌హాయంతో గానీ తెలుసుకొని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా.. భాగ‌స్వామి అవ‌స‌రాలపై మీ వైఖ‌రి భిన్నంగా ఉంటే, మొద‌ట దాన్ని మీ భాగ‌స్వామి దృష్టికోణం నుంచి చూసేందుకు ప్ర‌య‌త్నించండి.

ఆ తర్వాత, అవసరమైతే, ఈ క్రింది ప్రశ్నలను ఆసరాగా తీసుకొని, పూర్తిగా విశ్లేషించండి.

1. కుటుంబ నెలవారీ బడ్జెట్, సేవింగ్స్ లపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
2. ప్ర‌భావం చూప‌ట్లేదు అని తెలిసినా.. మీరు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్ల‌యితే..దీనికిగ‌ల కార‌ణాల‌ను తెలుసుకునేందుకు స‌మ‌యం కేటాయించండి. కార‌ణం మీలో అభద్రతా బావాలు, భ‌యాలు అనిపిస్తే  ఈ విష‌యాల‌లో నిపుణ‌డైనా లైఫ్ కోచ్, థెర‌పిస్ట్ స‌హాయం తీసుకోవ‌డం మంచిది.
3. ఒక‌వేళ మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నట్లయితే .. అదే విషయాన్ని మీ భాగస్వామి తో సామరస్యంగా చర్చించి చూడండి. వాస్త‌వాల‌ను తెలియ‌జేసి వారినే  ఒక నిర్ణ‌యానికి ర‌మ్మ‌నండి.
4. అలా మీ భాగ‌స్వామి ఒక నిర్ణయానికి రావటంలో మీ సహాయాన్ని కోరినట్లయితే.. మీ అభిప్రాయాలను  అధికారంతో కానీ, వారిని కించ పరిచే విధంగా కానీ కాకుండా, సహృద్బావంతో చెప్పి చూడండి. ఆ తర్వాత వారినే ఒక నిర్ణయానికి రానివ్వండి.

ఇలా చేసినట్లయితే ఒకరి అభిప్రాయాల పట్ల ఒకరికి సానుకూలమైన దృక్పధం ఏర్పడటమే కాకుండా, స్పర్ధలకు ఆస్కారం ఉండదు. డబ్బు వలన మీ వైవాహిక జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను, అవి మీ బంధానికి తెచ్చే ముప్పుతో బేరీజు వేసుకొని చూడటం మరువకండి. చిన్న చిన్న విషయాలలో వచ్చే భేదాభిప్రాయాలు వలన, దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోండి.

Author:

(Krishna Priya Rayala, Life coach
కృష్ణప్రియ రాయల, లైఫ్ కోచ్)

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని