ప‌న్ను ఆదా చేయాలా.. పెట్టుబ‌డుల‌కు ఇదే స‌రైన స‌మ‌యం  - Now-is-the-right-time-to-start-tax-saving-investments
close

Updated : 08/05/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప‌న్ను ఆదా చేయాలా.. పెట్టుబ‌డుల‌కు ఇదే స‌రైన స‌మ‌యం 

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ప్రణాళిక ప్రక్రియను ప్రారంభించడం మంచిదని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌దుపరులు వారి వారి ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబడులను చేసే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా ప‌న్ను త‌గ్గింపును స‌వ్యంగా ఉప‌యోగించుకుంటూ గ‌రిష్టంగా ఎంత శాతం ప‌న్ను ఆదా చేయ‌గ‌ల‌మో.. అంత మేర ఆదా చేసుకునేందుకు వీలుంటుంది. 

సాధారణంగా, చాలా మంది ఉద్యోగులు, త‌మ‌ పన్ను ఆదా పెట్టుబడుల‌ను నవంబర్ లేదా డిసెంబరు నెల‌ల్లో ప్రారంభిస్తారు.  ప‌నిచేసే సంస్థ, పెట్టుబ‌డుల డిక్ల‌రేష‌న్ పూర్తిచేయాల్సిందిగా కోరిన‌ప్పుడు ఈ విష‌యం జ్ఞ‌ప్తికి వ‌స్తుంది. ఈ కార‌ణంగా ఆర్ధిక సంవ‌త్స‌రం చివ‌రి మూడు/నాలుగు నెల‌ల్లో హ‌డావిడిగా ప‌న్ను ఆదా చేసే ఉత్ప‌త్తుల‌ కొనుగోలు ప్రారంభిస్తారు. ఫ‌లితంగా ఉద్యోగి జీతంలో అధిక భాగం ప‌న్ను-ఆదా పెట్టుబ‌డుల‌కు వైపు మ‌ళ్ళుతుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, మీరు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ల‌భించే రూ.1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపు ప‌రిమితిని పూర్తిగా ఉప‌యోగించు కోవాల‌నుకుంటున్నారు అనుకుందాం. ఇందుకోసం ఒక ఆర్ధిక సంవ‌త్స‌రం మే నెల నుంచి పెట్టుబ‌డులు ప్రారంభిస్తే, నెల‌కు రూ.13,636 చొప్పున ప్ర‌తీ నెల పెట్టుబ‌డి పెడితే స‌రిపోతుంది. ఇక్క‌డ ఉద్యోగుల భ‌విష్య నిధి(ఈపీఎఫ్) కాంట్రీబ్యూష‌న్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. అదే చివ‌రి మూడు నెల‌ల్లో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే, నెల‌కు రూ.50వేల చొప్పున పెట్టుబ‌డి పెట్టాలి. 

అదే విధంగా సెక్ష‌న్ 80సీసీడి (జాతీయ ఫించను ప‌థ‌కం - ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు) సెక్ష‌న్ 80డి (ఆరోగ్య బీమా) వంటి త‌గ్గింపుల‌ను పూర్తిగా వినియోగించాల‌నుకుంటే పెట్టుబ‌డుల‌కు వెళ్లే మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో కొద్ది మొత్తాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా అందించ‌డం ద్వారా పూర్తి త‌గ్గింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అదే చివ‌రి నెల‌ల్లో అయితే ఆర్థిక భారం ప‌డుతుంది. 

ప్రారంభంలో అయితే, ఏ పెట్టుబ‌డికి.. ఎంత కేటాయించారు.. ల‌క్ష్యాల‌కు అనుగుణంగా మ‌దుపు చేసేందుకు ఎలాంటి పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటే బాగుంటుంది త‌దిత‌ర అంశాల‌ను విశ్లేషించుకునేందుకు స‌మ‌యం ఉంటుంది. 70 శాతం ఈక్విటిల‌కు, 30 శాతం డెట్ ఫండ్ల‌కు కేటాయించాల‌న‌కుంటే, దాని ప్ర‌కారం ప్ర‌తీ నెల ఈక్విటి లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్‌), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లేదా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డుల‌లో ఉండే మ‌రో సౌల‌భ్యం సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్‌). ఈ విధానం క్ర‌మానుగ‌త చెల్లింపుల ద్వారా చిన్న చిన్న మొత్తాల‌లో మ‌దుపు చేసేందుకు స‌హాయ‌ప‌డుతుంది. కొన్ని పథ‌కాల‌లో పెట్టుబ‌డులను త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు. ఇలాంటి వాటిలో ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పెట్ట‌బడులు ప్రారంభిస్తే, ఏడాది చివ‌రికి వ‌చ్చే స‌రికి కాంపౌండింగ్ వ‌డ్డీ ప్ర‌భావంతో ఎక్క‌వ ఆదాయాన్ని పొంద‌చ్చు. 

ఇక్క‌డ ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే ప్రారంభం నుంచి క్ర‌మానుగ‌తంగా చేసే పెట్టుబ‌డులు మ‌దుప‌రుల‌కు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నేర్పిస్తాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాల‌ను స‌రైన స‌మ‌యంలో చేరేందుకు కావాల‌సిన డ‌బ్బును, ఆదా చేయండంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని