రిస్క్ త‌క్కువ ఉండే పథకాల కోసం అన్వేషిస్తున్నారా? - Safe financial investments that come with an assured interest income
close

Updated : 24/06/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిస్క్ త‌క్కువ ఉండే పథకాల కోసం అన్వేషిస్తున్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బు సంపాదన అంత సులభమేమీ కాదు. అందుకే కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్ మార్కెట్ వంటి అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల్లో మదుపు చేయడానికి కొందరు సుముఖత చూపరు. తక్కువ రిస్క్‌తో పెట్టుబ‌డికి భ‌ద్ర‌త‌నిచ్చే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారికి స్థిర ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అన్ని ప‌థ‌కాలు అందరికీ వ‌ర్తించ‌వు. కొన్ని కేవలం సీనియర్ సిటిజన్లు లేదా పదవీ విరమణ చేసిన వారికి వ‌ర్తిస్తే.. మరికొన్ని అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు, ఆడపిల్ల‌ల‌కు వ‌ర్తిస్తాయి. అయినప్ప‌టికీ స్థిరమైన వడ్డీ ఆదాయం ఇస్తూ, పెట్టుబడులను సురక్షితం చేసే మరికొన్ని ఆర్థిక సాధనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది.

సురక్షిత పెట్టుబడుల విషయంలో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎవరికి వారు, వారికి సరిపోయే పెట్టుబడులను ఎంచుకోవాలి. కొంతమంది పెన్షన్ అవసరాల కోసం పెట్టుబడులు పెడితే, మరికొందరు పన్ను ఆదా కోసం, ఇంకొందరు దీర్ఘకాల లక్ష్యాల కోసం మదుపు చేస్తారు. ఇలా ఎవరి అవసరాలను బట్టి వారు, వారికి తగిన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధిక రాబడి కోసం బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ పథకాలలో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాల లక్ష్యాలను చేరుకోవడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇప్పుడు తక్కువ రిస్క్ ఉన్న 12  పెట్టుబడి పథకాల గురించి తెలుసుకుందాం..

1. ప్రధాన మంత్రి వయో వందన యోజన(పీఎమ్‌వీవీవై)..
పీఎమ్‌వీవీవై పథకంలో చేరేందుకు 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు. 10 ఏళ్ల పాటు ఫింఛనుకు హామీ ఉంటుంది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వహిస్తోంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం మార్చి 2023 వరకు పొడిగించారు.

పెట్టుబడులు..
ఈ పథకాన్ని ఎల్ఐసీ మాత్రమే సీనియర్ సిటిజన్లు (60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు) కోసం ఆఫర్‌ చేస్తోంది. అటువంటి వారు ఈ ఫథకంలో ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా గానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు.

పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు కచ్చితమైన పెన్షన్‌ను ఇస్తుంది. ఈ పథకం డెత్ బెనిఫిట్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. మెచ్యూరిటీ నాటికి పాలసీదారుడు జీవించి ఉంటే.. పాలసీ కొనుగోలు చేసిన 10 ఏళ్లకు ఎంత ప్రీమియంకైతే కొన్నారో అది మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. 

ప్రీమియం, పెన్షన్..
ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీలో చేరాల్సి ఉంటుంది. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేయొచ్చు. పెట్టిన సొమ్ముకు తగినట్టు నెలవారీ చెల్లింపులు ఉంటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానకి 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎమ్‌వీవీవై పెట్టుబడులు పెట్టిన వారందరికీ 7.40 శాతం వార్షిక వడ్డీతో నెలవారి పెన్షన్ వస్తుంది. 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయ్యే వరకు  నెలకు రూ.1000 నుంచి ప్రారంభించి గరిష్ఠ పెట్టుబడి పెట్టిన వారికి రూ.9,250 పింఛను వస్తుంది. నెల నెలా వద్దనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికో సారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది.

2. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్-2020 (పన్ను వర్తిస్తుంది)..
ఇవి నూరు శాతం ప్రభుత్వ హామీతో వెనక్కి వచ్చే పెట్టుబడులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు జాతీయ బ్యాంకులు, నాలుగు నిర్దిష్ట ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు. 

కాలపరిమితి, వడ్డీ రేటు..
వీటికి 7 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేటు మారుతుంటుంది. వార్షిక వడ్డీ రేటు 7.15 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి, జులై 1వ తేదీన వడ్డీ చెల్లిస్తారు. కుమ్యులేటివ్ బేసిస్లో వడ్డీ పొందే ఆప్షన్ లేదు.

పెట్టుబడులు..
బాండ్లను కొనుగోలు చేసిన వెంటనే అవి కస్టమర్ బాండ్ లెడ్జర్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్‌ అవుతాయి. వీటిని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయాలి. నగదు రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. అయితే నగదు రూపంలో కొనుగోలు చేస్తే రూ.20వేల పరిమితి ఉంది. ఆన్‌లైన్‌లో అయితే ఎలాంటి పరిమితీ ఉండదు. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ)తో వడ్డీ రేటు ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎన్ఎస్‌సీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లలోని కొన్ని నిర్దిష్ట వర్గాలను కాలపరిమితి కంటే ముందుగానే విత్‌డ్రాలకు అనుమతిస్తారు. 

3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌)..
60 సంవత్సరాలు, ఆ పై వ్యక్తులకు అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో ఈ పథకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. క్రమమైన స్థిర ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. 55 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయసు ఉండి, సూపర్ యాన్యుటేషన్ లేదా వీఆర్ఎస్ కింద పదవీ విరమణ చేసిన వారు కూడా షరతులకు లోబడి సీనియర్ సిటిజన్‌ స్కీమ్‌లో చేరొచ్చు. షరతు ఏంటంటే పదవీ విరమణ ప్రయోజనాలను పొందిన నెల లోపే ఖాతాను తెరిచి ఆ మొత్తాన్ని ఖాతాలో జమచేయాలి. ఖాతాలో జమ చేసిన మొత్తం పదవీ విరమణ ప్రయోజనాలను మించకూడదు. 

పెట్టుబడులు, వడ్డీ..
ఎస్‌సీఎస్ఎస్‌లో ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. ఈ పిరియడ్ తర్వాత కూడా ఖాతాను కొనసాగించాల‌నుకునే వారు మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఖాతాను కొన‌సాగించే ఉద్దేశం ఉన్న వారు మెచ్యూరిటీ పూర్తైన ఏడాదిలోపు మాత్రమే పొడిగించుకోవాలి. ప్రస్తుత త్రైమాసికానికి (ఏప్రిల్ 1 నుంచి జూన్ 30,2021) ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం. వడ్డీని మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరవొచ్చు. రెండు ఖాతాల్లోనూ కలిపి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది.

పన్ను..
ఈ పథకంలో వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం’ శీర్షికన పన్ను విధిస్తారు.

4. సుకన్య సమృద్ధి యోజన‌ (ఎస్ఎస్‌వై)..
ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు ఆర్థిక భ‌రోసా క‌ల్పించేందుకు, ఉన్న‌త విద్య‌, వివాహ స‌మ‌యాల్లో స‌హాయ‌ప‌డేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న పొదుపు ప‌థకం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌. ఇది 21 సంవత్సరాల కాలపరిమితి ఉన్న దీర్ఘకాల పెట్టుబ‌డి పథకం. ఈ పథకాన్ని 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల పేరుపై తెరవొచ్చు. ప్రస్తుతం పాప వయసు 7 సంవత్సరాల అయితే, పాపకి 28 సంవత్సరాలు వచ్చే సరికి మెచ్యూరిటీ మొత్తం చేతికి వస్తుంది. 

పెట్టుబడులు..
ఈ పథకంలో పాప తల్లి లేదా తండ్రి మొదటి 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాతి 6 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండానే పథకం కొనసాగుతుంది. ఖాతాను ప్రారంభించేందుకు క‌నీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం. ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్‌ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే, మీరు రెండు ఖాతాల్లో మొత్తం రూ. 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. న‌గ‌దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డ‌బ్బును డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లించొచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయొచ్చు.

ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు..
ప‌థ‌కంలో చేరిన 21 సంవ‌త్స‌రాల త‌ర్వాత పూర్తి సొమ్ము విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వైద్యపరమైన కారణాల ఉన్నప్పుడు మాత్రమే పథకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించే అవకాశం ఉంది. ఉన్న‌త చ‌దువుల కోసం అమ్మాయికి 18 ఏళ్లు నిండిన త‌రువాత‌ కొంత మొత్తం తీసుకోవ‌చ్చు. మీరు ఈ ఏడాది డ‌బ్బు తీసుకోవాల‌నుకుంటే.. ముందు ఏడాది ఖాతాలో ఉన్న మొత్తం నుంచి గ‌రిష్ఠంగా 50 శాతం విత్‌డ్రా చేసుకునే వీలుంది. వివాహ విష‌యంలో 18 నిండిన‌ట్ల‌యితే ఎస్ఎస్‌వై మూసివేసేందుకు అనుమ‌తిస్తారు. 

ప‌న్ను..
ఇది ట్యాక్స్‌- ఫ్రెండ్లీ పెట్టుబ‌డి. ఎందుకంటే సెక్ష‌న్ 80సి ప్ర‌కారం పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. వ‌డ్డీపై కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు. ప్ర‌భుత్వ హామీ ఉన్న ప‌థ‌కం కాబ‌ట్టి పెట్టుబ‌డుల‌కు, వ‌చ్చే వ‌డ్డీ ఆదాయానికి భ‌ద్ర‌త ఉంటుంది. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీరేటు 7.6 శాతం. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. మెచ్యూరిటీ స‌మ‌యంలో వ‌డ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు. 

5. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)..
అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) ప్ర‌భుత్వ క‌నీస పెన్ష‌న్ హామీ ఇస్తున్న ప‌థ‌కం. ముఖ్యంగా అసంఘ‌టిత రంగాల్లో ప‌నిచేసేవారికి ఇత‌ర పెన్ష‌న్ ప‌థ‌కాల కంటే దీంతో ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. దీన్ని పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఎన్‌పీఎస్ కింద నిర్వ‌హిస్తుంది.
అర్హ‌త‌, పెన్ష‌న్‌..
18 సంవ‌త్స‌రాల నుంచి 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న భార‌తీయ పౌరులు ఈ ప‌థ‌కంలో చేరొచ్చు. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన‌ వారు నెల‌కు రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు స్థిర‌ పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. ఏ వ‌య‌సులో చేరారు? ఎంత కాంట్రిబ్యూట్‌ చేస్తున్నారు? అన్న అంశాల‌పై పెన్ష‌న్ ఆధార‌ప‌డి ఉంటుంది. 60 సంవ‌త్స‌రాలు దాటిన త‌ర్వాత పెన్ష‌న్ రావ‌డం మొద‌ల‌వుతుంది. ఒక‌వేళ చందాదారుడు మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త‌కు అంద‌జేస్తారు. ఇద్ద‌రూ మ‌ర‌ణిస్తే నామినీకి ఈ పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తారు.

6. ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌ (పీపీఎఫ్)..
అధిక రాబ‌డిని ఇచ్చే, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో ఇదీ ఒక‌టి. రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు.. పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, పెళ్లిళ్లు వంటి దీర్ఘ‌కాలిక‌ ల‌క్ష్యాల కోసం పొదుపు చేసేవారికి పీపీఎఫ్ ఒక మంచి పెట్టుబ‌డి మార్గం. 15 సంవ‌త్స‌రాలు నిరంత‌రాయంగా పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. ఏటా క‌నీసం రూ.500 గరిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌లు వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఒక పేరుపై ఒక ఖాతాను మాత్ర‌మే తెరిచే అవ‌కాశం ఉంది. మైన‌ర్ పిల్ల‌ల‌ పేరుపై కూడా ఖాతాను తెర‌వొచ్చు. మైన‌ర్ పేరుతో పాటు, త‌ల్లి/తండ్రి పేరుపై కూడా ఖాతా ఉంటే, రెండు ఖాతాల్లో క‌లిపి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే డిపాజిట్ చేయొచ్చు.  

వ‌డ్డీ, విత్‌డ్రా నియ‌మాలు..
ప్ర‌స్తుత‌ (ఏప్రిల్ 1 నుంచి జూన్‌ 30, 2021 వ‌ర‌కు) వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతం. ఏడాది ప్రాతిప‌దిక‌న కాంపౌండ్ చేస్తారు. వ‌డ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ స‌మ‌యంలో చెల్లిస్తారు. ఖాతా తెరిచిన ఏడో సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. డబ్బు ఉపసంహరించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం లేదా సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం.. ఇందులో ఏది తక్కువ మొత్తమైతే అంతమేర ఉపసంహరించుకోవచ్చు. ఖాతా తీసుకున్న మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకునే వీలుంది. రుణం తీసుకోవాలనుకుంటున్న సంవత్సరానికి ముందు రెండు సంవత్సరాల ఖాతా నిల్వలో 25 శాతం వరకు రుణంగా పొందచ్చు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదో సంవత్సరం వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడులు ప్రారంభించిన తర్వాత, ఖాతాను మొత్తంగా మూసివేసేందుకు అవకాశం ఉంది. కానీ, అందుకు తగిన కారణాలు ఉండాలి. గడువు పూర్తికాకముందే ఖాతాను మూసివేస్తే 1 శాతం వడ్డీ తక్కువగా లభిస్తుంది. 
మెచ్యూరిటీ పీరియ‌డ్ పూర్తైన త‌రువాత డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. లేదా 5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి చొప్పున, ఎన్ని సార్లైనా ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

7. కిసాన్ వికాస్ ప‌త్ర
ఇది పోస్టాఫీసుల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారు, వారి పేరుపై గానీ వారి మైన‌ర్ పిల్ల‌ల పేర్ల‌పై గానీ, ఉమ్మ‌డిగా గానీ కెవీపి ప‌త్రాల‌ను కొనుగోలు చేయొచ్చు.  

పెట్టుబ‌డులు..
క‌నీస పెట్టుబ‌డి రూ.1000. గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. ఎంతైనా పెట్టుబ‌డి పెట్టొచ్చు. కేవీపీని ఒక వ్య‌క్తి నుంచి మ‌రొక వ్య‌క్తికి, ఒక పోస్టాఫీసు నుంచి మ‌రొక ఫోస్టాఫీసుకు బ‌దిలీ చేసుకునే సౌక‌ర్యం కూడా ఉంది. కేవీపీ ప‌త్రాల‌ను కొనుగోలు చేసిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల తర్వాత అవ‌స‌ర‌మైతే ఎప్పుడైనా న‌గ‌దు రూపంలోకి మార్చుకోవ‌చ్చు.

వ‌డ్డీ..
ప్రస్తుత (ఏప్రిల్ 1, జూన్ 30, 2021 వరకు) వార్షిక వ‌డ్డీ రేటు 6.9 శాతం. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. ఇందులో పెట్టిన పెట్ట‌బ‌డి మొత్తం 124 నెల‌ల‌లో రెట్టింపు అవుతుంది. వ‌డ్డీ ఆదాయాన్ని, పెట్టుబ‌డితో పాటు మెచ్యూరిటీ స‌మయంలో చెల్లిస్తారు.

8. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (టీడీ)..
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగా ఉంటుంది. 1,2,3,5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితో వ‌స్తాయి. 5 సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్ ఖాతాపై మాత్ర‌మే సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. అయితే ప‌న్ను మిన‌హాయింపుపై ప‌రిమితి ఉంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం పెట్టే పెట్టుబ‌డుల‌పై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. వ‌డ్డీ ఆదాయం పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. ‘ఇతర వ‌న‌రుల నుంచి వ‌చ్చిన ఆదాయం’ శీర్షిక‌న ప‌న్ను విధిస్తారు. వార్షిక వ‌డ్డీ మాత్ర‌మే ల‌భిస్తుంది. కాంపౌండింగ్ వ‌ర్తించ‌దు.  5 సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు (ఏప్రిల్ 1 నుంచి జూన్ 30,2021 వ‌ర‌కు)  6.7 శాతం.  వడ్డీని వార్షికంగా చెల్లిస్తారు. 

9. జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎస్ఎస్‌సీ)..
చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం భారత ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది. మేజ‌ర్లు వారి సొంత‌పేరుపై జాతీయ పొదుపు ప‌త్రాల‌ను కొనుగోలు చేసేందుకు అర్హులు. ప‌దేళ్లు దాటిన మైన‌ర్లు సంర‌క్ష‌కుడి పేరిట జాతీయ పొదుపు ప‌త్రాలు కొనుగోలు చేయొచ్చు. ఒక జాతీయ పొదుపు ప‌త్రం కొనుగోలుకు క‌నీసం రూ.100 పెట్టుబ‌డి పెట్టాలి. రూ.100, రూ.500, రూ.1000, రూ.10,000 డినామినేషన్లలో పత్రాలు ల‌భ్య‌మ‌వుతాయి. ఒక వ్య‌క్తి గ‌రిష్ఠంగా ఎన్ని ఎన్ఎస్‌సీ లైనా కొనుగోలు చేయొచ్చు. ఎన్ఎస్‌సీ ప‌త్రాల కాల‌ప‌రిమితి 5ఏళ్లు ఉంటుంది.

వ‌డ్డీ, పన్ను మినహాయింపు..
ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు (ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2021 వ‌ర‌కు) 6.8 శాతం. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. మెచ్యూరిటీ స‌మ‌యంలో చెల్లిస్తారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1.5లక్ష‌ల వరకు చేసే డిపాజిట్లకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లేదు.

10. ప్ర‌భుత్వ సెక్యూరిటీలు..
వీటికి ప్ర‌భుత్వ మద్ద‌తు ఉంటుంది. అందువ‌ల్ల ఇందులోని పెట్టుబ‌డులు నూరు శాతం సుర‌క్షితం. రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేష‌న్‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. 

ప్ర‌భుత్వ‌ సెక్యూరిటీల‌ వేలంలో రిటైల్ పెట్టుబ‌డుదారులు పాల్గొనడానికి ప్రభుత్వం ఇంతకుముందు అనుమతించింది. పెట్టుబడిదారులు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ “ఎన్ఎస్ఈ గోబిడ్”, “బీఎస్ఈ డైరెక్ట్” ప్లాట్‌ఫాంల ద్వారా ఈ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులను (టి-బిల్లులు) కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల‌లో పెట్టుబడిదారులు వేలంలో పాల్గొనడానికి ప్రత్యేక ఖాతాలను తెరవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న వారి బ్రోకింగ్ ఖాతాల ద్వారా లావాదేవీలు చేయొచ్చు.

బిడ్డింగ్ కోసం క‌నీసం మొత్తం రూ.10 వేలు (ఫేస్ వాల్యు). రూ.10వేల గుణిజాల‌లో పెట్టుబ‌డులు చేయాలి. మెచ్యూరిటీ కంటే ముందుగానే నిష్క్ర‌మిస్తే మూల‌ధ‌నంపై లాభం లేదా న‌ష్టం ఏదైనా రావొచ్చు. మెచ్యూరిటీ వ‌ర‌కు పెట్టుబ‌డులను కొన‌సాగిస్తే, ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతో పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉంటాయి. 

11. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
స్థిర‌మైన రాబ‌డి కోరుకునే వారు ఎక్కువ‌గా పెట్టుబ‌డి పెట్టేది ఫిక్స‌డ్ డిపాజిట్ల‌లోనే. రాబ‌డి ఎంత అనేది ముందుగానే అంచ‌నా వేయొచ్చు. ఎంచుకున్న బ్యాంకు.. కాల‌ప‌రిమితి ఆధారంగా వార్షికంగా దాదాపు 6 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. ముంద‌స్తు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. అయితే కొంత పెనాల్టీ ప‌డే అవకాశం ఉంది. అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైతే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై రుణ స‌దుపాయం, ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యం వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ల‌భించే వ‌డ్డీ కంటే.. కొంచెం ఎక్కువ వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. 

డిపాజిట్ల‌పై హామీ ఉండ‌దు. బ్యాంక్ దివాళా తీసిన సంద‌ర్భంలో ఖాతాదారుల‌కు డ‌బ్బు చెల్లించడంలో విఫ‌ల‌మైతే బీమా ఉంటుంది. డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ యాక్ట్‌ 1961 ప్ర‌కారం.. అన్ని బ్యాంకుల డిపాజిట్ల‌పై (పొదుపు, ఫిక్స్‌డ్‌, క‌రెంట్‌, రిక‌రింగ్‌) క‌లిపి గరిష్ఠంగా రూ.5 ల‌క్ష‌ల బీమా హామీ ఉంటుంది.  

12. ఇండెమ్నిటి యాన్యూటీలు..
వ‌డ్డీ రేట్ల‌తో సంబంధం లేకుండా జీవితాంతం, క్ర‌మ‌మైన ఆదాయం రావాల‌ని కోరుకునే వారికి ఇండెమ్నిటి యాన్యూటీ ప‌థ‌కాలు స‌రిపోతాయి. రెగ్యుల‌ర్ బేస్‌-లెవెల్ ఆదాయాన్ని అందిస్తుంది కాబ‌ట్టి పొదుపులో కొంత భాగాన్ని ఈ యాన్యూటీల్లో పెట్టుబ‌డి పెట్టడాన్ని ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. పాల‌సీదారుడు స్వ‌యంగా జీవిత కాలం పెన్ష‌న్ పొంద‌డం, త‌న త‌ర్వాత జీవిత భాగ‌స్వామికి పెన్ష‌న్ ఏర్పాటు చేయ‌డం, జీవిత భాగ‌స్వామి త‌ర్వాత నామినికి ప్రీమియం మొత్తం అంద‌జేయడం ఇలా.. 7 నుంచి 10 వ‌ర‌కు వివిధ ర‌కాల పెన్ష‌న్ ఆప్ష‌న్‌లు అందుబాటులో ఉన్నాయి. చెల్లించిన వార్షిక ప్రీమియంపై వార్షికంగా 5 నుంచి 6 శాతం పెన్ష‌న్‌, యాన్యూటీ రాబడి ఉంటుంది. ఇది పూర్తిగా ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి ఆదాయ‌ స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

చివ‌రగా..
ఈ స్థిర-ఆదాయ పెట్టుబడి మార్గాల్లో చాలా వాటికి వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అందువల్ల ప‌న్ను చెల్లించిన త‌రువాత ఎంత ఆదాయం ఉంటుందో లెక్కించాలి. అదే విధంగా ద్ర‌వ్యోల్భ‌ణ ప్ర‌భావాన్ని అధిగ‌మించగ‌ల‌వో లేదో చూడాలి. అప్పుడే నిజ‌మైన రాబ‌డి తెలుస్తుంది. భ‌ద్ర‌త ఉన్న పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకుంటే.. స‌రైన సంప‌ద‌ను సృష్టించుకోలేక‌పోవ‌చ్చు. అందువ‌ల్ల ముందుగా మీ ల‌క్ష్యాల‌ను తెలుసుకోవాలి. వాటికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుని, దాని ప్ర‌కారం మ‌దుపు చేయాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని