చిన్నారి భవితకు.. భరోసా
close

Published : 17/09/2021 03:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి భవితకు.. భరోసా

మా పాప వయసు 16 నెలలు. తన భవిష్యత్‌కు ఉపయోగపడేలా నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ఏయే పథకాలను ఎంచుకోవాలి? వీటిని పన్ను ఆదాకూ ఉపయోగించుకోవచ్చా?

- శ్రావణ్‌

ముందుగా మీ పాప భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం ముందుగా మీరు తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ పాలసీని ఎంచుకోవచ్చు. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలలో.. రూ.5వేలను సుకన్య సమృద్ధి యోజన పథకంలో జమ చేయండి. మిగతా రూ.5వేలను ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సగటున 10 శాతం రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలా 18 ఏళ్లపాటు నెలనెలా రూ.10వేల పెట్టుబడిని కొనసాగిస్తే.. రూ.54,71,900 అయ్యేందుకు అవకాశం ఉంది. ఇవి రెండూ దీర్ఘకాలంలో పన్ను ఆదాకు ఉపయోగపడతాయి.


నా వయసు 53 ఏళ్లు. ఇప్పటి నుంచి పదవీ విరమణ వరకూ ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. టర్మ్‌ పాలసీ తీసుకుంటే బాగుంటుందా? 8 ఏళ్ల తర్వాత కనీసం నెలకు రూ.20వేలు రావాలంటే ఎంత మొత్తం చేతిలో ఉండాలి?

- మధు

మీకు ఎలాంటి బీమా పాలసీ లేకపోతే.. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీకు 65 ఏళ్ల వ్యవధి వచ్చే వరకూ దీన్ని కొనసాగించండి. మీకు 8 ఏళ్ల తర్వాత నెలకు రూ.20వేలు రావాలంటే.. అప్పుడు ఆరు శాతం వార్షిక రాబడి అంచనాతో.. మీ దగ్గర రూ.40లక్షల నిధి ఉండాలి. అంటే ఈ ఎనిమిదేళ్లలో మీరు కనీసం రూ.40లక్షలు జమ చేయాలన్నమాట. దీనికోసం 11 శాతం రాబడి అంచనాతో.. నెలకు దాదాపు రూ.28వేల వరకూ మదుపు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించండి.


నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.25 వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.6వేల వరకూ మదుపు చేయగలను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలి?

- సాయిచంద్ర

మీపై ఎవరైనా ఆధారపడి ఉంటే ముందుగా జీవిత బీమా పాలసీ తీసుకోండి. ఆరోగ్య బీమా పాలసీ, వ్యక్తిగత ప్రమాద, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధి ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.6వేలలో రూ.2వేలను ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో, రూ.4వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు.

- తుమ్మ బాల్‌రాజ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని