మా చేతినిండా ప్రాజెక్టులున్నాయ్‌!
close

Updated : 22/09/2021 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా చేతినిండా ప్రాజెక్టులున్నాయ్‌!

దేశీయంగా తవ్వోడలు తయారు చేస్తాం
వనరులు సమకూర్చుకుంటున్నాం
అంతర్వేది డ్రెడ్జింగ్‌ శిక్షణ సంస్థకు సిద్ధం
డీసీఐఎల్‌ ఎండీ, సీఈవో  జి.వై.వి.విక్టర్‌  

మూడు సాగరాల నడుమ ఉన్న దేశ ఆర్థికాభివృద్ధిలో ఓడరేవుల పాత్ర అనిర్వచనీయం. ఆయా పోర్టుల్లో డ్రెడ్జింగ్‌ (పూడిక తీత) ప్రక్రియ నిరంతరం సాగుతుండాలి. ఈ క్రతువులో కీలకంగా వ్యవహరిస్తోంది డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐఎల్‌). పూడికతీతకు కావాల్సిన తవ్వోడ (డ్రెడ్జర్‌)లను ఇప్పటి వరకు విదేశాలను దిగుమతి చేసుకుంటుండగా, ఇకపై దేశంలోనే నిర్మించాలన్న కేంద్ర ప్రణాళికను సాకారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 3 భారీ తవ్వోడల నిర్మాణానికి డీసీఐఎల్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు ‘ఈటీవీ’ ఇంటర్వ్యూలో డీసీఐఎల్‌ ఎండీ, సీఈవో జి.వై.వి.విక్టర్‌ తెలిపారు. ముఖ్యాంశాలివీ..

దేశంలో పూడిక తీత అవసరం ఎంత ఉంది

దేశం చుట్టూ 3 సముద్రాలున్నంద]ున, రానున్న పదేళ్లలో 310 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుందని అంచనా. దేశీయ అవసరాలను 85 శాతం డీసీఐఎల్‌ తీరుస్తోంది. 12 మేజర్‌ పోర్టులు, పలు మైనర్‌ పోర్టులు, చేపల రేవులు, నేవీ, కోస్ట్‌గార్డు అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. వీటి లోతు 12, 14, 16... కొన్ని చోట్ల 20 మీటర్ల వరకే ఉంది. అత్యంత భారీ నౌకలు రావాలంటే ఈలోతు మరింత పెంచేందుకు భారీ తవ్వోడలు కావాలి. మా వద్ద 10 చిన్నవి, మరో 10 పెద్ద తవ్వోడలున్నాయి. వీటి గరిష్ఠసామర్థ్యం 7500 హాపర్లు. వీటితో  ఏడాదికి 80 - 90 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేయగలం. 100 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల పూడిక తీసే పనులు మా చేతిలో ఉన్నాయి. కోచి షిప్‌ యార్డులో 12,000 హాపర్ల సామర్థ్యం గల తవ్వోడ నిర్మాణం కోసం డీసీఐఎల్‌, కోచి షిప్‌ యార్డు, హాలెండ్‌లోని ఐఎస్‌పీ సంస్ధలు ఒప్పందం చేసుకోబోతున్నాయి. మూడేళ్లలో ఒకటి, 2030 కల్లా మరో రెండు భారీ డ్రెడ్జర్లు సమకూర్చుకోవాలన్నది మా లక్ష్యం.

ప్రిఫర్డ్‌ కాంట్రాక్టర్‌ హోదా కలిసొచ్చిందా

విశాఖ, పారదీప్‌, జేఎన్‌పీటీ, కాండ్లా పోర్టుల సంయుక్త నిర్వహణలోని డీసీఐఎల్‌ ఇంతవరకు డ్రెడ్జింగ్‌ గుత్తేదారుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం అన్ని పోర్టులకు ‘ప్రిఫర్డ్‌ కాంట్రాక్టర్‌ హోదా’ లభించడంతో, నేరుగా పనులు పొందే అర్హత వచ్చింది. మేం టెండర్లు వేయాల్సిన అవసరం లేదు. మరిన్ని పనులు లభిస్తాయి.. ఇదే సమయంలో బాధ్యతా పెరిగింది.  కరోనా పరిణామాల వల్ల మేమూ నష్టాల్లోకి వెళ్లినా, కోలుకుంటున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి లాభాల బాట పడతాం. మేం అన్ని కాలాల్లో, 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో తీరానికి సమీపంలో మేం పూడిక తీసే దాదాపు 100 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఇసుక, మట్టి, రాళ్లు మళ్లీ సాగరం లోపల పడేస్తాం. దీనిని సంపదగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించేందుకు సొంతంగా ఒక ప్రయోగశాలను ఇటీవలే ఏర్పాటుచేశాం. విదేశాలలో ఇప్పటికే ఈ తరహా కార్యకలాపాలు నడుస్తున్నాయి.

సముద్రంలో-నదిలో డ్రెడ్జింగ్‌కు తేడా ఏమిటి

నౌకలు ఓడరేవులోకి రావాలంటే తగినంత లోతు ఉండాలి. ఆ ప్రాంతంలో మేం నిరంతరం పూడిక తీయాలి. భారీ రవాణా నౌకల రాకపోకలకు తగినట్లుగా లోతు ఉండాలి. అకస్మాత్తుగా వాతావరణ మార్పులు జరిగితే తట్టుకునేలా ప్రణాళిక ఉండాలి. తీసిన ఇసుక, ఇతరత్రాలు తరలింపు ప్రక్రియ ప్రమాద రహితంగా సాగాలి. సముద్రంలో చేసినంత వేగంగా నదుల్లో పూడిక తీత సాధ్యపడదు. నదిలో అంత లోతు చేయాల్సి అవసరం ఉండదు కానీ, నదీ గమనానికి అనుకూలంగానే పని చేయాలి. డ్యామ్‌లలో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు పూడిక తీత ఎంతో అవసరం. వరదలొచ్చినా తట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. 6 ప్రధాన ప్రాజెక్టులను కేరళ ప్రభుత్వం మాకు అప్పగించింది. రాజస్థాన్‌లోని బిసాల్‌పూర్‌ డ్యాంలో 200 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల డ్రెడ్జింగ్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది చేయడానికి మాకు 20 ఏళ్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల్లో డ్రెడ్జింగ్‌ అవసరం. జాతీయ జల మార్గాల ప్రాజెక్టులో ఈ ఖర్చు కేంద్రమే భరించే అవకాశం ఉంది.

తూర్పుగోదావరి జిల్లాలోని ‘అంతర్వేది డ్రెడ్జింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాజెక్టు’ ఎంతవరకు వచ్చింది

ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాం. మాకు భూమిని అప్పగిస్తే పనిని ప్రారంభిస్తాం. ముందుగా హార్బర్‌ సిద్ధం చేసి ఆపై శిక్షణ సంస్థ ఏర్పాటు చేస్తాం. ఈ నివేదికకు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌కి అందించాం. నిర్వహణ విభాగం కూడా ప్రారంభిస్తాం. 6 నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రావొచ్చు. మొత్తం రూ. 2,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ నిధులను డీసీఐఎల్‌ సమకూర్చుకోవాల్సిందే.

విదేశీ ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా

విదేశీ సంస్థలతో పోటీ పడుతూ, పరిశోధనపైనా దృష్టిసారించాం. దేశీయంగా లక్షద్వీప్‌ నిర్వహణ కాంట్రాక్ట్‌ చేపడుతున్నాం. తొలుత పదేళ్లకు, ఆ తర్వాత మరో దశాబ్దం పాటు ఈ దీవుల షిప్పింగ్‌ నిర్వహణకు అవసరమైన అంశాలన్నింటిని మేమే పర్యవేక్షిస్తాం. అంతర్జాతీయంగా పెద్దదైన అబుదాబీ నేషనల్‌ మెరైన్‌ డ్రెడ్జింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నందున, ఇతర దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుంటుంది. భిన్న అంశాల పరంగా ప్రపంచంలో డీసీఐఎల్‌ ఏడో స్థానంలో ఉండగా, ప్రథమ స్థానానికి చేర్చాలన్నదే లక్ష్యం. 

- ఈటీవీ, విశాఖపట్నం


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని