కారు కొనే వేళలో.. కాస్త వీటినీ పట్టించుకోవాలి!
close

Updated : 24/09/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు కొనే వేళలో.. కాస్త వీటినీ పట్టించుకోవాలి!

మహమ్మారి ప్రభావంతో.. సొంత వాహనాలలో ప్రయాణించేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.  అందుకే, ఇతర రంగాలతో పోలిస్తే వాహన రంగం తొందరగా కోలుకుంది. ఇక పండగల సమయంలో చాలామంది సొంత కారు కొనే ప్రయత్నాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో కారు కొనేముందు.. రుణం తీసుకునే ముందు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటో చూద్దామా..

విజయదశమి నాటికల్లా కొత్త కారు ఇంటికి తీసుకురావాలనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది. దానికి తగ్గట్టే ఇప్పటి నుంచి ప్రణాళికలూ సిద్ధం చేసుకుంటారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు కాస్త వీటినీ పట్టించుకోవాలి..

సరైన సమయమేనా...

కారు కొనడం ఒక కల చాలామందికి. అయితే, కొంత సొంత డబ్బు, మిగతా రుణం తీసుకొని సులభంగానే కారు సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఇప్పటికే మీకు ఇతర అప్పులు ఉంటే.. కొత్తగా వచ్చే వాహన రుణంతో మీపై ఆర్థికంగా భారం ఎంత మేరకు ఉండవచ్చనేది చూసుకోండి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ మొత్తం ఆదాయంలో 40శాతానికి మించి ఈఎంఐలు ఉండకుండా చూసుకోండి. కారు నిర్వహణ ఖర్చులనూ బేరీజు వేసుకోండి.

బడ్జెట్‌ చూసుకోండి..

కారు బ్రాండ్‌, మోడల్‌ ఏది అనేది ముందుగానే నిర్ణయించుకోండి. దీనికి కొంత సమయం తీసుకున్నా ఇబ్బంది లేదు. కారు కొన్నాక ఆలోచించడంకన్నా.. ముందే అన్నీ నిర్ణయించుకోవడం వల్ల.. ఎలాంటి చిక్కులూ లేకుండా మనకు నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చు. చాలామంది కారును కొనేది ఒకేసారి కదా.. అనుకుంటూ.. తమ స్తోమతకు మించి ఖర్చు చేయడానికి వెనకాడరు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతుంటారు.

వడ్డీ భారం కాకుండా..

ప్రస్తుతం కారు రుణాలు 7.25 శాతం నుంచి 9.5శాతం వరకూ లభిస్తున్నాయి. కొన్నిసార్లు డీలర్లు రుణం ఎక్కువగా తీసుకున్నప్పటికీ... మీపై భారం తక్కువగా ఉంటుందని ఈఎంఐని తక్కువ చేసి చూపిస్తారు. ఇది మిమ్మల్ని ఆకర్షించేందుకే అని గమనించాలి. రుణ వ్యవధిని పెంచినప్పుడు తక్కువ ఈఎంఐ ఉంటుంది. ఇదే సమయంలో వడ్డీ భారంగా మారుతుందనేది మర్చిపోవద్దు. కారు మోడల్‌, ఎంచుకున్న వ్యవధి  ఆధారంగా వడ్డీ రేటులో తేడా ఉంటుంది.

ఇతర ఖర్చుల సంగతి..

కారు ఎక్స్‌ షోరూం ధరలో 80-90శాతం వరకూ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి. ఎక్స్‌ షోరూం ధరకు అదనంగా పన్ను, బీమా తదితరాలు ఉంటాయి. ఇవన్నింటినీ కలిపితే ఆన్‌రోడ్‌ ధర అంటాం. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆన్‌రోడ్‌ ధరపైనే 80-90శాతం వరకూ రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతుంటాయి. మీ దగ్గర సొంత డబ్బు సరిపోయేంత లేకపోతే ఇలాంటి వెసులుబాటును వినియోగించుకోవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని