రూ.12 లక్షల కోట్ల అప్పు తప్పదు
close

Published : 02/02/2021 04:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.12 లక్షల కోట్ల అప్పు తప్పదు

నిర్మలా సీతారామన్‌ వెల్లడి

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రభుత్వం రూ.12.05 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనా రూ.12.80లక్షల కోట్ల కంటే ఇది తక్కువని వివరించారు. సవరించిన అంచనాల మేరకు ఈ ఏడాది రూ.12.8లక్షల కోట్లు రుణం పొందామని ఇది బడ్జెట్‌ అంచనా (రూ.7.8 లక్షల కోట్లు) కంటే 64శాతం అధికమన్నారు. వచ్చే ద్రవ్య సంవత్సరంలో రూ.34.83 లక్షల కోట్లు వ్యయం అవుతుందని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో రూ.5.56లక్షల కోట్లు పెట్టుబడి వ్యయమని వివరించారు. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం మార్కెట్ల నుంచి రుణాలు స్వీకరిస్తుందని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో మాకు మరో రూ.80వేల కోట్లు అవసరమవుతాయి. రానున్న రెండు నెలల్లో ఈ మొత్తాన్ని మార్కెట్ల నుంచి రుణంగా తీసుకుంటాం’’అని తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.. 15వ ఆర్థిక కమిషన్‌ ప్రతిపాదనల మేరకు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు 41శాతం వాటా లభిస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్‌ పద్ధతిలో వ్యాపారాలు నిర్వహించే రూ.10కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి మినహాయింపును రెట్టింపు చేసినట్లు తెలిపారు. డివిడెండ్‌ చెల్లించిన తరవాతే డివిడెండ్‌ ఆదాయంపై ముందస్తు పన్ను చెల్లింపు సదుపాయం లభిస్తుందని ఆమె చెప్పారు.
2021-22 జీడీపీలో ద్రవ్యలోటు 6.8% నమోదు కావచ్చని కేంద్రం అంచనా! 2025-26 నాటికల్లా లోటును 4.5 శాతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని నిర్మల తెలిపారు.

ట్యాబ్‌ చూస్తూ ప్రసంగం

దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌ 2021-22కి సోమవారం ఉదయం ఆమోద ముద్ర వేసింది. అనంతరం నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను తొలిసారిగా  కాగిత రహిత విధానంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అధికార పక్షం వైపు బల్లల్లో రెండో వరుసలో నిలుచున్న నిర్మలా సీతారామన్‌... అక్కడి నుంచే బడ్జెట్‌ ప్రతులను ట్యాబ్‌లో చూస్తూ చదివారు. సరిగ్గా అదే సమయంలో శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌శిమ్రత్‌కౌర్‌ బాదల్‌, ఆప్‌ సభ్యుడు భగవంత్‌ మాన్‌, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ సభ్యుడు హనుమాన్‌ బేణీవాల్‌లు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని