సంపద, శ్రేయస్సుకు ఊతమిచ్చే బడ్జెట్‌ ఇది
close

Updated : 02/02/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపద, శ్రేయస్సుకు ఊతమిచ్చే బడ్జెట్‌ ఇది

ప్రధాని మోదీ

దిల్లీ: పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పట్టం కట్టేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. ప్రధానంగా రైతులు, గ్రామీణులకు లబ్ధి చేకూర్చనుందని, దీంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలనూ మెప్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో బడ్జెట్‌ రూపొందింది. గ్రామీణులు, రైతులు దాని హృదయంలో ఉన్నారు’’ అని మోదీ చెప్పారు. సామాన్య ప్రజలతో పాటు పెట్టుబడిదారులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేలా ఈ బడ్జెట్‌ ఉందని అన్నారు. వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా, పురోగతి పథంలో విశ్వాసాన్ని నింపేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. ‘‘అభివృద్ధికి నూతన మార్గాలను విస్తృతం చేయడం, యువతకు వినూత్న అవకాశాలు సృష్టించడం, మానవ వనరులను కొత్త దిశలో నడిపించడం, మౌలిక సదుపాయాల కల్పనకు నూతన రంగాలను అభివృద్ధి చేయడం, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోవడం లాంటి లక్ష్యాలతో బడ్జెట్‌ రూపొందించాం’’ అని పేర్కొన్నారు. ఇది సంపదకు, శ్రేయస్సుకు ఊతమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు. లద్దాఖ్‌ సహా ఈశాన్య భారతం, దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పెట్టుబడులను రెండింతలు చేశామని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషణ, సురక్షిత నీరు, అవకాశాల్లో సమానత్వం తదితర అంశాలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధానాల ద్వారా సామాన్యులు, మహిళలు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల్లో మెరుగైన కేటాయింపులు, విధానపరమైన సంస్కరణల ద్వారా ఉద్యోగ కల్పన, అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని