రైల్వే బడ్జెట్‌ 1.10 లక్షల కోట్లు
close

Updated : 02/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైల్వే బడ్జెట్‌ 1.10 లక్షల కోట్లు

న్యూదిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 1.10 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో రూ. 1.07 లక్షల కోట్లు మూలధన వ్యయం. కేంద్రం రైల్వే బడ్జెట్‌లో భవిష్యత్తు అవసరాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ‘జాతీయ రైల్వే ప్రణాళిక - 2030’ను దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు జరిపినట్లు ఆర్థికమంత్రి చెప్పారు. భారత్‌లో తయరీ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు రవాణా ఛార్జీలు భారీగా తగ్గించే లక్ష్యంతో సరకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2022 నాటికి తూర్పు, పశ్చిమ కారిడార్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సోనెనగర్‌ - గోమో మధ్య 263 కిలోమీటర్ల తూర్పు కారిడార్‌లో కొంతమేర ఈ ఏడాది పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతామని తెలిపారు. అలాగే గోమో - దాంకుని మధ్య 274.3 కిలోమీటర్ల మేర మొదలుకానుందన్నారు.
ఖరగ్‌పూర్‌- విజయవాడ, ఇటార్సి - విజయవాడ
ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌లో భాగంగా ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ, ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌లో భాగంగా భుసవాల్‌ - ఖరగ్‌పూర్‌ - దాంకుని, నార్త్‌ - సౌత్‌ కారిడార్‌లో భాగంగా ఇటార్సి నుంచి విజయవాడ రవాణా కారిడార్లు భవిష్యత్తు అవసరం కోసం సిద్ధమవుతాయన్నారు.
బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ
బ్రాడ్‌గేజ్‌ మార్గం విద్యుదీకరణ ఈ ఏడాది చివరి నాటికి 72% మేరకు అంటే 46,000 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబరు నాటికి 41,548 కిలోమీటర్ల మేర పూర్తయిందని గుర్తుచేశారు. 2023 చివరినాటికి మొత్తం విద్యుదీకరణ పూర్తవుతుందన్నారు.
ప్రయాణికుల భద్రతపై..
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన రక్షణ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. దీనికి మరింత ముందుకు తీసుకువెళ్లేలా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆటోమేటిక్‌గా గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడతాం. దీనివల్ల మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదాలు తప్పుతాయి’’ అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో విస్టాడోమ్‌ కోచ్‌లను ప్రవేశపెడతామని చెప్పారు.
ఇది మార్పునకు సూచిక..  రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ
భవిష్యత్తుకు బాటలు వేసే.. మార్పును సూచించే బడ్జెట్‌ ఇదని రైల్వేబోర్డు ఛైర్మన్‌, సీఈఓ సునీత్‌ శర్మ అన్నారు. సాంకేతికత, ప్రయాణికుల భద్రత, వారికి మెరుగైన సేవలు అందించడం, రైళ్ల సమయపాలన, సరకు రవాణా తదితర అంశాలపై బడ్జెట్‌లో ఎక్కువగా దృష్టి పెట్టారన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలను పెంచడం, ఆధునిక సాంకేతికతను పెంచుకోవడం, మరిన్ని టెర్మినళ్లను అందుబాటులోకి తేవడం, రైళ్ల వేగాన్ని, సిగ్నలింగ్‌ వ్యవస్థను, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో గూడ్స్‌ రైళ్ల వేగం 23 కిలోమీటర్ల నుంచి 46 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కనీసం 150 ప్రైవేటు రైళ్లు, తేజాస్‌ రైళ్లు, పర్యాటకుల కోసం విస్టాడోమ్‌ కోచ్‌ రైళ్లు, అందుబాటు ధరలో ఉండేలా మరిన్ని 3వ తరగతి ఏసీ బోగీలు, బోగీలోనే అనౌన్స్‌మెంట్‌ విధానం, ఉష్ణోగ్రత నియంత్రణ వంటి సదుపాయాలు ఉండే స్మార్ట్‌ కోచ్‌ల వంటివి ముందుముందు అందుబాటులోకి వస్తాయంటూ రైల్వే భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు. ఇస్రో ఉపగ్రహాల ఆధారంగా ఇప్పటికే 6,500 రైళ్లను ట్రాకింగ్‌ చేస్తున్నామని చెప్పారు.

రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలివి..

రైల్వేకు మొత్తం కేటాయింపు రూ. 1,10,055 కోట్లు
మూలధన వ్యయం రూ. 1,07,100 కోట్లు

ప్రైవేటు కూత

గూడ్సు రైళ్ల వేగం గంటకు 23 కి.మీ. నుంచి 46 కి.మీ.కి పెరిగింది.

‘నూతన భారతం-నూతన రైల్వే’ అన్న విధానం కింద ఈ రంగంలో ప్రయివేటు సంస్థలకు పచ్చ జెండా ఊపారు. 150 ఆధునిక రైళ్లను ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ రానున్న మే నాటికి పూర్తి కానుంది.

గత బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా కిసాన్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. జనవరి 8వ తేదీ నాటికి 120 ట్రిప్పులు తిరిగి 34వేల టన్నుల సరకులు రవాణా చేశాయి.
కరోనా కారణంగా రైళ్ల సేవలను నిలిపి వేయడంతో టైమ్‌ టేబుల్‌ ఆధారంగా నడిచే ప్రత్యేక పార్శిల్‌ సేవల రైళ్లను నడిపింది. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే ప్రథమం. దీనివల్ల కొరియర్‌, ఈ-బిజినెస్‌ సంస్థలు లబ్ధి పొందాయి.
గూడ్సు రైళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న లైన్లు (డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు-డీఎఫ్‌సీ) పూర్తయితే వాటి వేగం గంటకు 76 కి.మీ.వరకు ఉంటుంది.
పశ్చిమ బెంగాల్‌లోని సోన్‌నగర్‌-డాంకుని సెక్షన్‌లో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రత్యేకంగా గూడ్సు లైను నిర్మాణం జరుగుతోంది.
విద్యుదీకరణ ప్రస్తుతం 66 శాతం పూర్తి కాగా, 2023 నాటికి 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది 55 రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని