బడ్జెటోత్సాహమే
close

Published : 03/02/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెటోత్సాహమే

వరుసగా రెండో రోజూ భారీ లాభాల్లో మార్కెట్‌
1,197 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

మళ్లీ 50000 మైలురాయిని తాకి వచ్చిన సూచీ
మరో రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
సమీక్ష

స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ఉత్సాహం వరుసగా రెండో రోజూ కొనసాగింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, మౌలిక రంగాల షేర్ల జోరుతో సూచీలు మంగళవారమూ భారీ లాభాలతో ముగిశాయి. మూలధన ప్రణాళికలకు అధిక కేటాయింపులు, ప్రత్యక్ష పన్నులను యథాతథంగా ఉంచడం, మూలధన లాభాలపై పన్నుల పెంపు లేకపోవడం మదుపర్లను కొనుగోళ్ల వైపు మొగ్గు చూపేలా చేశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల అండ కూడా కలిసొచ్చింది. జనవరి 22న 50,000 పాయింట్ల మైలురాయిని తాకిన, సెన్సెక్స్‌ పదిరోజుల్లో మరోసారి ఆ మైలురాయిని తాకి, కిందకు వచ్చింది. సూచీల దూకుడుతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ మరో రూ.4,14,814 కోట్లు పెరిగి   రూ.1,96,60,898.02 కోట్లకు చేరింది.
లాభారంభమే: ఉదయం సెన్సెక్స్‌ 592 పాయింట్ల లాభంతో 49,193.26 పాయింట్ల వద్ద ఆరంభమైంది. కొనుగోళ్ల అండతో మళ్లీ 50000 ఎగువకు వెళ్లి 50,154.48 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. ఆ తర్వాత కాస్త జోరు నెమ్మదించడంతో 49,193.26 పాయింట్లకు దిగివచ్చింది. చివరకు  1197.11 పాయింట్ల లాభంతో 49,797.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 366.65 పాయింట్లు పెరిగి 14647.85 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్‌ రోజు వచ్చిన లాభాలనూ కలిపితే ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 3,511 పాయింట్లు, నిఫ్టీ 1,007.25 పాయింట్లు చొప్పున లాభపడగా.. మదుపర్ల సంపద రూ.10.48 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 6 పైసలు పెరిగి 72.96 వద్ద ముగిసింది.
మళ్లీ మూడే డీలా
బడ్జెట్‌ రోజు మాదిరి మంగళవారం కూడా సెన్సెక్స్‌ 30 షేర్లలో మూడు మాత్రమే నష్టపోగా, మిగిలినవి లాభాలతో ముగిశాయి. నష్టపోయిన వాటిల్లో టైటాన్‌ (1.08%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (2.34%), హెచ్‌యూఎల్‌ (0.77%) షేర్లు ఉన్నాయి. అత్యధికంగా ఎస్‌బీఐ 7.10 శాతం వరకు రాణించింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6.7%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 5.63%, ఎల్‌అండ్‌టీ 1.82%, భారతీ ఎయిర్‌టెల్‌ 3.54%, మారుతీ సుజుకీ 3.45% మేర పెరిగాయి. బీఎస్‌ఈలో 1,755 షేర్లు సానుకూలంగాను, 1,184 కంపెనీల షేర్లు ప్రతికూలంగాను ముగిశాయి. 175 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
* వాహన కంపెనీల షేర్లు రెండో రోజూ దుమ్మరేపాయి. టాటా మోటార్స్‌ 15.21%, అశోక్‌ లేలాండ్‌ 8.22%, టీవీఎస్‌ మోటార్‌ 7.54%, మారుతీ సుజుకీ 3.45%, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.67%, బజాజ్‌ ఆటో 2.11% మేర పెరిగాయి.

6 రోజుల్లో పోయాయ్‌.. 2 రోజుల్లో వచ్చాయ్‌..
బడ్జెట్‌కు ముందు 6 రోజుల్లో 3506 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌, 2 రోజుల్లో ఆ మొత్తాన్ని పెంచుకుంది.

డిసెంబరు కల్లా 55000కు సెన్సెక్స్‌

మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

బడ్జెట్‌ ప్రతిపాదనలు నింపిన ఉత్సాహంతో రెండు రోజుల్లోనే 3500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌.. ఆ జోరును మున్ముందు  కొనసాగించే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు కల్లా 55000 పాయింట్ల మైలురాయిని తాకే అవకాశం ఉందని పేర్కొంది. అంటే ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుతుందన్నమాట. కోటక్‌ సెక్యూరిటీస్‌ కూడా సెన్సెక్స్‌ లక్ష్యాన్ని సవరించింది. ఈ ఏడాది చివరికల్లా 51000 పాయింట్లను చేరుతుందని అంచనా వేస్తోంది. ఇంతకుముందు వేసిన అంచనాల్లో 2021 డిసెంబరు ఆఖరుకు 46000 పాయింట్లకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. నిఫ్టీ లక్ష్యాన్ని కూడా 13,500 పాయింట్ల నుంచి 15000 పాయింట్లకు మార్చింది.

ఇండిగో పెయింట్స్‌ అదుర్స్‌

నమోదు రోజే 109% పెరిగిన షేరు

ఇండిగో పెయింట్స్‌ షేరు అదరగొట్టింది. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తొలి రోజే 109 శాతానికి పైగా పెరిగింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధరైన రూ.1,490 కంటే 75 శాతం అధికంగా రూ.2,607.50 వద్ద షేరు నమోదైంది. ఆ తర్వాత 110% వరకు పెరిగి రూ.3,129ను చేరింది. చివరకు 109.30% లాభంతో రూ.3,118.65 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.2,607.50 వద్ద నమోదైన షేరు 109.20% పెరిగి రూ.3117 వద్ద స్థిరపడింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని