నెట్ బ్యాంకింగ్‌ సేఫ్టీ కోసం ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. - online-banking-safety-tips
close

Updated : 08/05/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెట్ బ్యాంకింగ్‌ సేఫ్టీ కోసం ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..


తీరిక లేని జీవితాల్లో ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు చ‌క్క‌టి ప‌రిష్కార‌మే ఆన్‌లైన్ బ్యాంకింగ్‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ల్లో బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంట‌ర్నెట్‌తో అనుసంధాన‌మున్న కంప్యూట‌ర్‌/మొబైల్ ద్వారా ఎన్నో బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపులు, షాపింగ్, ఇత‌ర‌ కొనుగోళ్లు  జ‌ర‌ప‌వ‌చ్చు. లావాదేవీ చేసే స‌మ‌యంలో ఖాతా వివ‌రాలు న‌మోదుచేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే అద‌నుగా ఆన్‌లైన్‌లో పొంచి ఉన్న ప్ర‌మాదాలు ఖాతా వివ‌రాల‌పై దాడి చేసి, సొమ్మును అప‌హ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాయి. ఆన్‌లైన్ లావాదేవీ నెరిపేట‌ప్పుడు ఒళ్లంతా క‌ళ్లు చేసుకొని ఉండాల్సిందే. లేక‌పోతే చిక్కుల్లో ప‌డిపోవ‌డం ఖాయం.

పబ్లిక్ కంప్యూటర్లు / వై-ఫై నెట్‌వర్క్‌లను వాడ‌కండి..
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవకాశం ఎక్కువ‌గా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవ‌డం మంచిది.  పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు తరచుగా ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయి.

"కొంత‌మంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో వేరే వాళ్ళ కంప్యూట‌ర్ ద్వారా, ప‌బ్లిక్ వై-ఫ్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో స‌మాచారం దొంగిలించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల మీరు తొంద‌ర‌లో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ వాడిగానీ, పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయ‌కూడ‌దు.  అన్ని ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్య‌క్తిగ‌త కంప్యూటర్, వై-ఫై ల‌ను మాత్ర‌మే వాడాలి." అని వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అనిల్ పినపాల తెలిపారు. 

వెబ్‌సైట్ చిరునామా స‌రిచూసుకోండి..
బ్యాంకు సంబంధిత వెబ్ చిరునామా అక్ష‌రాల‌ను క‌చ్చితంగా చూసుకోవాలి. త‌ప్పుడు వెబ్‌సైట్ల‌తో మీ బ్యాంకు ఖాతా వివ‌రాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగు చేసేట‌పుడు ఇత‌ర వెబ్‌సైట్లు తెరిచి స‌ర్ఫింగ్ చేయ‌డంలాంటివి మానుకోండి. మెయిల్స్ పంప‌డం వంటివి ఆ స‌మ‌యంలో చేయ‌కండి. వెబ్ సైటు అడ్ర‌స్ ముందు https: అని ఉంటే భ‌ద్ర‌త‌తో ఉంద‌ని భావించాలి.

ఫిషింగ్ వ‌ల‌లో ప‌డ‌కండి..
ఫోన్ ద్వారా మోస‌పుచ్చి వ్య‌క్తిగ‌త ఆర్థిక స‌మాచారం రాబ‌ట్టి గుర్తింపు వివ‌రాల‌ను దొంగ‌లించ‌డాన్నే ఫిషింగ్ అంటారు. బ్యాంకు మెయిల్ ఐడీని పోలినట్టుగానే కొన్ని మెయిల్ ఐడీలు వ‌స్తాయి. వీటిల్ల‌నో కొన్ని లింకులు పంపుతారు. ఆ లింకుల‌పై క్లిక్ చేసి వైబ్ సైటు తెరిస్తే మీ బ్యాంకు ఖాతా,ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని అడుగుతుంది.

లాట‌రీ గెలిచారా..
మీరు లాట‌రీలో పెద్ద మొత్తం గెల్చుకున్నార‌ని అప‌రిచిత‌ వ్య‌క్తుల‌నుంచి మెయిల్స్ వ‌స్తాయి. అందులో మీ పేరు బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివ‌రాల‌ను అడుగుతారు. అలాంటి వాటికి స్పందించ‌కండి. భారీ మొత్తంలో లాట‌రీ త‌గిలింద‌ని, అయితే ఆ సొమ్ముపై ఛార్జీల రూపేణ కొంత డిపాజిట్ చేస్తేనే లాట‌రీ సొమ్ము రిలీజ్ చేయ‌గ‌ల‌మ‌ని, కొంత మొత్తాన్ని బ‌దిలీ చేయాల్సిందిగా అవ‌త‌లి వ్య‌క్తులు కోర‌తారు. మ‌నం దాన్ని నిజంగానే న‌మ్మి డ‌బ్బులు జ‌మ‌చేశామో. ఇక మోస‌పోయిన‌ట్టే. ఇలాంటి ఉదంతాలు రోజూ ప‌త్రిక‌ల్లో మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉంటాయి. లాట‌రీ మెయిళ్ల‌కు స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిది.

బ్యాంకు ఉద్యోగుల‌మంటూ బురిడీ..
వివిధ మార్గాల ద్వారా ఖాతా సంఖ్య‌ను, ఆన్‌లైన్‌ లావాదేవీ స‌మాచారాన్ని మోస‌గాళ్లు సేక‌రిస్తారు. ఒక్కోసారి బ్యాంకు ఉద్యోగిలాగానో, ఆర్బీఐ ప్ర‌తినిధి అనో చెప్పి ప‌రిచ‌యం చేసుకుని భ‌ద్ర‌తా ప్ర‌క్రియ‌లో భాగంగా ఫోన్ చేసిన‌ట్లు న‌మ్మ‌బ‌లుకుతారు. నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ (పిన్) వంటివి అడుగుతారు. పొర‌పాటున వాటిని వెల్ల‌డిస్తే మీ ఖాతా భ‌ద్ర‌త ఇర‌కాటంలో పెట్టిన‌ట్టే.

నెట్ బ్యాంకింగ్ పాస్ వ‌ర్డ్ / యూజ‌ర్ ఐడీ, ఫోన్ బ్యాంకింగ్ పాస్ వ‌ర్డ్, ఏటీఎమ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పిన్ మొద‌లైన‌ వ్య‌క్తిగ‌త ర‌హ‌స్య స‌మాచారాన్ని బ్యాంకు సిబ్బందితో స‌హా ఎవ‌రితోనూ పంచుకోవ‌ద్దు.

 మోస‌పూరిత యాప్‌లతో జాగ్ర‌త్త..
యాప్ స్టోర్‌, ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చ‌ట్ట‌విరుద్ధ‌మైన యాప్‌లు ఉండే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల స‌మీక్ష‌కులు ఇచ్చే రివ్యూల‌ను ప‌రిశీలించండి. త‌క్కువ సంఖ్య‌లో డౌన్‌లోడ్‌లు ఉన్న యాప్‌ల జోలికి పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంద‌ని ధృవీక‌రించుకున్న త‌రువాత మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోండి. 

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసేప్పుడు, అది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో ధృవీకరించారో..లేదో.. నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్‌ల‌కు కూడా చట్టబద్ధత‌ ఉండాలి. యాప్‌ల‌ను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్‌, ఎస్ఎమ్ఎస్ ప‌ఠ‌నం మొద‌లైన వాటికి అనుమ‌తి నిరాక‌రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సుర‌క్షింతంగా జ‌రిపేందుకు యాంటి వైర‌స్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. సేఫ్ బ్రౌజింగ్ ఆప్ష‌న్ ఎంచుకోండి. దీని వ‌ల్ల మీరు టైప్ చేసిన వివ‌రాలు కీలాగ‌ర్స్ లాంటివి త‌స్క‌రించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. బ్రౌజింగు చేసే ముందు ఫైర్ వాల్స్ ను త‌ప్ప‌క ఎనేబుల్ చేయాలి. ఏదైనా వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేసేట‌పుడు మ‌భ్య‌పెట్టే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను క్లిక్ చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని