Home Loan: హోం లోన్‌ తీసుకుంటున్నారా? మరి ఎలాంటి ఛార్జీలుంటాయో తెలుసా?  - owning-a-home-to-be-one-of-the-biggest-financial-goals-of-a-lifetime
close

Updated : 31/08/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Home Loan: హోం లోన్‌ తీసుకుంటున్నారా? మరి ఎలాంటి ఛార్జీలుంటాయో తెలుసా? 

ఇల్లు అనేది ఎవ‌రికైనా జీవితంలో పెద్ద ల‌క్ష్యం. చాలా మంది ఇంటిని సొంతం చేసుకోవ‌డం అనేది జీవిత కాల‌పు అతిపెద్ద ఆర్ధిక ల‌క్ష్యాల‌లో ఒక‌టిగా భావిస్తారు. పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిళ్ల క‌న్నా కూడా ఇంటికే ఎక్కువ ఖ‌ర్చ‌వ‌డం అంద‌రికి తెలిసిందే. సొంతంగా ఇల్లు అనేది లేక‌పోతే ఐడెంటిటి లేన‌ట్టుగానే భార‌తీయులు భావిస్తారు. సొంత ఇల్లు మ‌న కుటుంబానికే గాక త‌ర్వాత త‌రానికీ కూడా ఆశ్ర‌మివ్వ‌డ‌మే కాకుండా మ‌న గుర్తింపును కూడా పెంచుతుంది. భార‌తీయ గ్రామాల్లో అయితే కూలీ ప‌నులు చేసుకునేవారు కూడా ఏ వ‌య‌సు వారైనా స‌రే సొంత ఇంటిలోనే నివ‌శిస్తారు. భార‌త్‌లో ఇంటి ప్రాధాన్య‌త అటువంటిది మ‌రి.

అయితే భార‌త్‌లో చిన్న ప‌ట్ట‌ణాల నుంచి, పెద్ద న‌గ‌రాల ప్రాంతాల్లో నివ‌శించేవారికి ఇంటిని సొంతం చేసుకోవాల‌నుకుంటే గృహ రుణం తీసుకోవ‌డం సాధార‌ణ‌మైన విష‌యం. ఇల్లు కావాల‌నుకునే వారు వారి ఆర్ధిక స్థోమ‌తును బ‌ట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. త‌గిన చెల్లింపుల సామ‌ర్ధ్యం ఉంటేనే గృహ రుణాల విష‌యంలో ముందుకు వెళ్లాలి. ఇల్లు కొన‌డం చౌక కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కొన్ని స‌మ‌యాల్లో ఇంటి సొంతం చేసుకునే ఖ‌ర్చు మీ ప్ర‌స్తుత వార్షిక గృహ ఆదాయానికి 10-15 రెట్లు కంటే కూడా ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు. ప్ర‌త్యేకించి రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రంలో ఆస్తిని కొనాల‌ని ప్లాన్ చేస్తే చాలామంది 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ‌డ్డీతో తిరిగి చెల్లించే విధంగా ఇంటి కొనుగోలుకు గృహ రుణం తీసుకుంటారు. మీరు మీ స్వంత వ‌న‌రుల నుండి చెల్లించాల్సిన అనేక ఇత‌ర ముఖ్య‌మైన ఖ‌ర్చులు ఉంటాయి. అందుక‌ని ఇల్లు కొన‌డం వంటి ముఖ్య‌మైన దాన్ని ప్లాన్ చేసేట‌ప్పుడు ఈ ఖ‌ర్చుల గురించి తెలుసు కోవ‌డం చాలా ముఖ్యం.

సాధార‌ణంగా ఆస్తి విలువ‌లో 90% వ‌ర‌కు గృహ రుణాన్ని తీసుకోవ‌చ్చు.  మిగిలిన 10% జేబులోంచి భ‌రించాలి. అయితే మీ గృహ రుణం రూ. 75 ల‌క్ష‌ల పైన ఉంటే,  రుణం ఇచ్చే బ్యాంక్ రుణ మొత్తంలో 75% వ‌ర‌కు మాత్ర‌మే ఆమోదించ‌వ‌చ్చు. మిగిలిన 25% డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. చాలా బ్యాంకులు కొన్ని సంవ‌త్స‌రాలుగా గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను క‌నిష్టాల‌కు త‌గ్గించిన‌ప్ప‌టికీ, ఇది సాధార‌ణంగా గృహ య‌జ‌మానికి సంబంధించిన అతిపెద్ద వ్య‌యం. గృహ రుణ వ‌డ్డీ రేటు రుణ గ్ర‌హీత వ‌య‌స్సు, లింగం, ఆదాయం, క్రెడిట్ స్కోర్‌, ఆస్తి విలువ‌, లోన్‌-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్ప‌త్తి, వంటి అనేక అంశాల‌పై ఆధార‌ప‌డి బ్యాంకు ద్వారా నిర్ధారించ‌బ‌డుతుంది. మీరు రూ. 30 ల‌క్ష‌ల విలువైన ఇంటిని కొనుగోలు చేయ‌డానికి 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న 30 ఏళ్ల వ్య‌క్తి అనుకుందాం. మీ `ఎల్‌టీవీ` 90%, కాబ‌ట్టి మీ గృహ రుణ మొత్తం రూ. 27 ల‌క్ష‌లు. రుణం ఇచ్చే బ్యాంకు రుణాన్ని 6.75% వ‌డ్డీ రేటుకే ఆమోదిస్తే 30 సంవ‌త్స‌రాల కాలానికి మీ `ఈఎమ్ఐ` నెల‌కు రూ. 17,512 అవుతుంది. అదే వ్య‌క్తి రూ. 1 కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేస్తే, అత‌ని రుణ మొత్తం రూ. 75 ల‌క్ష‌లు. వ‌డ్డీ రేటు 7% అయితే 30 సంవ‌త్స‌రాల పాటు అత‌ని `ఈఎమ్ఐ` నెల‌కు రూ. 49,897, మొత్తం వ‌డ్డీకే రూ. 1.04 కోట్లు అవుతుంది. తిరిగి చెల్లింపు మొత్తం రూ. 1.8 కోట్లు కావ‌చ్చు. ఫ్లోటింగ్ రేట్ హోమ్‌లోన్‌లో గృహ రుణదారు వ‌ద్ద కొంత అద‌న‌పు డ‌బ్బులున్న‌ప్పుడు ముందుగా చెల్లించే ప్రీపేమెంట్‌కి ఎలాంటి పెనాల్టీ ఉండ‌వు. రుణం కూడా ముందుగానే తీరుతుంది. మొట్ట‌మొద‌టి గృహ య‌జ‌మాని అయితే `ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న` కింద వ‌డ్డీ రాయితీల‌ను పొంద‌వ‌చ్చు.

ఛార్జీలుః గృహ రుణాల‌కు సంబంధించిన ఇత‌ర ఛార్జీలు రుణ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేష‌న్ ఛార్జీలు, లీగ‌ల్ ఒపీనియ‌న్ ఛార్జీలు, ఆస్తి వాల్యుయేష‌న్ ఫీజులు వంటి గృహ రుణం కింద బ్యాంకుల‌కు కొన్ని అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కింద డాక్యుమెంటేష‌న్‌, లీగ‌ల్ ఒపీనియ‌న్‌, వాల్యుయేష‌న్ ఫీజుల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. కొన్ని బ్యాంకులు వాటిని విడిగా వ‌సూలు చేయ‌వ‌చ్చు.

టైటిల్ డీడ్ (ఎమ్ఓడీటీ) మెమోరాండం ఆఫ్ డిపాజిట్ః బ్యాంకు గృహ రుణం యొక్క వ్య‌వ‌ధిలో ఆస్తి టైటిల్ డీడ్‌ను క‌లిగి ఉంటాయి. అన్ని బ‌కాయిలు పూర్తిగా క్లియ‌ర్ అయ్యే వ‌ర‌కు ఈ `ఎంఓడీటీ` ఛార్జీలు అని పిలువ‌బ‌డే టైటిల్ డీడ్ కోసం బ్యాంకులు 0.1% నుండి 0.3% వ‌ర‌కు రుసుము వ‌సూలు చేస్తారు. లీగ‌ల్ ఒపీనియ‌న్ ఛార్జీలు, ఎంఓడీటీ ఛార్జీలు రుణంలో 1% కంటే త‌క్కువ‌గానే ఉంటాయి. కొన్ని ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఇవి మాఫీ కూడా చేయ‌బ‌డ‌తాయి. ఒక్కోసారి డిస్కౌంట్లు కూడా బ్యాంకులు ఇస్తాయి.

రిజిస్ట్రేష‌న్ ఛార్జీలుః రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌తి ఆస్తి లావాదేవీపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను విధిస్తాయి. ఈ ఛార్జీలు ఇత‌ర అంశాల‌తో పాటు ఆస్తి యొక్క స్థానం, ధ‌ర‌, ప‌రిమాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇవి ఆస్తి విలువ‌లో దాదాపు 3% నుండి 6% వ‌ర‌కు ఉంటాయి.

ఇత‌ర ఖ‌ర్చులుః గృహ కొనుగోలుదారు.. డెవ‌ల‌ప‌ర్‌కు విద్యుత్‌, నీటి ఛార్జీలు, ఫ్లోర్‌రైజ్‌, మునిసిప‌ల్ ప‌న్నులు, సొసైటీ వార్షిక నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు చెల్లించాల్సి ఉంటుంది. గేటెడ్ క‌మ్యూనిటీ అయితే ఈత కొల‌ను, జిమ్‌, క్ల‌బ్ హౌస్ స‌భ్య‌త్వం, పార్కింగ్ వంటి సౌక‌ర్యాల కోసం కూడా డెవ‌ల‌ప‌ర్ విడిగా ఛార్జ్ చేయ‌వ‌చ్చు. అలాగే నిర్మాణంలో ఉన్న ఆస్తుల‌కి జీఎస్‌టీ చెల్లింపు ఉంటుంది. ఇవి ఆస్తి సూప‌ర్ బిల్ట్‌-అప్ ప్రాంతం, అపార్ట్‌మెంట్ సొసైటీ సౌక‌ర్యాలు, స్థానం ఆధారంగా నిర్ణ‌యించ‌బ‌డ‌తాయి.

గృహం కావాల‌నుకునే వారు ఈ విష‌యాల‌ను అన్ని తెలుసుకుని ముందే ప్లాన్ చేసుకోవాలి. త‌గిన రీపేమెంట్ సామ‌ర్ధ్యాన్ని అంచ‌నా వేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ ఎప్పుడు 750 క‌న్నా ఎక్కువ‌గా ఉంటేట‌ట్లు చూసుకోవాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని