‘పెట్రో’పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి - petrograinsexisegovernment
close

Updated : 22/06/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెట్రో’పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి

లేకుంటే ద్రవ్యోల్బణ మంట
ప్రభుత్వానికి ఆర్‌బీఐ విజ్ఞప్తి

ముంబయి/దిల్లీ: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డీజిల్‌, పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులతో ఈ మేరకు ఆర్‌బీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశంలో చాలా వరకు ప్రాంతాల్లో పెట్రోలు లీటరు రేటు రూ.100కు చేరిన నేపథ్యంలో, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. అధిక ఇంధన ధరల కారణంగా నిత్యావసరాలు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని.. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాల్సిన అవసరంపై ప్రధాన మంత్రి కార్యాలయానికి ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ ఒక ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (+ లేదా -2%) వద్ద ఉంచాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది మేలో 6.3 శాతానికి చేరింది.

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని గతేడాది మే నెలలో చివరి సారిగా ప్రభుత్వం పెంచింది. లీటరు పెట్రోలుపై రూ.10; లీటరు డీజిల్‌పై రూ.13 పెంచింది. కొన్ని రాష్ట్రాలు సైతం విడిగా సుంకాలను పెంచడంతో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. సుంకాల పెంపుతో 2020-21లో  కేంద్ర పన్ను ఆదాయం (రూ.20.25 లక్షల కోట్లు)లో ఎక్సైజ్‌ సుంకాల వసూళ్లే అయిదో వంతుకు చేరాయి. అంతక్రితం ఏడాది ఇవి 12 శాతంగా ఉన్నాయి. కరోనా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు తగ్గాయి. ఇపుడు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే ఖజానాకు మరింత లోటు ఏర్పడే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలపై భారీగా వెచ్చిస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలను కిందకు తీసుకురావడం కష్టమేనని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

విని కాస్మటిక్స్‌లో కేకేఆర్‌ రూ.4,600 కోట్ల పెట్టుబడి
 నియంత్రిత వాటా కొనుగోలుకు యత్నాలు  

దిల్లీ: ఫాగ్‌ బ్రాండుపై డియోడొరెంట్లు తయారు చేసే వినీ కాస్మటిక్స్‌లో నియంత్రిత వాటాను చేజిక్కించుకోనున్నట్లు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్‌ తెలిపింది. ఇందుకుగాను రూ.4600 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు   చేసినట్లు తెలిపింది ఈ ఒప్పందం ప్రకారం.. వ్యవస్థాపకులైన విని ఛైర్మన్‌, సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) దర్శన్‌ పటేల్‌, మరో జేఎండీ దీపమ్‌ పటేల్‌, సిక్వోయాలు తమ వాటాలను విక్రయించనున్నారు. సహ వ్యవస్థాపకులకు వినిలో కొంత వాటా ఉంటుందని, కేకేఆర్‌తో కలిసి కంపెనీ భవిష్యత్‌ వృద్ధిలో పాలుపంచుకుంటారని సంస్థ ప్రకటించింది. ప్రస్తుత వాటాదారు వెస్ట్‌బ్రిడ్జ్‌ కేపిటల్‌ తన వాటా పెంచుకునేందుకు వ్యవస్థాపకుల దగ్గర నుంచి కొంత వాటా కొనుగోలు చేస్తుందని పేర్కొంది. దర్శన్‌ పటేల్‌ ఛైర్మన్‌గానే కొనసాగుతారని, దీపమ్‌ పటేల్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులు అవుతారని వెల్లడించింది. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే నెలలో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. విని ఉత్పత్తులు దేశంలో 7,00,000 విక్రయకేంద్రాల్లో అమ్ముడవుతున్నాయి. 3,000 మంది డీలర్లు, 1,200 మంది మార్కెటింగ్‌ సిబ్బంది ఉన్నారు. 50 దేశాల్లో తన ఉత్పత్తులను సంస్థ విక్రయిస్తోంది. తన ఏషియన్‌ ఫండ్‌- 4 నుంచి ఈ పెట్టుబడిని పెడుతున్నట్లు కేకేఆర్‌ తెలిపింది. కాగా.. గత 12 నెలల్లో జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, లెన్స్‌కార్ట్‌, ఫైవ్‌ స్టార్‌, రిలయన్స్‌ జియోలోనూ పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని