సూచీల పరుగులు అందుకే.. - reason behind stock indices rise exclusive interview
close

Updated : 14/02/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూచీల పరుగులు అందుకే..

ఈనాడు ఇంటర్వ్యూలో యూటీఐ ఏఎంసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సచిన్‌ త్రివేది

ఈనాడు - హైదరాబాద్‌

‘భవిష్యత్తు ఆర్థిక వృద్ధిని ఊహిస్తూ.. స్టాక్‌ మార్కెట్ల సూచీలు పరుగుపెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్దీపన పథకాలూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. మదుపర్లు దీర్ఘకాలంలో మార్కెట్‌ ఇచ్చే లాభాలపైన నమ్మకం చూపిస్తున్నారు. సూచీల్లో స్వల్పకాలిక ఊగిసలాటలు ఉన్నప్పటికీ.. వృద్ధి దిశగానే వెళ్తున్నాయి. షేర్లు ఇప్పుడు లాభార్జన దశలో ఉన్నాయి. కాబట్టి, మదుపరులు ఆచితూచి వ్యవహరించాలి’ అని అంటున్నారు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, రీసెర్చ్‌ హెడ్‌ సచిన్‌ త్రివేది. ‘ఈనాడు’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

? జీడీపీ వృద్ధి తొలుత అనుకున్న అంచనాలకు మించి కనిపిస్తోంది. త్వరలోనే ‘వి’ ఆకారపు వృద్ధి కనిపిస్తుందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం ముగిసిందని భావిస్తున్నారా
 ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల పనితీరు మెరుగవుతోంది. కొన్ని కొవిడ్‌-19కు పూర్వపు సాధారణ స్థితికి వస్తే.. మరికొన్ని కాస్త అధికంగానే వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక వ్యవస్థ తొలుత ఊహించినదానికన్నా వేగంగానే కోలుకుంటోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ప్రభుత్వ మద్దతు అంత ఎక్కువగా లేకపోయినా ఇది సాధించడం ఎంతో సానుకూలమైన అంశంగానే చెప్పొచ్చు. సమయానుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని చర్యలూ ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలిచాయి. దీని కన్నా ఆర్‌బీఐ వ్యవస్థలో నగదు ప్రవాహం కోసం వడ్డీ రేట్లను కనీస స్థాయికి తగ్గించడంలాంటి చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయి. మంచి వర్షాలు పడటంతో వ్యవసాయాధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. కరోనా సమయంలో తక్కువ మరణాలు నమోదు కావడం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం, టీకా రావడంలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో విశ్వాసం నింపుతున్నాయి. ఇవన్నీ వృద్ధికి దోహదపడే అంశాలు.

? ఆర్థిక వ్యవస్థ పనితీరు అంత ఆశాజనకంగా లేదు. అయినప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీన్ని ఎలా విశ్లేషిస్తారు
 మార్కెట్లు సాధారణంగా భవిష్యత్తును అంచనా వేస్తుంటాయి. స్వల్పకాలిక పరిణామాలకు అప్పుడప్పుడూ ప్రతిస్పందిస్తుంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగితే తప్ప మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించవు. ప్రస్తుతం 2020లో సూచీల్లో పెద్ద ఎత్తున దిద్దుబాటు కనిపించింది. మన దేశంతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆర్థిక ఉద్దీపనల తర్వాత మార్కెట్లు వృధ్ధి చెందడం ప్రారంభించాయి. కొవిడ్‌-19 టీకాలు అందుబాటులోకి రావడం, దేశీయ, అంతర్జాతీయ బాండ్లలో తక్కువ రాబడి లభిస్తోండటం, కార్పొరేట్ల లాభాలు మెరుగవడంలాంటివి ఈక్విటీ మార్కెట్ల వృద్ధికి తోడ్పడుతోంది. ఈ పరిణామాల అనంతరం మార్కెట్లు సరైన విలువకు మారాయి. ఇప్పుడు షేర్లు లాభార్జన దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు స్టాక్‌ ఆధారిత ఎంపికలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

? మార్కెట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీఅనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో మార్కెట్లో పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహమేనా
 ఈక్విటీ మార్కెటలో అస్థిరత అనేది సహజమే. అందువల్ల ఇలాంటివాటికి  సిద్ధంగా ఉండాల్సిందే. దీర్ఘకాలంలో ఏ ఇతర పెట్టుబడితో పోల్చి చూసినా.. ఈక్విటీలు ద్రవ్యోల్బణానికి మించిన రాబడిని ఇచ్చాయనేది స్పష్టం. కాబట్టి, మదుపరులు ఈక్విటీల్లో తమ డబ్బును మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, అతను/ఆమె వయసు, ఆదాయం, నష్టభయం భరించే సామర్థ్యాన్ని ఇక్కడ పరిగణనలోనికి తీసుకొని, కేటాయింపులు చేయాలి. సరైన షేర్లను ఎంపిక చేసుకొని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో సంపద వృద్ధి సాధ్యమవుతుంది.

? ప్రస్తుతం ఏ రంగాలు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయి
మహమ్మారి అనంతరం పలు సంస్థలు అసంఘటితం నుంచి వ్యవస్థీకృత వ్యాపారాల వైపు వస్తున్నాయి. ఈ ధోరణి నుంచి లబ్ది పొందే సంస్థలను పరిశీలించాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఐటీ సేవల సంస్థలు, వాహన, ఫార్మా రంగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

? ప్రస్తుత పరిస్థితుల్లో మీ పెట్టుబడి వ్యూహాల్లో ఎలాంటి మార్పులు చేశారు
మా పెట్టుబడుల కోసం కంపెనీలను ఎంచుకునేటప్పుడు నగదు లభ్యత, రాబడి నిష్పత్తి తదితరాలను ప్రధానంగా చూస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నాం. దీన్ని దీర్ఘకాలం కొనసాగించే కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ప్రతి ఫండ్‌ మేనేజర్‌ తన పెట్టుబడి శైలిని అనుసరిస్తూ.. ఆయా ఫండ్ల నిబంధనల మేరకు సంస్థలను ఎంచుకుంటారు. ఇలా షేర్ల ఎంపిక నిబంధనల్లో పెద్దగా మార్పులు చేయలేదు. కరోనా మహమ్మారి తర్వాత ఈ ప్రక్రియ పనితీరును మరోసారి పరీక్షించుకునే అవకాశం వచ్చింది. మా లక్ష్యాలకు అనుగుణంగా పనితీరు చూపించని కంపెనీల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొన్న కంపెనీల్లో పెట్టుబడులు పెంచే ప్రయత్నం చేస్తున్నాం.

? స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్న యువకుల సంఖ్య పెరుగుతోంది? వీరికి మీరిచ్చే సూచనలేమిటి
* నిజమే.. కరోనా లాక్‌డౌన్‌ ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో చాలామంది కొత్త మదుపరులు స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్నారు. ఇలాంటివారందరూ వాళ్ల  ఆర్థిక వనరుల ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నది నిర్ణయించుకోవాలి. వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌)కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈక్విటీలో అధిక మొత్తాన్ని ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లలోకి మళ్లించాలి. సెక్టార్‌ ఫండ్ల కోసం 15-20 శాతానికి మించి కేటాయింపులు ఉండకూడదు. అదీ పెట్టుబడిదారుడి నష్టభయాన్ని అనుసరించి ఉండాలి. మంచి రాబడిని అందిస్తూ.. మెరుగైన వృద్ధి పథంలో ఉన్న సంస్థలను ఎంచుకోవాలి. ముఖ్యంగా సిప్‌ల వైపు దృష్టి పెట్టడం మేలు.

ఇవీ చదవండి...

7 కంపెనీలు..7 రోజులు..రూ.1.40లక్షల కోట్లు

వొడాఫోన్‌ ఐడియా నష్టం తగ్గింది


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని