క్రెడిట్ కార్డు తిరస్కరణకు గల కారణాలు.. - reasons-for-credit-card-rejection
close

Published : 30/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ కార్డు తిరస్కరణకు గల కారణాలు..

ఒక స్థిరమైన ఆదాయం కలిగిన వారిని కంపెనీలే క్రెడిట్‌ కార్డు తీసుకోమని అభ్యర్థిస్తూండటం మనం వింటూ ఉంటాం. ఇంట్లో కూర్చొనే ఒక్క మౌస్‌ క్లిక్‌తో క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. అయితే దరఖాస్తు చేయగానే క్రెడిట్‌ కార్డు అంత సులభంగా వచ్చేయదు. బ్యాంకులు ఒక పద్ధతి ప్రకారం పరిశీలన జరిపిన తర్వాతనే క్రెడిట్‌ కార్డును ఇస్తాయి. కార్డు తిరస్క‌ర‌ణ‌కు బ్యాంకులు ఏయే అంశాల‌ను లెక్క‌లోకి తీసుకుంటాయో తెలుసుకుందాం.

కనీస వయస్సు లేకపోవడం :
రుణం లేదా క్రెడిట్‌ కార్డు పొందాలంటే 18 ఏళ్ల కనీస వయస్సు ఉండాలి. 18 నుంచి 21 ఏళ్ల వయస్సు మధ్య కలిగిన వారు క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అద‌న‌పు భ‌రోసా కోసం ఇంకొక‌రిని ద‌ర‌ఖాస్తుదారు (స‌హ ద‌ర‌ఖాస్తుదారుడి) గా చేర్చ‌మ‌ని బ్యాంకులు కోర‌తాయి. వారి ఆదాయ ధ్రువీక‌ర‌ణ కోసం బ్యాంకులు అడుగుతాయి. 18 ఏళ్ల నుంచి 21 మధ్య  వయస్సు కలిగిన వారి ఆదాయం సరిగా లేకపోయినా లేదా సహ దరఖాస్తుదారుడు లేకపోయినా క్రెడిట్‌ కార్డు దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న వయస్సు వారు పెద్దల సాయంతో తక్కువ పరిమితితో కూడిన అనుబంధ కార్డులను తీసుకునే వీలుంది.

రుణ చరిత్ర సరిగా లేకపోవడం :
రుణాలు లేదా క్రెడిట్‌ కార్డుల జారీలో రుణ చరిత్ర ఒక ముఖ్య అంశంగా ఉంటోంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌  ఉంటేనే బ్యాంకులు క్రెడిట్‌ కార్డు అందించేందుకు సుముఖంగా ఉన్నాయి. ఇదివరకూ  తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు సక్రమంగా లేకుండా  ఉండి, క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉన్న సందర్భంలో క్రెడిట్‌ కార్డు జారీ చేసేందుకు బ్యాంకులు నిరాకరించే అవకాశం ఉంది. కనీసం 700 క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే క్రెడిట్‌ కార్డు జారీ అవుతుంది.

తక్కువ ఆదాయం :
ప్రస్తుతం చాలా బ్యాంకులు వ్యక్తులు ఆర్జించే ఆదాయాన్ని బట్టి క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నాయి. 75,000 నుంచి 1,50,000 వార్షిక  ఆదాయం కలిగిన వారికి ప్రాథమిక స్థాయి క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్నారు. బ్యాంకులు స్థిర ఆదాయం ఉన్నవారికి కార్డు జారీచేసేందుకు సుముఖత  చూపుతాయి. ప్రీమియం క్రెడిట్‌ కార్డుల జారీకి బ్యాంకును బట్టి నిబంధనలు మారుతూ ఉంటాయి.  వేతన ఉద్యోగులకు ఒక విధంగా స్వయం ఉపాధి కలిగిన వారిని ఒక విధంగా క్రెడిట్‌ కార్డు బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.

వృత్తి లేదా ఉద్యోగం :
భద్రత లేని వృత్తులు చేపట్టిన వారికి, సాహసంతో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారికి కార్డులు జారీచేయడాన్ని నష్టభయంతో  కూడుకున్న వ్యవహారంగా పరిగణిస్తాయి. కనీస ఆదాయం నిబంధనను పాటించినప్పటికీ అలాంటి వారి విజ్ఞప్తులను బ్యాంకులు తిరస్కరిస్తాయి. ఉద్యోగం చేసే సంస్థ పేరు ప్రఖ్యాతలను కూడా ఒక్కోసారి పరిగణనలోకి తీసుకుంటాయి. ఆకర్షణీయమైన వేతనం ఉన్నా సరే సంస్థకు మంచి పేరులేకపోతే అందులోని ఉద్యోగులకు క్రెడిట్‌ కార్డు జారీ చేయ‌క‌పోవ‌చ్చు. ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో స్థిరంగా లేకుండా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు తరచూ మారుతూ ఉంటే అది క్రెడిట్‌ కార్డు జారీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసేటప్పుడు జరిగే తప్పిదాలు :
దరఖాస్తు నింపేటప్పుడు పని చేసే సంస్థ పేరు, చిరునామా, ఆదాయం, సంప్రదించాల్సిన ఫోన్‌నెంబరు, వ్యక్తిగత చిరునామా తదితర వివరాలను తప్పులు లేకుండా ఇవ్వాలి. వీటిలో ఏది తప్పు ఉన్నా బ్యాంకు అభ్యర్థి గురించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా నమోదుచేయాల్సిన సమాచారాన్ని జాగ్రత్తగా నింపాలి. బ్యాంకు ప్రతినిధి పరిశీలనలో చేసే ఉద్యోగం  పట్ల కానీ జీవన స్థితిగతుల పట్ల కానీ సంతృప్తి చెందకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.

ఎక్కువ ఈఎమ్‌ఐలు కలిగి ఉండటం లేదా ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటం :
ఇప్పటికే ఎక్కువగా చెల్లించాల్సిన రుణాలు ఉంటే కొత్త రుణం లేదా క్రెడిట్‌ కార్డు జారీచేయడం కష్టతరమవుతుంది. సంపాదనలో 50 శాతం వరకూ గృహ నిర్వహణకు ఖర్చవుతుందని బ్యాంకులు భావిస్తాయి. మిగిలిన  50 శాతం సంపాదనలో ఇది వరకే తీసుకున్న రుణాల ఈఎమ్‌ఐలకు సరిపోతూ ఉంటే క్రెడిట్‌ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఒకరు ఎన్ని కార్డులు కలిగి ఉండాలనే కచ్చితమైన నిబంధనేమీ లేదు. అయితే సాధారణంగా 5 కంటే ఎక్కువ కార్డులు కలిగిన వారు మ‌రో క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు కొత్తవి జారీచేసేందుకు సుముఖ‌త‌ చూపవు.

క్రెడిట్‌ కార్డు జారీ చేసేటప్పుడు కంపెనీలు పరిగణనలోకి తీసుకునే వాటిలో ఇవి కొన్ని మాత్రమే. కంపెనీని బట్టి వారి విధివిధానాలు మారుతూ ఉంటాయి. వీటిలో ఏవైనా కారణాల వలన క్రెడిట్‌ కార్డు తిరస్కరణకు గురవుతాయని అనిపించేట్టయితే వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. ఇప్పటికే తిరస్కరణకు గురై ఉంటే అందుకు కారణాలను విశ్లేషించుకుని, అన్ని సక్రమంగా ఉంచుకుని మళ్లీ కార్డు కోసం ప్రయత్నించండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని