close

Updated : 26/02/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్లకు బ్లాక్‌‌ ఫ్రైడే

ముంబయి: శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు మరో బ్లాక్‌‌ ఫ్రైడేని చవిచూశాయి. సూచీలు ఒకేరోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,256 వద్ద, నిఫ్టీ 14,888 వద్ద ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. ఇంట్రాడే ఏ దశలోనూ సూచీలకు మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,510 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల తేడాను నమోదు చేశాయి. 50,400 వద్ద గరిష్ఠాన్ని తాకిన బీఎస్‌ఈ ఇండెక్స్‌.. 48,890 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ సూచీ 14,919 వద్ద గరిష్ఠాన్ని.. 14,467 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్‌ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్ద ముగియగా.. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.14 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లో టాప్‌ 30 కంపెనీల్లో ఏ ఒక్కటీ లాభాలను రాబట్టలేకపోయాయి. నిఫ్టీ టాప్‌ 50లోనూ అదే పరిస్థితి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ఒడుదొడుకులు దేశీయ సూచీలను తీవ్రంగా దెబ్బతీశాయి. కరోనా నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు బాగా ర్యాలీ అయ్యాయి. దీనికి దేశీయంగా బడ్జెట్‌లోని సానుకూల ప్రతిపాదనలు తోడవ్వడంతో సూచీలు జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. కానీ, ఈవారంలో బేర్ విసిరిన పంజాకు అవన్నీ ఆవిరైపోయాయి. మార్కెట్ల ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్‌(వీఐఎక్స్‌) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. సాధారణంగా వీఐఎక్స్‌ పెరుగుదల మదుపర్లలో నెలకొన్న ఆందోళన, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంటుంది. రాబోయే 30 రోజుల్లో మార్కెట్‌ కదలికల్ని ఇది తెలియజేస్తుంటుంది.

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు...

బాండ్ల ఈల్డులు పెరగడం...

ప్రపంచవ్యాప్తంగా బాండ్ల ఈల్డులు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల ఈల్డులు ఏడాది గరిష్ఠానికి చేరాయి. కరోనా వెలుగుచూసిన తర్వాత బాండ్ల మార్కెట్లో ఈ స్థాయి అనిశ్చితి ఇదే తొలిసారి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియాలోనూ బాండ్ల ఈల్డులు పెరిగాయి. అమెరికా ఏడేళ్ల బాండ్ల వేలం వైఫల్యంతో తాజా గందరగోళానికి బీజం పడింది. వేలం వైఫల్యం ద్రవ్యోల్బణానికి సంకేతంగా భావించిన మదుపర్లు బాండ్ల విక్రయానికి సిద్ధమయ్యారు. అలాగే కరోనా సంక్షోభం తర్వాత వేగంగా పుంజుకుంటున్న డిమాండూ ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల్ని తిరిగి కఠినం చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బాండ్ల మార్కెట్లో అనిశ్చితి నెలకొని ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై పడింది.

బలహీన అంతర్జాతీయ సంకేతాలు...

బాండ్ల ఈల్డులు, ద్రవ్యోల్బణ భయాలు అమెరికా మార్కెట్లను కిందకు దిగజార్చాయి. ఈ ప్రభావం ఆసియా సూచీలపైనా పడింది. శుక్రవారం ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాల్ని చవిచూశాయి. పైగా హాంకాంగ్‌లో షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై 30 శాతం పన్ను విధించడం మరింత ప్రభావం చూపింది. 

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు...

అమెరికా-ఇరాన్‌ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలు సూచీలపై ప్రభావం చూపాయి. సిరియా భూభాగంలో ఉన్న ఇరాన్‌కు చెందిన తీవ్రవాద స్థావరాలపై అమెరికా మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తలు సూచీలను కుంగదీశాయి.

జీడీపీ గణాంకాలపై అప్రమత్తత..

నేడు కేంద్రం జీడీపీ గణాంకాలను వెలువరించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. 2021 మూడో త్రైమాసికం గణాంకాల్ని నేడు జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు నేడు ఆచితూచి వ్యవహరించారు. 

పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు...

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల కూడా మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోసారి కరోనా విజృంభిస్తే ఆంక్షలు తప్పకపోవచ్చునన్న సంకేతాలు వెలువడడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశంలో వరుసగా రెండో రోజు 16వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని