కార్‌లోన్ తీసుకుంటున్నారా? ఈ 6 విష‌యాలు గుర్తించుకోండి.. - remember-these-6-points-before-applying-for-a-car-loan
close

Updated : 30/01/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్‌లోన్ తీసుకుంటున్నారా? ఈ 6 విష‌యాలు గుర్తించుకోండి..

ప్ర‌స్తుతం అన్ని ప్ర‌ముఖ‌ ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కారు కొనుగోలుకు రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే సుల‌భంగా రుణం పొందేందుకు చాలా ఆఫ్ష‌న్లు అందుబాటులో ఉన్నందున,  కారు కొనుగోలుకు ఎక్క‌డ రుణం తీసుకోవాలి, ఏయే అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.. అనే దానిపై చాలా మంది గంద‌ర‌గోళానికి లోన‌వుతున్నారు. రుణం తీసుకుని కారు కొనుగోలు చేసే వారు ఈ కింది అంశాలపై దృష్టి సారించి స‌రైన విధంగా కారు రుణం తీసుకోవ‌చ్చు. 

1.క్రెడిట్ స్కోరు తెలుసుకోండి..

వ్య‌క్తి ఆదాయ వ‌న‌రు, లింగం, క్రెడిట్ స్కోరు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యిస్తారు. మీ ఆదాయం ఎక్క‌వ ఉన్న‌ప్ప‌టికీ, త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉంటే, రుణ వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. రుణ‌దాత‌లు, క్రెడిట్ నివేదికల‌ ద్వారా కారు రుణ దర‌ఖాస్తు దారుల,  తిరిగి చెల్లింపు సామ‌ర్ధ్యాన్ని తెలుసుకుంటాయి. క్రెడిట్ స్కోరు 750, అంతకంటే ఎక్కువ‌గా ఉంటే త్వ‌రిత గ‌తిన రుణం మంజూరు అయ్యే అవ‌కాశం ఉంటుంది. వీరికి రుణ‌దాతలు త‌క్కువ వ‌డ్డీ రేటు(ప్రిఫ‌రెన్షియ‌ల్ లెండింగ్ రేటు) కు రుణం అందిస్తారు. అందువ‌ల్ల రుణం ద్వారా కారు కొనుగోలు చేయాల‌నుకునే వారు, బ్యాంకులో రుణ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించేంద‌కు ఆరు నెల‌ల ముందుగానే క్రెడిట్ బ్యూరో నుంచి క్రెడిట్ నివేదిక‌ను పొంద‌డం మంచిద‌ని పైసాబ‌జార్‌.కామ్ డైరెక్ట‌ర్ గౌర‌వ్ అగ‌ర్వాల్ అన్నారు. 

2. వ‌డ్డీ రేట్లను పోల్చి చూడండి:

ఈ రోజుల్లో చాలా బ్యాంకులు కారు రుణాల‌ను ఇచ్చేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. అందువ‌ల్ల మీరు ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల‌నుకుంటున్నారో... ఆ బ్యాంకు ఆఫ‌ర్ చేసే వ‌డ్డీ రేటును ఇత‌ర బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న వ‌డ్డీ రేట్ల‌తో పోల్చి చూడండి. ఇందుకు ఆన్‌లైన్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. త‌క్కువ వ‌డ్డీ రేటు, త‌క్కువ ప్రాసెసింగ్ ఛార్జీల‌తో రుణం అందించే సంస్థ‌ను ఎంపిక చేసుకోవాలి. వ‌డ్డీ రేటుతో పాటు..వ‌ర్తించే ఇత‌ర ఛార్జీలను తెలుసుకోవాలని బ్యాంక్ బ‌జార్ సీఈఓ అధిల్‌శెట్టి పేర్కొన్నారు. చాలా వ‌ర‌కు బ్యాంకులు ఏడేళ్ళ కాల‌ప‌రిమితితో కారు రుణం అందిస్తున్నందున‌ బ్యాంకుతో దీర్ఘ‌కాలం పాటు సంబంధాలు కొన‌సాగించ‌ల్సి వ‌స్తుంది. అంద‌వ‌ల్ల రుణం మొత్తం కాలంలో చెల్లించాల్సిన ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. 

3. ప‌త్రాలు..

దర‌ఖాస్తుతో పాటు ఆదాయం, అడ్ర‌స్‌, వ‌య‌సు, ఎంప్లాయిమెంట్ వంటి వాటికి సంబంధించి ధృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అందువ‌ల్ల కావ‌ల‌సిన అన్ని ప‌త్రాల‌ను ముందుగానే సేక‌రించి పెట్టుకోవాలి.  ఉదాహ‌ర‌ణ‌కు, ఉద్యోగం చేసే వ్య‌క్తి కారు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే, శాల‌రీ స్లిప్‌, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల స్టేట్‌మెంట్ల‌ను సాధార‌ణంగా అడుగుతారు. 

4. ముంద‌స్తు చెల్లింపుల ఛార్జీలు..

రుణ‌దాత‌లు స్థిర వ‌డ్డీ రేట్ల‌కు కారు రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంటాయి. వీటిని స‌మయం కంటే ముందుగానే చెల్లించిన‌ప్పుడు కొంత రుస‌ము వ‌సూలు చేస్తాయి. దీనినే ప్రీపేమెంట్ ఛార్జీలు అంటారు. ఈ ఛార్జీలు సాధార‌ణంగా 5 నుంచి 6 శాతం వ‌ర‌కు ఉంటాయ‌ని అగ‌ర్వాల్ తెలిపారు. అంతేకాకుండా, కొంతమంది రుణదాతలు రుణ పదవీకాలంలో ముందస్తు చెల్లింపుల మొత్తాన్ని, సంఖ్యను కూడా పరిమితం చేస్తారు. ఫిక్స్‌డ్ వ‌డ్డీ రేటుతో కారు రుణాల‌ను ఎంచుకుంటే క‌నీస ప‌రిమితుల‌తో ముందుస్తు చెల్లింపుల‌ను అనుమ‌తించే రుణ‌దాత‌లను ఎంచుకోవాలి. 

5. ఈఎమ్ఐ చెల్లించ‌గ‌ల సామ‌ర్ధ్యం తెలుసుకోండి..

ఈఎమ్ఐ(ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌) చెల్లించ‌గ‌ల సామ‌ర్ధ్యాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయాలి. ఇందులో విఫ‌ల‌మైతే ఈఎమ్ఐ చెల్లించ‌డం క‌ష్టం అవుతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది. ఈఎమ్ఐ చెల్లింపులు స‌రైన స‌మ‌యంలో చేయ‌క‌పోతే అధిక ఛార్జీలు, పెనాల్టీలు ప‌డ‌తాయి. ఇవి మీ క్రెడిట్ స్కోరుతో పాటు భ‌విష్య‌త్తు రుణాలు, కొత్త‌ క్రెడిట్ కార్డు పొందే అర్హ‌త‌పై కూడా ప్ర‌భావం చూపుతాయి. 

నెలావారీగా చెల్లించ‌వ‌ల‌సిన త‌ప్ప‌నిస‌రి చెల్లింపుల‌ను, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేసే నెల‌వారీ పెట్టుబ‌డులు, బీమా ప్రీమియం, ఇప్ప‌టికే చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇత‌ర ఖ‌ర్చుల‌ను నెల‌వారీ జీతం నుంచి తీసీవేయ‌గా మిగిలిన మొత్తం ఆధారంగా..కారు రుణం కోసం ఈఎమ్ఐ చెల్లించగ‌ల‌రా.. లేదా...అని అంచ‌నా వేసుకోవ‌చ్చు. రుణ గ్ర‌హీత తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఆధారంగానే కాల‌ప‌రిమితి కూడా ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో చెల్లించ‌గ‌లిగిన వారు, త‌క్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డం ద్వారా వ‌డ్డీని త‌గ్గించుకోవ‌చ్చు. 

6. డౌన్‌పేమెంట్..

డౌన్‌పేమెంట్ ఎక్కువ‌గా ఉండేట్లు చూసుకోవాలి. త‌క్కువ డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐకి మ‌ళ్ళిస్తే,  భవిష్య‌త్తులో ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కి, రూ. 10 ల‌క్ష‌ల విలువైన కారు కొనుగోలు చేశార‌నుకుందాం.  అందులో రూ.2 ల‌క్ష‌లు డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ.8 ల‌క్ష‌లు ఏడు సంవ‌త్స‌రాల కాల‌పరిమితితో ఈఎమ్ఐ చెల్లించే విధంగా రుణం తీసుకుంటే, ఈఎమ్ఐలు ముగిసే స‌మ‌యానికి మీరు చెల్లించే వ‌డ్డీ రూ.3.15 ల‌క్ష‌లు(కారు రుణం వ‌డ్డీ రేటు 10శాతం అనుకుంటే) చెల్లించాలి. 

ఒక‌వేళ డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే, అంటే రూ.10 ల‌క్ష‌ల కారు విలువ‌లో రూ.4 ల‌క్ష‌లు డౌన్‌పేమెంట్ చెల్లించి రూ.6 ల‌క్ష‌ల రుణం తీసుకుని, ఏడేళ్ళ కాల‌ప‌రిమితికి ఈఎమ్ఐకి మారిస్తే, మొత్తం కాలానికి మీరు చెల్లించే వ‌డ్డీ రూ.2.36 ల‌క్ష‌లు (కారు రుణం వ‌డ్డీ రేటు 10శాతం చొప్పున‌).  ఈఎమ్ఐ భారం ప‌డ‌కుండా ఉండేందుకు ఇత‌ర రుణాల‌ను, ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి. కారు ఉప‌యోగిస్తున్న కొద్ది దాని విలువ త‌గ్గుతుంది. అంతేకాకుండా నిర్వ‌హ‌ణ ఖర్చులు కూడా ఉంటాయి. అందువ‌ల్ల రుణ వ‌డ్డీ, ఇత‌ర ఖ‌ర్చులు నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని