close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/07/2020 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రిలయన్స్‌ 5జీకి రెడీ: ముఖేశ్‌ అంబానీ

ముంబయి: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నేడు దృశ్యమాధ్యమ విధానంలో  ప్రారంభమైంది. తొలుత కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ ‘‘మానవ చరిత్రలోనే కరోనా వైరస్‌ అత్యంత ఇబ్బంది కరమైన పరిస్థితి. కొవిడ్‌ తర్వాత భారత్‌, మిగిలిన ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రతి కష్టం చాలా అవకాశాలను కూడా తెస్తుంది. 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించింది. గత ఏజీఎంలో చెప్పినట్లుగానే రిలయన్స్‌ నికర రుణ రహిత సంస్థగా మారిందని సంతోషంగా చెబుతున్నా. దీంతోపాటు భారత్‌లో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూని కూడా పూర్తి చేశాం. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్‌ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇక కన్జ్యూమర్‌ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించింది. మా కన్జ్యూమర్‌, టెక్నాలజీ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారత్‌లో వేగంగా పెరిగిన డేటా డిమాండ్‌ను తట్టుకొని జియో నిలిచింది. జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు అందిస్తుంది. వచ్చే ఏడాది దీనికి సంబంధించిన సేవలు అందుబాటులోకి రావచ్చు. స్పెక్ట్రం రాగానే త్వరలోనే పరీక్షిస్తాం.  సాంకేతికతతో మీడియా, ఫైనాన్షియల్‌ సర్వీస్‌, న్యూ కామర్స్‌, ఎడ్యూకేషన్‌, హెల్త్‌కేర్‌, వ్యవసాయం, స్మార్ట్‌ సిటీస్‌, స్మార్ట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌, స్మార్ట్‌ మొబిలిటీ రంగాల్లో భారీ మార్పులు వస్తాయి.  మేము 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేయగలమని నమ్ముతున్నాను. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నాం’’ అని అన్నారు. 

రిలయన్స్‌ రిటైల్‌ పై..

‘‘నాకు ముఖ్యంగా నాలుగు అంశాలు సంతృప్తిని ఇచ్చాయి. మా రిటైల్‌ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్‌2, టైర్‌3 పట్టణాల్లోనే ఉన్నాయి. మాకు లక్షల మంది రైతులు తాజా కూరగాయలు, పండ్లు నేరుగా విక్రయిస్తున్నారు. మాకు వచ్చే వాటిల్లో 80శాతం రైతుల నుంచే కొంటున్నాం. దేశ వ్యాప్తంగా లక్షలామందికి మేము ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నాం. లక్ష మంది చిరువ్యాపారులతో అనుబంధమే మా అభివృద్ధి వ్యూహం’’

సౌదీ అరామ్‌కో డీల్‌పై..

‘‘భారత మార్కెట్లోకి రావడానికి మాకున్న చమురు, రసాయనాల వ్యాపారం విదేశీ కంపెనీలకు చాలా ముఖ్యం. కొవిడ్‌, మార్కెట్లోని ఇతర కారణాల వల్ల అరామ్‌కో డీల్‌ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. మా ఈక్విటీ అవసరాలు తీరాయి. అయినా, మేము సౌదీ అరామ్‌కోతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తాము. 2035 నాటికి కర్బాన ఉద్గార రహిత సంస్థగా మారాలనేది మా లక్ష్యం’’  అని తెలిపారు. 

మేడిన్‌ ఇండియాపై..

‘‘రిలయన్స్‌ మిగిలిన భారతీయ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి ‘మేడిన్‌ ఇండియా’, ‘మేడ్‌ ఫర్‌ ఇండియా’, ‘మేడ్‌ ఫర్‌ వరల్డ్‌ ’ విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంది’ 

‘మిషన్‌ అన్నసేవ’ 5కోట్ల మందికి భోజనం

‘మిషన్‌ అన్నసేవ’ కింద రిలయన్స్‌ 5 కోట్ల మంది పేదలకు భోజనాలను అందించిందని ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ పేర్కొన్నారు. ఆమె వివిధ అంశాలను ఈ సమావేశంలో వెల్లడించారు. జియో దాదాపు 40 కోట్ల మందిని అంతర్జాలంతో కలుపుతోందన్నారు. జియో కారణంగా 30వేల సంస్థల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేయగలుగుతున్నారన్నారు.  కరోనా టీకా వచ్చాక అది ప్రతిఒక్కరికి చేరేలా తమ డిజిటల్‌ నెటవర్క్‌ ద్వారా సాయం చేస్తామన్నారు.  

‘జియో గ్లాస్‌’ ఆవిష్కరణ..

ఇషా, ఆకాశ్‌ అంబానీలు జియోటీవీ ప్లస్‌ను ప్రదర్శించారు. ఈ సమావేశంలోనే జియోగ్లాస్‌ను ఆవిష్కరించారు.  ఈ స్మార్ట్‌ కళ్లద్దాల బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. దీనిలో 25 రకాల యాప్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇది మిక్స్‌డు రియాలటీ సేవలను అందిస్తుంది. దీనికి కేబుల్‌ కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆకాశ్‌ అంబానీ మాట్లాడుతూ‘‘ రిలయన్స్ సిబ్బంది అభివృద్ధి చేసిన 5జీ గురించి ప్రకటించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ఒక సారి స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే వీటిని వినియోగంలోకి తెస్తాము’’ అన్నారు. 

 జియోమార్ట్‌ పురోగతి గురించి ఇషా అంబానీ వివరించారు. 200 పట్టణాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టుకు సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. ‘‘జియోమార్ట్‌కు రెండు మూల స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఒకటి.. శక్తివంతమైన దేశీయ టెక్నాలజీ వేదికను కిరాణా దుకాణదారులకు, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం. రెండోది.. రిలయన్స్‌ రిటైల్‌కు ఉన్న నెట్‌వర్క్‌ సాయంతో ఈ ఫలాలను దేశంలోని మూలమూలలకు చేర్చడం ’’ అని అన్నారు. 

గూగుల్‌ సీఈవో సందేశం..

ఈ ఏజీఎంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ఇప్పుడు భారతీయులు టెక్నాలజీ వారి వద్దకు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరంలేదు. స్మార్ట్‌ఫోన్‌, చౌకగా లభించే డేటా ఈ రెండు భారతీయులు తేలిగ్గా ఆన్‌లైన్‌లోకి వచ్చేందుకు సహాయపడుతున్నాయి’’ అని పేర్కొన్నారు. అనంతరం జియోతో జట్టుకట్టిన అంశాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి. జియోతో జట్టుకట్టినందుకు గర్విస్తున్నాను. స్మార్ట్‌ఫోన్‌ వాడే అవకాశం రాని వందల మందికి ఇంటర్నెట్‌ను చేర్చేందుకు 4.5 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేసిన గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటలైజేషన్‌ ఫండ్‌ ద్వారా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.