తగ్గనున్న రాష్ట్రాల జీఎస్టీ ఆదాయ కొరత? - states gst revenue shortfall may be lower
close

Published : 21/02/2021 22:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గనున్న రాష్ట్రాల జీఎస్టీ ఆదాయ కొరత?

దిల్లీ: గత నాలుగు నెలలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న జీఎస్టీ ఆదాయ కొరత రూ.40 వేల కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు భారీగా తగ్గనుందని పేర్కొన్నాయి. అయితే, 14 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం కష్టమేనని అభిప్రాయపడ్డాయి. 

ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రాల జీఎస్టీ ఆదాయంలో రూ.1.80 లక్షల కోట్లు కొరత ఏర్పడే అవకాశం ఉందని తొలుత అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంట్లో రూ.1.10 లక్షల కోట్లు జీఎస్టీ అమలు కారణంగా, మిగిలిన రూ.70వేల కోట్లు కరోనా సంక్షోభం వల్ల తలెత్తనుందని లెక్కగట్టారు. అయితే, గత నాలుగు నెలల్లో వసూళ్లు పుంజుకున్న నేపథ్యంలో ఆదాయ కొరత అంచనాలు రూ.1.40 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ‘ప్రత్యేక బారోయింగ్‌ విండో’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా రూ.1.10 లక్షల కోట్లు అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విడతల వారీగా రూ.లక్ష కోట్ల పరిహారాన్ని అందించినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం బకాయిల్లో 91% చెల్లించామని వెల్లడించింది. జీఎస్టీ చట్టం ప్రకారం.. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రాల ఆదాయాల్ని 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని 14 శాతం వృద్ధి రేటుతో లెక్కిస్తారు. ఏమైనా కొరత ఏర్పడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని