Nirmala Sitharaman: భారత్‌కు.. SBI వంటి 4 బ్యాంకులు అవసరం! - telugu news india needs 4 sbi size banks to meet growing needs of economy fm
close

Published : 26/09/2021 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nirmala Sitharaman: భారత్‌కు.. SBI వంటి 4 బ్యాంకులు అవసరం!

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబయి: భారత్‌కు SBI తరహా నాలుగైదు బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశంలో డిజిటల్‌ సేవలు అందుతున్నప్పటికీ.. భౌతికంగా బ్యాంకు శాఖలు లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచీలు/సేవా కేంద్రాల ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA) 74వ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి.. ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తులో భారతీయ బ్యాంకింగ్‌ ఏ విధంగా ఉండాలో బ్యాంకింగ్‌ పరిశ్రమ ముందుగానే అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్‌లో 2017 నాటికి 27 ప్రభుత్వరంగ బ్యాంకులు (PSBs) ఉండేవి. కానీ, బ్యాంకుల విలీనం తర్వాత దేశంలో ప్రస్తుతం ఏడు పెద్ద జాతీయ బ్యాంకులు, మరో ఐదు చిన్న బ్యాంకులు ఉన్నాయి. అయితే, కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ విలీన ప్రక్రియను సజావుగా సాగేలా బ్యాంకర్లు చేసిన కృషిని కేంద్ర ఆర్థికమంత్రి ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ స్థాయి వంటి బ్యాంకులు కనీసం నాలుగైదు అవసరమని పేర్కొన్నారు. నూతన మార్పులు, పెరుగుతోన్న అవసరాలకు అనుగుణంగా పెద్ద బ్యాంకులు అవసరమవుతున్నాయని.. అందుకే మరిన్ని బ్యాంకుల విలీనం దిశగా అడుగులు పడాల్సిన అవసరాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, ఆర్థిక కార్యకలాపాలు పెరిగినప్పటికీ దేశంలో ఇంకా బ్యాంకు బ్రాంచీలు లేని జిల్లాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను మరింత విస్తరించేలా బ్యాంకులు కృషి చేయాలని సూచించారు. డిజిటల్‌ సేవలు అందుతున్నప్పటికీ భౌతికంగా బ్యాంకు శాఖలు/సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా బ్యాంకర్లు ఆలోచించాలని ఐబీఏ వార్షిక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని