Electric Vehicles: 2025 కల్లా కొత్త బస్సుల్లో 10 శాతం విద్యుత్తువే! - ten pc of new Buses will be Electric by 2025
close

Published : 20/08/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Electric Vehicles: 2025 కల్లా కొత్త బస్సుల్లో 10 శాతం విద్యుత్తువే!

దిల్లీ: దేశంలో కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో 8-10 శాతం విద్యుత్తువే ఉండే పరిస్థితి 2025 కల్లా సాకారమవుతుందని రేటింగ్స్‌ సంస్థ ఇక్రా పేర్కొంది. ఏడాదిన్నర కాలంగా కొవిడ్‌ వల్ల ప్రజా రవాణా వ్యవస్థలపై ఒత్తిడి ఉన్నా, ఇ-బస్‌ల కొనుగోళ్లు పెరుగుతున్నాయని వివరించింది. విద్యుత్తు వాహనాల తయారీ, అమ్మకాల్లో వేగం పెంచేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ 2 పథకం గడువును రెండేళ్లు పొడిగించి, 2024 ఏప్రిల్‌గా చేయడం ఈ రంగానికి సహకారం అందించేందుకు ఉపయోగ పడుతుందని తెలిపింది. ఈ పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస్తుందని గుర్తు చేసింది. బస్సు వ్యయంలో 40 శాతం వరకు రాయితీ వర్తిస్తోందని, డీజిల్‌ వ్యయాలతో పోలిస్తే వీటిని 3-5 రెట్లు చౌకగా నడపొచ్చని వివరించింది.

అందువల్ల బస్సు యాజమాన్యాలకు సీఎన్‌జీ బస్సులతో సమాన వ్యయాలే విద్యుత్తు బస్సులతో అవుతాయని, డీజిల్‌ బస్సుల కంటే 20-30 శాతం తగ్గుతాయని విశ్లేషించింది. ప్రారంభంలో రాయితీల వల్ల ఇ-బస్‌లకు మేలు కలిగినా, క్రమంగా దేశీయ తయారీ, విడిభాగాల లభ్యత వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఫలితంగా వీటి అమ్మకాలు పెరుగుతాయని పేర్కొంది. ఇ-బస్సుల పనితీరు, సామర్థ్యంపైనే మధ్య, దీర్ఘకాలంలో ఈ విభాగ వృద్ధి ఆధారపడుతుందని వివరించింది. ఛార్జింగ్‌ సదుపాయాల కొరత, ఒకసారి ఛార్జింగుతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదనే అంశం, బస్సు ధరల వంటివి ఇ-బస్‌లకు సవాళ్లు విసిరే అంశాలని, అయినా కూడా 2024-25కు కొత్త బస్సుల్లో 8-10 శాతం ఇ-బస్‌లే ఉంటాయనే అంచనాను ఇక్రా రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకుమార్‌ కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ఇ-బస్‌ తయారీ సంస్థలతో ప్రత్యక్ష అనుసంధానం కలిగిన సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన సంస్థలు మాత్రం ఇ-బస్‌లలో దూసుకెళ్తాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని