బడ్జెట్‌: నేల విడవని నిర్మలమ్మ..! - the budget is simple
close

Updated : 01/02/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌: నేల విడవని నిర్మలమ్మ..!

అతిశయాల్లేవ్‌.. రాబడికి తగ్గట్టే కేటాయింపులు

బడ్జెట్‌ ప్రవేశపెడితే ప్రభుత్వాలు జనాకర్షక పథకాలను పరిచయం చేయడం సాధారణం. లేదంటే ఉన్న పథకాలకే ఎక్కువ బడ్జెట్‌ కేటాయించి వాటినే ఓట్లాకర్షక పథకాలుగా మార్చేస్తాయి! కేంద్రం ఈసారి ప్రవేశపెట్టిన పద్దు మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ అంకెల గారడీ, నేల విడిచి సాము చేయనట్టే కనిపిస్తోంది. ప్రజారోగ్యాన్ని మినహాయిస్తే సంక్షేమ పథకాల జాడేమీ లేదు. ఉద్యోగులు, పన్ను చెల్లింపు దారులపై ప్రత్యేక వరాల జల్లేమీ కురిపించలేదు. అత్యంత కీలకమైన అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆదాయానికి తగినట్టే కేటాయింపులు చేశారు. కేంద్ర పద్దుపై కొవిడ్‌ ప్రభావం బాగానే కనిపించింది.


సంక్షేమానికి కత్తెర!

బడ్జెట్‌లో ఈ సారి కొత్త సంక్షేమ పథకాల జాడ కనిపించలేదు. కొవిడ్‌ ప్రభావంతో రాబడి తగ్గిపోయింది. రెవిన్యూ లోటు ఎకాఎకీన పెరిగింది. ప్రజారోగ్యం, కొవిడ్‌-19 వ్యాక్సిన్ పంపిణీకి భారీగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మిగతా ఖర్చులూ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్భాటం కోసం కొత్త పథకాలు తీసుకురాలేదు. ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేశారు. బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. రుణ కల్పన పైనా ఏమీ మాట్లాడలేదు. అందుకే రూ.34,83,236 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. గత బడ్జెట్‌ సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపుగా రూ.32,000 కోట్లే ఎక్కువ. ఫర్టిలైజర్లు, ఆహారం, పెట్రోలియం మీద సబ్సిడీని బాగా తగ్గించారు. గతేడాది సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే కేంద్ర పథకాలకు కోత పడింది. అప్పట్లో రూ.12,63,690 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.10,51,703 కోట్లు కేటాయించింది. కాగా ‘అందరికీ ఇల్లు’ నేపథ్యంతో ఇంటి కొనుగోలుదారులకు వడ్డీ మినహాయింపును మరో ఏడాది పొడిగించడం గమనార్హం.


వ్యవసాయానికి కొంత లబ్ధి

వ్యవసాయ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ కాదుగానీ రైతులకు కొంతవరకు లబ్ధి చేకూర్చేందుకే ప్రయత్నించింది. పత్తిపై కస్టమ్స్‌ సుంకాన్ని 0 నుంచి 10%, ముడి పట్టు, పట్టు దారంపై 10 నుంచి 15 శాతానికి పెంచింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఆచితూచి కేటాయింపులు చేసింది. గతేడాది సవరించిన అంచనాల ప్రకారం రూ.1,45,355 కోట్లు ఉంటే ఈ సారి స్వల్పంగా రూ.1,48,301 కోట్లకు పెంచింది. ఉపాధి హామీ పథకానికి గతేడాది రూ.1,11,500 (సవరించిన) కోట్లు కేటాయించగా ఈసారి రూ.73,000 కోట్లు కేటాయించారు. ఇక రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.4,78,196 కోట్లు కేటాయించడం గమనార్హం.


ఊరట స్వల్పం

నిక్కచ్చిగా పన్నులు చెల్లిస్తున్న ఉద్యోగులపైనా నిర్మలమ్మ వరాల జల్లు కురిపించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. అనవసర ఆశలు కల్పించలేదు. రుణాలు, రాయితీల జోలికి పోలేదు. కొత్త హామీలేవీ ఇవ్వలేదు. అయితే 75 ఏళ్లు పైబడిన వృద్ధులపై కరుణ చూపించింది. పింఛను, వడ్డీ పొందుతున్న సీనియర్‌ సిటిజన్లు ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సిన అవసరం ఇకపై లేదు. వారు కట్టాల్సిన పన్నును బ్యాంకులు జమ చేసుకొని మిగతా సొమ్ము చేతికిస్తాయి. ఆదాయ పన్ను వ్యవహారాలకు పట్టే సమయం తగ్గించేందుకు సముఖత వ్యక్తం చేసింది. పన్ను వివాదాల పరిష్కారం కోసం ‘వివాద్‌ సే విశ్వాస్‌ పథకం’ను ప్రవేశపెట్టింది. పింఛన్లకు గతేడాది రూ.2,04,393 (సవరించిన) కోట్లు అయితే ఈసారి రూ.1,89,323 కోట్లే కేటాయించారు.


ప్రజారోగ్యమే ప్రధానం

కొవిడ్‌-19 కారణంగా మునుపెన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి వచ్చింది. సవరించిన అంచనాల ప్రకారం గతేడాది వైద్యరంగానికి జీడీపీలో 1.5 శాతం కేటాయించగా ఈసారి దానిని 1.8 శాతానికి పెంచారు. మొత్తంగా ఈ బడ్జెట్‌ను గతేడాదితో పోలిస్తే రూ.94,452 కోట్ల (అంచనా) నుంచి రూ.74,602 కోట్లకు తగ్గించారు. అయితే మొత్తంగా వైద్యరంగాభివృద్ధి కోసం రూ.2,23,846 కోట్లు కేటాయిస్తున్నారు. 2021-22లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం రూ.35,000 కోట్లు కేటాయించారు. న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ సైతం దేశవ్యాప్తంగా అందించనున్నారు. పీఎం ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజన కింద ఆరేళ్లకు గాను రూ.64,180 కోట్లు కేటాయించనున్నారు. హెల్త్, వెల్‌నెస్‌ కేంద్రాలు, సమ్మిళిత ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు, అత్యవసర ఆస్పత్రి విభాగాలను నిర్మించనున్నారు. రోగాలు రాకుండా, వస్తే నయం చేసేలా, ఆ తర్వాత ఆరోగ్య స్థితిలో ఉండేలా వైద్యరంగాన్ని బలోపేతం చేయనున్నారు. పౌష్టికాహార పథకం, పోషణ్‌ అభియాన్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను ఆవిష్కరించారు.


ఉపాధి కోసం

పరిశ్రమలు, అంకుర సంస్థలు, మౌలిక సదుపాయాల నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయంగా మన తయారీరంగం విజేతగా అవతరించేందుకు 2021-22 నుంచి ఐదేళ్లవరకు రూ.1.97 లక్షల కోట్లు ఖర్చుచేయనుంది. మొత్తం 13 రంగాల్లో అభివృద్ధి జరగనుంది. ఇంధనం, శక్తి, రహదారులు, పట్టణ, రైల్వేల్లో ప్రాజెక్టులు నిర్మించనున్నారు. మూడేళ్లలో 7 టెక్స్‌టైల్‌ పార్కుల సృష్టి, అంతర్జాతీయంగా అభివృద్ధికి మిత్రా పథకం తీసుకొచ్చారు. బ్రాడ్‌గేజ్‌ రూట్లలో 100% విద్యుదీకరణ అమలయ్యేలా 2023కు లక్ష్యం పెట్టుకుంది. విద్యుత్‌, నౌకాశ్రయ ప్రాజెక్టులు తలపెట్టనుంది. ఇక మూలధనంపై ఖర్చును పెంచనుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. కష్టపడితే లాభాలు పొందే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని