ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు - types-of-term-policies
close

Published : 27/12/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

బీమా హామీ మొత్తాన్ని అనుసరించి పలు రకాల టర్మ్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా టర్మ్ పాలసీని ఎంచుకునే ముందు తమ అవసరాలకు సరిపోయే విధంగా ఉండే పాలసీని తీసుకోవాలి. క్లెయింలు సెటిల్ చేయడంలో మంచి చరిత్ర ఉన్న బీమా కంపెనీని ఎంచుకోవడం మంచిది.

1. లెవెల్‌ టర్మ్‌ బీమా పాలసీ:

ఈ పాలసీలో బీమా హామీ మొత్తం పాలసీ కాలపరిమితికంతటికీ ఒకేవిధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 50,00,000 బీమా హామీ మొత్తంతో 20 సంవత్సరాల లెవెల్‌ టర్మ్‌ పాలసీ కొనుగోలు చేసినట్లయితే ఈ పాలసీ కాలపరిమితి అయిన 20 సంవత్సరాలు బీమా హామీ మొత్తం మారదు. ఇది అతి సాధారణమైన టర్మ్‌ పాలసీ.

2. ఇంక్రీజింగ్‌ టర్మ్‌ పాలసీ:

ఈ పాలసీలో కాలవ్యవధితో పాటు బీమా హామీ మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 50,00,000 బీమా హామీ మొత్తంతో 20 సంవత్సరాల 5% ఇంక్రీజింగ్‌ టర్మ్‌ పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పాలసీదారుడి బీమా హామీ మొత్తం 5 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత పాలసీదారుడి బీమా హామీ మొత్తం రూ. 55,00,000 అవుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు సంపాదన ప్రారంభదశలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి బీమా హామీ మొత్తాన్ని నిర్ధారిస్తారు. కానీ, ఈ సంపాదన సామర్థ్యం కెరీర్‌లో ఎదుగుతూ ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బీమా హామీ ఉండటం ఎంతో ముఖ్యం. ఇంక్రీజింగ్‌ టర్మ్‌ పాలసీ కొనుగోలు చేసినట్లయితే సంపాదన సామర్థ్యం పెరుగుదలకు అనుగుణంగా బీమా హామీ మొత్తం పెరుగుతూ ఉంటుంది కాబట్టి వేరే పాలసీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ రకమైన పాలసీలు కెరీర్‌ ప్రారంభదశలో ఉన్నవారికి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

3.డిక్రీజింగ్‌ టర్మ్‌ పాలసీ:

ఈ పాలసీలో కాలవ్యవధితో పాటు బీమా హామీ మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 50,00,000 బీమా హామీ మొత్తంతో 20 సంవత్సరాల 5% డిక్రీజింగ్‌ టర్మ్‌ పాలసీ తీసుకున్నట్లయితే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పాలసీదారుడి బీమా హామీ మొత్తం 5 శాతం చొప్పున తగ్గుతూ ఉంటుంది. అంటే 3(2) సంవత్సరాల తర్వాత పాలసీదారుడి బీమా మొత్తం రూ. 42.50(45) లక్షలు అవుతుంది. కుటుంబ బాధ్యతలైన పిల్లల చదువులు, వివాహం, గృహ, వాహన రుణాలు వంటివి పాలసీ కాలం గడిచే కొద్ది తీరిపోతూ ఉంటాయి. ఆ సమయంలో పెద్దమొత్తంలో బీమా హామీ అవసరం ఉండదు అనుకునే వారు ఇలాంటి పాలసీని ఎంచుకోవచ్చు.

4. ప్రీమియంను తిరిగి చెల్లించే పాలసీ:

పాలసీ కాలపరిమితి వరకూ బీమా హామీని ఇస్తూ, పాలసీ పూర్తయిన తర్వాత పాలసీదారుడికి ప్రీమియంను తిరిగి చెల్లిస్తుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితే, కుటుంబానికి బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీదారుడు పాలసీ కాలపరిమితి వరకూ జీవించి ఉన్నట్లయితే, సదరు పాలసీదారుడికి చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.మిగిలిన టర్మ్‌ పాలసీల కంటే ఈ పాలసీలకు ప్రీమియం కొంచెం అధికంగా ఉంటుంది. టర్మ్‌ పాలసీ తీసుకోవడాన్ని కేవలం ఖర్చుగా అనుకునేవారు ఈ రకమైన పాలసీని కొంచెం మెరుగైనదిగా భావించవచ్చు. మరో విధంగా ఆలోచిస్తే అదే బీమా హామీ మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకుని ఇక్కడ చెల్లించే అదనపు ప్రీమియాన్ని ఇతర రూపాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది.

5. కన్వర్టబుల్‌ టర్మ్‌ పాలసీ:

టర్మ్‌ పాలసీగా కొనుగోలు చేసినప్పటికీ, పాలసీ కాలవ్యవధిలో ఎండోమెంట్‌ లేదా మనీబ్యాక్‌ లేదా ఇతర పాలసీగా మార్చుకునే వీలును కల్పించే టర్మ్‌ పాలసీయే కన్వర్టబుల్‌ టర్మ్‌ పాలసీ.

మన కుటుంబ సభ్యులకు పాలసీ వివరాలను, అవసరం వచ్చినప్పుడు వాటిని క్లెయిం చేసే పద్దతిని వివరించాలి. పాలసీ డాక్యుమెంట్లన్నీ ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి. ఆన్‌లైన్లో టర్మ్ పాలసీ కొనుగోలు చేసినట్లయితే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కుటుంబసభ్యులకు తెలియపరచాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని