బ్రెగ్జిట్‌ తర్వాత యూకే కొత్త డీల్‌! - uk to join asia-pacific free trade pact cptpp
close

Published : 31/01/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రెగ్జిట్‌ తర్వాత యూకే కొత్త డీల్‌!

లండన్‌: ఐరోపా సమాఖ్య (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం తర్వాత  బ్రిటన్‌ మరో అడుగు ముందుకేసింది. మరో కొత్త వాణిజ్య కూటమిలో చేరేందుకు సమాయత్తమవుతోంది. 11 సభ్య దేశాలు ఉన్న ‘కాంప్రిహెన్సివ్‌ అండ్‌ ప్రొగ్రెసివ్‌ ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (సీపీటీపీపీ)’లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు ప్రకటించింది. పసిఫిక్‌ ప్రాంతంలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, జపాన్‌, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌, పెరూ, సింగపూర్‌, వియత్నాం, బ్రూనై దేశాల కూటమే ఈ సీపీటీపీపీ. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం విస్తృత వాణిజ్య ఒప్పందాలపై గురిపెట్టినట్లు తాజా నిర్ణయంతో అర్థమవుతోంది.

ఈయూ నుంచి బయటకు వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా బ్రిటన్‌ ప్రజలకు కొత్త అవకాశాలిచ్చే భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నామని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న తాము.. సీపీటీపీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మిత్రదేశాలు, భాగస్వాములతో వాణిజ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని పంపాలనుకుంటున్నామన్నారు.

సీపీటీపీపీలో చేరాలన్న తమ సంసిద్ధతను యూకే అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి లిజ్‌ ట్రస్‌, కూటమికి ప్రస్తుతం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జపాన్‌ ఆర్థిక మంత్రి యషుతోషి నిషిమురాకు సోమవారం తెలియజేయనున్నారు. అలాగే ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యూజిలాండ్‌ మంత్రి డేమియన్‌ ఓ కానర్‌తోనూ చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ట్రస్‌ మాట్లాడుతూ.. సీపీటీపీపీలో చేరడం వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మార్కెట్లు యూకేకు అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్లు, మద్యం తయారీదార్లకు తక్కువ సుంకాలు ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే యూకేలో భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉందన్నారు.

ఇవీ చదవండి...

పద్దు రోజున అజాగ్రత్త వద్దు

స్టాక్‌ మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని