ఫార్మా రంగానికి సహకరిస్తాం - we will support Pharma Industries
close

Updated : 20/04/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫార్మా రంగానికి సహకరిస్తాం

పారిశ్రామికవేత్తలతో ప్రధాని నరేంద్రమోదీ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌తో పాటు, భవిష్యత్తులో తలెత్తే వైరస్‌లను ఎదుర్కోడానికి ఔషధ రంగం పెద్దఎత్తున పరిశోధనలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆయన  సోమవారం దృశ్యమాధ్యమ విధానంలో ఔషధరంగ పారిశ్రామికవేత్తలతో సంభాషించారు. ‘‘ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రపంచంలోని 150 దేశాలకు అత్యవసర మందులు సరఫరా చేసిన ఘనత మనకు దక్కింది. ఎన్నో సవాళ్లున్నా, గతేడాది 18% వృద్ధిరేటును ఔషధరంగం నమోదుచేసింది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర మందుల ఉత్పత్తిని మరింత పెంచాలి. రెమ్‌డెసివిర్‌ ధర తగ్గించడం అభినందనీయం. అత్యవసర మందులు, ఇతరత్రా వైద్యపరికాలను ఇబ్బందుల్లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రవాణాపరంగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం న్యూ డ్రగ్స్‌ అండ్‌ రెగ్యులేటరీ ప్రాసెస్‌లో సంస్కరణలు చేపడుతోంది’’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చేయూతపై ఫార్మా పారిశ్రామికవేత్తలు ప్రధానిని అభినందించారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వారు వివరించారు. కొవిడ్‌ చికిత్స కోసం కొన్ని మందులకు విపరీతమైన డిమాండ్‌ వచ్చినా, సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

నేడు వ్యాక్సిన్‌ తయారీదార్లతో సమీక్ష

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీదార్లతో ప్రధాని మోదీ నేటి సాయంత్రం 6 గంటలకు దృశ్యమాధ్యమ విధానంలో సమావేశం కానున్నారు. దేశ, విదేశాలకు చెందిన తయారీ సంస్థల ప్రతినిధులు దీనికి హాజరవుతారు.

దిగుమతి లైసెన్స్‌ ఇవ్వండి: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

దేశంలో మూడోదశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతులివ్వాలని బహుళజాతి సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) భారత ఔషధ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. కొవిడ్‌ నిరోధానికి ఒకే డోసుగా తాము అభివృద్ధి చేసిన టీకాకు దిగుమతి లైసెన్సు మంజూరు చేయాలని కోరింది.  జేఅండ్‌జే ఈనెల 12న దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని సాంకేతిక అంశాల కోసం సోమవారం మళ్లీ దరఖాస్తు చేసుకుంది.  

ప్రజల జీవితాల్ని, జీవనోపాధిని కాపాడతాం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పని చేసి ప్రజల జీవితాల్ని, జీవనోపాధిని కాపాడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఆమె పలు వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖులతో మాట్లాడారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకున్నారు.సీఐఐ అధ్యక్షుడు ఉదయ్‌ కోటక్‌, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్‌ శంకర్‌, అసోచామ్‌ ప్రెసిడెంట్‌ వినీత్‌ అగర్వాల్‌, టాటా స్టీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టీవీ నరేంద్రన్‌, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, టీసీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథన్‌, మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ, టీవీఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, హీరో మోటోకార్ప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజాల్‌ తదితరులున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని