సొంత ఆఫీసు లేకుండానే వేలకోట్ల కంపెనీ! - you feel you need to be the best at everything
close

Updated : 08/07/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సొంత ఆఫీసు లేకుండానే వేలకోట్ల కంపెనీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం రెండేళ్లలోనే ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బౌఫారాత్‌ తన ఆన్‌లైన్‌-సమావేశ వేదిక ‘హోపిన్‌’ను వేల కోట్ల కంపెనీగా తీర్చిదిద్దాడు. హోపిన్‌ ఆన్‌లైన్‌ ఈవెంట్లను, వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తుంది. ఈ కంపెనీని అతడు 2019లో, కేవలం ఆరుమందితో ప్రారంభించాడు. నేడు అతడి కంపెనీలో దాదాపు ఆరువందల మంది పని చేస్తున్నారు.  కానీ అందులో కొంతమందిని అతడు ప్రత్యక్షంగా ఎప్పుడూ కలుసుకోలేదు. ఆ సంస్థ ఉద్యోగులు అందరూ కలసి ఒకే కప్పు కింద కూర్చుని పనిచేయరు. ఎందుకంటే ఆ కంపెనీకి సొంత ఆఫీసు భవనమే లేదు. తనకు పర్మినెంట్‌ ఆఫీసు లేదని, అదో కొరత అని తనెప్పుడూ ఆలోచించలేదంటాడు జానీ. అలాగే ఓ సాహసోపేతమైన యువ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ శాశ్వత చిరునామా కూడా లేదని చెబుతాడు. తనొక డిజిటల్‌ దేశ సంచారినని పేర్కొంటాడు. తనెక్కడుంటే అక్కడికే తన కంపెనీని తీసుకెళ్లి, తన వ్యాపారాన్ని విస్తరించుకుంటానని గర్వంగా ప్రకటించాడు. అతను ఇటీవల సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో స్వయంకృషితో ఎదిగిన కోటీశ్వరుడిగా చోటు సంపాదించుకున్నాడు. అతను తన కంపెనీ విలువను 5.65 బిలియన్‌ డాలర్లకు పెంచాడు.

కొవిడ్‌తోనే లాభాల పంట!
‘‘పదేళ్ల కింద హోపిన్‌లాంటి కంపెనీ స్థాపించి విజయవంతం కావడం కష్టం. అప్పుడు నేటి ఆన్‌లైన్‌ సమావేశాలను నడిపేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్లు కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు. నేడు కొవిడ్‌ వల్ల ప్రజలు ప్రత్యక్షంగా కలుసుకోకుండానే, ఆన్‌లైన్‌లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది. అందువల్లనే తన కంపెనీ లాభాల పంట పండించింది’’ అని నిజాయతీగా పేర్కొంటాడు జానీ.  ఏ ప్రాంతం నుంచైనా అత్యంత సమర్థవంతంగా ఉద్యోగులు పనిచేయవచ్చని, ఆఫీసుకు తప్పనిసరిగా రావాలనే నియమం తన కంపెనీలో లేదని అతడు చెబుతాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌ పరిశ్రమ బాగా వృద్ధి పొందింది. దాంతో హోపిన్‌ సరైన సమయంలో లాంచ్‌ అయిన స్టార్టప్‌గా నిలిచిపోయింది. ఇప్పటివరకూ 80 వేలకు పైగా ఈవెంట్స్‌ను ఆ సంస్థ నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి, నాటో లాంటి పెద్దపెద్ద సంస్థలకు సేవలు అందించింది. అలవోకగా వేలమందితో ఆన్‌లైన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం హోపిన్‌కు ఉంది. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని