రుణం తీసుకోవడమే మంచిదా?
close

Updated : 22/10/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుణం తీసుకోవడమే మంచిదా?

నేను కారు కొనే ఆలోచనలో ఉన్నాను. దీనికోసం 7.5 శాతం వడ్డీతో 7 ఏళ్ల వ్యవధికి రూ.9 లక్షల వరకూ రుణం తీసుకోవాలని అనుకుంటున్నాను.  దీనికి బదులుగా నా చేతిలో ఉన్న రూ.4 లక్షలను చెల్లించి, మిగతా రూ.5 లక్షలు రుణం తీసుకోవడం మంచిదా? వడ్డీ రేటు తక్కువగా ఉంది కాబట్టి, వాయిదాలు చెల్లిస్తూ.. నా దగ్గరున్న మొత్తాన్ని ఫండ్లలో మదుపు చేయొచ్చా?        

- రాము

మీరు తీసుకునే కారు రుణంపైన చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు (కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో) లభిస్తే.. మొత్తం రుణం తీసుకోండి. మీ దగ్గరున్న రూ.4లక్షలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. పన్ను మినహాయింపు లభిస్తే.. మీపై వడ్డీ భారం చాలా తక్కువగా ఉంటుంది. మీరు 20 శాతం శ్లాబులో ఉంటే.. నికరంగా 6 శాతం వడ్డీ పడుతుంది. 30శాతం శ్లాబులో ఉంటే.. 5.2% నికర వడ్డీ చెల్లించినట్లు అవుతుంది. ఇలాంటి వెసులుబాటు లేకపోతే.. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని చెల్లించి, మిగతా మొత్తానికి రుణం తీసుకోవడం మంచిది.


మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? షేర్లలో క్రమానుగత ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించవచ్చా?

- మహేందర్‌


మీ అమ్మాయి ఉన్నత చదువుల కోసం ఈ డబ్బు కావాలంటే.. 8-10 ఏళ్ల సమయం ఉంది. మీ డబ్బు వృద్ధి చెందాలంటే.. స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవచ్చు. దీనికి మీరు.. నేరుగా షేర్లలో లేదా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. షేర్లలో నెలనెలా మదుపు చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. దీన్ని సిస్టమేటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ అంటారు. షేర్లలో మదుపు చేసినప్పుడు ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ ఉండాలి. మంచి షేర్లను ఎంచుకొని, మదుపు చేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే.. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలను మూడు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.


మా నాన్న పేరుమీద ఉన్న జీవిత బీమా పాలసీ నుంచి రూ.4లక్షల వరకూ వస్తున్నాయి. ఈ మొత్తాన్ని కనీసం 6-7 ఏళ్లపాటు ఎక్కడైనా మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం పోస్టాఫీసు పథకాలు మంచివా? మ్యూచువల్‌ ఫండ్లలో ఏదైనా ప్రత్యేక పథకాన్ని ఎంచుకోవాలా?                                        

- మహేశ్‌

అధిక రాబడి కోసం మీరు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకున్నప్పుడు నష్టభయం గురించీ ఆలోచించాలి. వీటిలో సగటున 11-13శాతం వరకూ రాబడికి అవకాశం ఉంటుంది. కాస్త తక్కువ నష్టభయం ఉన్న డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 5-6 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు నష్టభయం భరించగలిగితే ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. నష్టభయం ఏమాత్రం ఉండకూడదు అనుకుంటే.. పోస్టాఫీసు కిసాన్‌ వికాస్‌ పత్రాలను తీసుకోండి. ఇందులో 6.9శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇది పదేళ్ల నాలుగు నెలల వరకూ కొనసాగించవచ్చు. రెండున్నర ఏళ్ల తర్వాత అవసరమైతే డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.


నేను ఆరేళ్ల క్రితం రూ.25 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 49 ఏళ్లు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకోవచ్చా? మొదటి పాలసీని కొనసాగించాలా? రద్దు చేసుకోవాలా?                

- ప్రసాద్‌

మీ కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించేలా బీమా తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల విలువైన బీమా ఉండాలి. దీనికోసం టర్మ్‌ పాలసీలను ఎంచుకోండి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవచ్చు. మంచి క్లెయిం సెటిల్‌మెంట్‌ చరిత్ర ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని పాలసీలు తీసుకోండి. పాలసీ నిబంధనల మేరకు ఆరోగ్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. మీరు గతంలో తీసుకున్న పాలసీ మంచి కంపెనీ నుంచి తీసుకుంటే దాన్ని కొనసాగించండి. కొత్త పాలసీలో ఈ రూ.25లక్షల బీమా గురించి తెలియజేయడం మర్చిపోవద్దు. ( ఆర్థిక విషయాల్లో మీ సందేహాలను siri@eenadu.net కు పంపించండి)

- తుమ్మ బాల్‌రాజ్‌


 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని