Pre Approved Loans: ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌ కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? - How-to-apply-for-Pre-approved-Loans
close

Updated : 10/08/2021 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pre Approved Loans: ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌ కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకుకు రావాల్సిన‌ ప‌ని లేకుండా, ఎక్కువ‌ డాక్యుమెంటేషన్ లేకుండా కొంతమందికి బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఇస్తుంటాయి. వాటిని ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటారు. అంటే ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణం అని అర్థం. ఇలాంటి లోన్‌ మీకూ మంజూరు అయ్యిందంటూ... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఎస్ఎమ్ఎస్‌లు, కాల్స్ వ‌స్తుంటాయి. మీకూ ఇలాంటి లోన్లకు సంబంధించిన కాల్స్‌, మెసేజ్‌లు గతంలో వచ్చే ఉంటాయి. అసలేంటీ ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌, వాటిని తీసుకోవడం మంచిదేనా? తెలుసుకుందాం.

ముందుగా ఆమోదించిన రుణం అంటే...

రుణదాత మీకు కాల్ చేసి, ముందుగా ఆమోదించిన రుణం లేదా తక్షణ ఆమోదం పొందిన రుణానికి మీరు అర్హులని చెప్పారంటే, దాని అర్ధం వారు మీ ప్రొఫైల్ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చారని అర్థం. అంటే మీ ఆదాయం, చెల్లింపుల చరిత్ర, బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ / క్రెడిట్లు, సిబిల్ స్కోర్‌ తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని మీకు రుణం ఇవ్వదగ్గ పరిస్థితి ఉంటే లోన్‌ ఆఫర్‌ చేస్తారు. ఇలా ముందుగా ఆమోదించిన రుణాల‌కు చాలావ‌ర‌కు సెక్యూరిటీ ఉండదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి... బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ లెండ‌ర్లు రుణాల‌ను మంజూరు చేస్తారు. 

ఒకవేళ మీరు ఇలాంటి కాల్స్ పొందినట్లైతే, మీ అవసరాన్ని బట్టి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఫోన్ కాల్‌ వచ్చినంత మాత్రాన కచ్చితంగా రుణాన్ని పొందుతారని చెప్పలేం. అప్పు తీసుకోవడంలో కేవలం మొదటి స్టెప్‌ మాత్రమే పూర్తి చేసినట్లు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముందుగా ఆమోదించిన రుణానికి సమయ పరిమితి ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు రుణం తీసుకున్నట్లైతే, దానిని కేవలం కొన్ని నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఆరు నెలలుగా ఉంటుంది. అలాగే ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 

ఇలాంటి రుణాలకు అర్హ‌త‌:

ముందుస్తు రుణాల‌ను ఆమోదించేందుకు దీర్ఘ‌కాలం పాటు బ్యాంకుతో సంబంధాలు కొన‌సాగించ‌డం, మంచి క్రెడిట్ స్కోరు, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణ‌, పొదుపు చ‌రిత్ర‌, ఆదాయం, తీసుకున్న రుణం తిరిగి చెల్లించ‌డంలో ఉత్త‌మ‌ రికార్డు వంటివి అర్హతలు. దీంతోపాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అర్హ‌త‌ను ప‌రిశీలిస్తారు. 

కావ‌ల‌సిన ప‌త్రాలు:

సాధార‌ణంగా బ్యాంకులు, వారి ఖాతాదారుల‌కు ముందుగా ఆమోదించిన రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. అందువ‌ల్ల చాలా త‌క్కువ లేదా అస‌లు ఎలాంటి డాక్యుమెంటేష‌న్ లేకుండా రుణాల‌ను మంజూరు చేస్తాయి. ఒక‌వేళ మీరు బ్యాంకు ఖాతాదారుడు కాక‌పోతే రుణదాత మీ ఆరు నెల‌ల బ్యాంకు స్టేట్‌మెంట్లు, మూడు నెల‌ల శాల‌రీ స్లిప్‌లు, అడ్ర‌స్ ప్రూఫ్ కోసం ఆధార్‌, పాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్‌లు తీసుకుంటారు. 


ముందుగా ఆమోదించిన రుణాల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు...

ప్రాసెసింగ్ సమయం తక్కువ: 

ముందుగా ఆమోదించిన రుణానికి ప్రాసెసింగ్ సమయం తక్కువగా ఉంటుంది. రుణాన్ని ముందుగానే ఆమోదించారు కాబట్టి... మీ ప్రాథమిక వివరాలు రుణదాత వద్ద ఉంటాయి. కాబట్టి చాలావరకు ప్రాసెస్‌ ముందుగానే పూర్తవుతుంది. మీరు కేవలం వారు అడిగిన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం తగ్గడంతో పాటు ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. 

తక్కువ వడ్డీకే ..

అనేక సందర్భాల్లో, ముందుగా ఆమోదం పొందిన రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తారు. ఎందుకంటే మంచి క్రెడిట్ చరిత్ర, స్థిరమైన నగదు ప్రవాహం కలిగిన వారికే ముందుగా ఆమోదం పొందిన రుణాలను అందిస్తాయి. అలాంటి వారు డీఫాల్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాన్ని అందిస్తాయి. 

ఎందుకో చెప్పక్కర్లేదు...

ముందస్తు ఆమోదం పొందిన రుణం ద్వారా వచ్చిన డబ్బును వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. దేనికి ఎంత మొత్తం వ‌చ్చిస్తున్నార‌నేది తెలపాల్సిన అవ‌స‌రం లేదు. 

రీపేమెంట్‌ స‌మ‌యం:

ముందుగా ఆమోదించిన రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు కావ‌ల‌సిన స‌మ‌యాన్ని రుణ గ్ర‌హీత ఎంపిక చేసుకోవ‌చ్చు. చాలా బ్యాంకులు డబ్బులు తిరిగి చెల్లించేందుకు 12 నెల‌ల నుంచి 60 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యాన్ని ఇసత్తున్నాయి. 

ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఎలా?

ఆఫ‌ర్ వ‌చ్చిన వారు, బ్యాంకు ప్ర‌తినిధిని సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన ఫార్మాలిటీల‌ను పూర్తి చేసిన తర్వాత నిధులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తారు. 


ఆన్‌లైన్‌లోనూ ద‌ర‌ఖాస్తు చేస్తుకోవ‌చ్చు...

1. ముందుగా మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్ అవ్వాలి. 

2. రుణ విభాగంలోని ‘ప్రీ అప్రూవ్‌డ్ లోన్స్‌’ను ఎంపిక చేసుకోవాలి. 

3. ‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి. 

4. పాప్ అప్‌లో మీరు తీసుకునే రుణ ర‌కాన్ని ఎంపిక చేసుకుని ‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి. 

5. ఫామ్‌ను ఫిల్ చేయాలి. 


గుర్తించుకోవాల్సిన అంశాలు:

1. సాధార‌ణంగా బ్యాంకులు త‌మంత తాముగా రుణాలు ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ (ముందుగా ఆమోదించిన రుణాలు) అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల నిర్ధిష్ట స‌మ‌యం మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంటుంది. 

2. ముందుస్తు చెల్లింపుల‌కు, ముందుస్తు ముగింపుల‌కు ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

3. అలా తీసుకున్న లోన్స్‌ను జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మంజూరు చేయమని కోర‌వ‌చ్చు. 

4. వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, వివిధ అంశాల‌ను ప‌రిశీలించి రుణం తీసుకోవ‌డం మంచిది. 


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని