ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు  - Precautions to take before renting your house
close

Updated : 01/09/2021 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు అద్దెకు ఇవ్వ‌డం ద్వారా ఆదాయం పొందేవారెంద‌రో ఉన్నారు. కేవ‌లం అద్దె ఆదాయంతోనే జీవ‌నం సాగించేవారూ లేకపోలేదు. సాధార‌ణంగా ఒక‌టి కంటే ఎక్కువ ఇళ్లు ఉన్న‌వారు ఇల్లు అద్దెకు ఇస్తారు. ఒక‌టే ఇల్లు ఉన్నా ఉద్యోగ రీత్యా మ‌రో ప్రాంతానికి వెళుతూ అద్దెకు ఇచ్చే వారు కొంద‌రైతే.. సొంత ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ, బ్యాంక్ రుణం తీసుకుని మ‌రో ఇల్లు కొనుగోలు చేసి వ‌చ్చిన అద్దెతో ఈఎమ్ఐలు క‌ట్టి ఆస్తిని ఏర్పాటు చేసుకునేవారు ఇంకొంద‌రు. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆదాయం కోసం ఇల్లు అద్దెకు ఇస్తుంటారు. మ‌రి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఇల్లు అద్దెకు ఇచ్చేప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 

అద్దెకిచ్చే ముందు..
ఇంటిని అద్దెకు ఇవ్వాల‌నుకుంటున్నారా లేదా నిర్ణ‌యించుకోవాలి. అద్దెకు ఇచ్చే ముందు ఇంట్లో ఏమైనా రిపేర్లు ఉంటే చేయించాలి. అన్ని స‌దుపాయాలు స‌రిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. గ‌తంలో కొన్న ఇల్లు పాత‌బ‌డి ఉండొచ్చు. అన్ని స‌క్ర‌మంగా ప‌నిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఆ త‌ర్వాత ప్ర‌చారం చేసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఏజెంట్ల‌తో ప్రచారం చేయించ‌డం మేలు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయాలి. అద్దెకు ఇచ్చాక కూడా వారితో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దిస్తుండాలి. అద్దె, ఇత‌ర ఛార్జీలు, రిపేర్లు వంటి వాటి గురించి అడిగి తెలుసుకోవాలి.

ప్రచారమే కీలకం..
పాత పద్ధతిలో ఇంటిని అద్దెకివ్వడమంటే... ఇంటి బయట ‘టు-లెట్‌’ బోర్డు తగిలించడం. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆన్‌లైన్‌లో ప్రచారం జోరందుకుంది. ఎన్నో క్లాసిఫైడ్‌ వెబ్‌సైట్లు ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. ఆకర్షణీయమైన శీర్షికతో ఇంటిని అద్దెకిస్తున్నట్టు వాణిజ్య ప్రకటన ఇవ్వాలి. అద్దెకిచ్చే ప్రాంతం, వైశాల్యం, పడక గదుల సంఖ్య, అద్దె, ఫ్యామిలీకి ఇస్తున్నామా? బ్యాచిలర్స్‌కా లాంటి వివరాలు తెలపాలి. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి. ఏ సమయంలో ఫోన్‌ చేయాలో కూడా తెలియజేస్తే మన రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవచ్చు.
 
అద్దె కోసం వెతికేవారు వెబ్‌సైట్లను చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు అనుకూలమైన ఇంటిని, వారి వారి అభిరుచికి తగినటువంటి ఇల్లు దొరికితే త్వరగా సంప్రదించేందుకు వీలు కలుగుతుంది. ఆన్‌లైన్‌లో ప్రచారంపై పెద్దగా నమ్మకంలేనివారు బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఏజెంట్లు అటు యాజమానితోనూ, ఇటు అద్దెకున్నవారితోనూ ఇంటిని చూపించినందుకుగాను ఒక నెల ఇంటి అద్దెలో సగం సొమ్ము కమీషన్‌గా కోరొచ్చు.

అద్దె ఒప్పంద పత్రం..
అద్దెకు దిగేవాళ్లతో ముందుగానే మాట్లాడుకొని కొన్ని నియమ నిబంధనలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. దీన్నే రెంటల్‌ అగ్రిమెంట్‌ అని వ్యవహరిస్తారు. అద్దె ఒప్పంద పత్రంలో కొన్ని అంశాలను తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఇంటిని అద్దెకిచ్చే యజమాని పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు, అదే విధంగా అద్దెకుండే వారి పూర్తిపేరు, ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య, వారి పేర్లు, వారు చేసే ఉద్యోగం లేదా పని, ఫోన్‌ నంబర్లు ఉండాలి. అద్దెకుండే వారి ఫొటో, వారి గుర్తింపు కార్డు (ఆధార్‌, రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు కాపీ) యాజమానులు తమ వద్ద ఉంచుకోవాలి.

ఎంత‌కాలం ఉంటారు..?
ఒప్పంద తేదీ, ఎన్ని నెలలకు అద్దెకిస్తున్నామో ఒప్పంద పత్రంలో ముఖ్యంగా పేర్కొనాలి. ఇంటి అద్దెను ఎంత కాలానికి పెంచనున్నారో, ఎంత మేరకు పెంచాలనుకుంటున్నారో రాయడం మంచిది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేసేవారు ముఖ్యంగా దానిని ఒక పెట్టుబ‌డిగా చూస్తారు. అలాంటివారు ఇంటిని విద్యార్థులకు లేదా ఉద్యోగుల‌కు కొన్ని సంవ‌త్స‌రాల పాటు అద్దెకు ఇచ్చేందుకు సుముఖ‌త చూపుతారు. అయితే ఇంటిని, ఇంటి ప‌రిసరాలను శుభ్రంగా ఉంచుతారనే ఉద్దేశంతో కుటుంబాల‌కు అద్దెకు ఇచ్చేందుకే చాలా మంది మొగ్గుచూపుతారు. ఎక్కువ కాలం ఉండేలా ఒప్పందం కుదుర్చుకొని అద్దెకిస్తారు. ఇంటిని బాగా చూసుకునేవారికి ఇవ్వ‌డం కూడా చాలా ముఖ్యం.

అద్దెను నిర్ణ‌యించండి..
ఇంటిని అద్దెకు ఇచ్చేట‌ప్పుడు మొద‌ట‌గా చేయాల్సింది ఎంత‌ మొత్తానికి ఇవ్వాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించ‌డం. ఆ ప్రాంతంలో చుట్టుప‌క్క‌లా ఎంత అద్దె ఉందో అడిగి తెలుసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న సౌక‌ర్యాల‌ను బ‌ట్టి ఎక్కువ‌గా కూడా ఇవ్వొచ్చు. ఇల్లు ఉన్న ప్రాంతం, సౌక‌ర్యాలు, ప‌రిస‌రాలు, మౌలిక వ‌స‌తులు, ఇంట్లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్, ఇల్లు కొత్త‌దా, పాతదా.. ఇలా అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని అద్దె నిర్ణ‌యించాలి. సాధార‌ణంగా కొత్త‌గా నిర్మించిన ఇళ్ల‌కి అద్దె ఎక్కువ‌గా ఉంటుంది. అదేవిధంగా పాత ఫ్లాట్‌ను ఆధునికీకరించి అద్దెకు ఇచ్చిన‌ప్ప‌టికీ అంతే మొత్తంలో డిమాండ్ చేయొచ్చు. అయితే ఇంటిని ఆధునికీకరించాలనుకున్నప్పుడు పెట్టిన ఖ‌ర్చును తిరిగి రాబ‌ట్టుకోగ‌ల‌మా లేదా ఆలోచించుకొని నిర్ణ‌యించుకోవాలి.

ప్పంద ప‌త్రంలో ఉండాల్సిన ఇత‌ర అంశాలు..
* అడ్వాన్సు లేదా సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎంత సొమ్ము చెల్లించాలో ఒప్పంద పత్రంలో పేర్కొనాలి.

* మెయింటెనెన్స్‌ ఛార్జీలు, పన్ను చెల్లించే బాధ్యత ఎవరిదో రాయాలి. ఒక వేళ కిరాయిదారుకే ఆ బాధ్యత అప్పగిస్తే ఎంత సొమ్ము అవుతుందో సూచించాలి.

* కరెంట్‌, నీటి బిల్లుల చెల్లింపుల విషయం ప్రస్తావించాలి.

* ఇంటి వైశాల్యం, గదుల సంఖ్య, తలుపులు, కిటికీల సంఖ్య ప్రస్తావించాలి.

* సెమీ ఫర్నిష్డ్‌, ఫుల్లీ ఫర్నిష్డ్‌ అని రకాలు ఉంటాయి. సెమీ ఫర్నిష్డ్‌ ఇల్లయితే ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, బల్బుల సంఖ్య ఒప్పంద పత్రంలో రాయాలి.

* ఫుల్లీ ఫర్నిష్డ్‌ అయితే పైన పేర్కొన్న వాటితోపాటు టీవీ, ఫ్రిజ్‌, ఏసీ, సోఫాలు, వాషింగ్‌ మెషీన్‌ బీరువాలు లాంటి వస్తువుల జాబితా, వాటి సంఖ్య నమోదు చేయాలి. భవిష్యత్‌లో వీటికేమైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారనే విషయాన్ని తెలపాలి.

* ఇంటి అద్దె చెల్లించాల్సిన గడువు తేదీని, ఒక వేళ చెల్లింపు ఆలస్యమైతే దానికి వసూలు చేసే రుసుములను ఒప్పంద పత్రంలో పేర్కొనాలి.

* అలాగే అద్దె సొమ్ము రూపంలో చెల్లించాలో లేదా బ్యాంకు ఖాతాలో జమచేయాలా అనే విషయాన్ని పేర్కొనాలి. బ్యాంకు ఖాతాలో జమ చేసేట్టయితే అకౌంట్‌ నంబర్‌, బ్యాంకు శాఖ తదితర వివరాలను పొందుపర్చాలి.

* ఇండిపెండెంట్‌ హౌస్‌ను అద్దెకు ఇచ్చేట్టయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత, చెట్లు, బావి, ప్రహరీ ఉంటే వాటి సంరక్షణ తీసుకునే విషయాన్ని తెలపాలి.

* అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిబంధనలు వేరేగా ఉంటాయి. కారు, బైక్‌ పార్కింగ్‌ స్థలం, ఉపయోగించాల్సిన లిఫ్టు, కామన్‌ ఫ్లోర్‌, పిల్లల ఆట మైదానం, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ లాంటి వాటికి చెల్లించాల్సిన ఫీజు ప్రస్తావించాలి.

* ఇంకా ఏమైనా అదనపు అంశాలుంటే చేర్చి ఒప్పంద పత్రం తయారుచేసి ఇరుపక్షాలు, సాక్షుల సమక్షంలో సంతకం చేయాలి.

వెరిఫికేషన్ పూర్తిచేయాలి..
ఇంట్లో అద్దెకుండేవారు ఒప్పంద ప‌త్రంలో ఉన్న మాదిరిగా అన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటించాలి. ఇరువురి ఆమోదంతో ఒప్పందంలో మార్పులు కూడా చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. అద్దెకు ఇవ్వడం అనేది ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది. వాటన్నింటినీ సామరస్యంగా, చట్టబద్ధంగా పరిష్కరించుకునేందుకు రిజిస్ట్రేషన్‌ చాలా ముఖ్యం. 
ఒక‌వేళ అద్దెకు ఉన్న‌వారు స‌మ‌యానికి డ‌బ్బు చెల్లించ‌కుండా ఇబ్బందికి గురిచేస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఒప్పంద‌ ప‌త్రాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. అద్దెకుండేవారి గురించి పూర్తిగా విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ అద్దెకుండే వారి గుర్తింపు పత్రం, వారు పనిచేసే కార్యాలయ చిరునామా, గుర్తింపుపత్రాలు ‘వెరిఫికేషన్‌ ఫారం’తో కలిపి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో అందించాలి. వారు అద్దె కోసం వచ్చిన తేదీ, ఎంతవరకు ఉంటారనేది పేర్కొనాలి. ఒకవేళ అద్దెకు వచ్చినవారు విదేశీయులైతే వారి వద్ద నుంచి పాస్‌పోర్టు కాపీని తీసుకోవాలి. తీవ్రవాద, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల నుంచి అద్దె కోసం వచ్చేవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది.

నిరంత‌ర త‌నిఖీ..
అద్దెకిచ్చిన పరిసరాలను అప్పుడప్పుడూ గమనిస్తుండాలి. శుభ్రంగా ఉంచుకున్నదీ లేనిదీ, నీటి, కరెంటు వాడకం ఎలా ఉందో పరిశీలిస్తుండాలి. నెల‌కోసారి లేదా మూడు నెల‌ల‌కోసారి అలా ఇంటిని త‌నిఖీ చేస్తుండాలి. ఇలా చేస్తుంటే చుట్టూ ఉన్న‌వారితో కూడా ప‌రిచ‌యం పెంచుకొని వారి తీరును తెలుసుకోవ‌చ్చు. స‌మ‌యానికి వినియోగ బిల్లులు, నిర్వ‌హ‌ణ ఛార్జీలు చెల్లిస్తున్నారా లేదా చూడాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని