రుణాల కోసం ఈ ఐదు పెట్టుబ‌డులను హామీగా చూపించొచ్చు - You can get loans on these investments
close

Updated : 30/09/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుణాల కోసం ఈ ఐదు పెట్టుబ‌డులను హామీగా చూపించొచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక ప్ర‌ణాళిక‌లో పెట్టుబ‌డుల‌నేవి కేవ‌లం సంప‌ద సృష్టికే గాకుండా, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌కుండా కూడా ఆదుకుంటాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో మ‌నం ఆ పెట్టుబ‌డుల‌ను నిలిపివేయ‌డ‌మో లేదా వెన‌క్కి తీసుకోవ‌డ‌మో జ‌రుగుతుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు చిన్న చిన్న మొత్తాల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైనా, అంత‌కంటే ఎక్కువ విలువ గ‌ల పెట్టుబ‌డుల‌ను ఆపివేయ‌డం మంచిదేనా? ఇలాంటి సంద‌ర్భాల్లో ఈ పెట్టుబ‌డుల‌ను పూచీక‌త్తుగా చూపించి రుణాలు తీసుకొని త‌ర్వాత చెల్లించొచ్చు. అన్ని పెట్టుబ‌డులనూ హామీగా చూపెట్టి రుణాల‌ను పొంద‌లేం గానీ కొన్ని ర‌కాల పెట్టుబ‌డుల‌ను పూచీక‌త్తుగా చూపించి రుణాలు పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆస్తులు: పూచీక‌త్తు రుణాల్లో ప్ర‌ధాన‌మైన‌ది ఆస్తుల త‌న‌ఖా రుణాలు. నివాస‌, వాణిజ్య ఆస్తుల‌పై చ‌ట్ట‌బ‌ద్ధంగా హ‌క్కు గ‌ల వ్యక్తుల‌కే బ్యాంకులు రుణాలు అంద‌జేస్తాయి. ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను పూచీక‌త్తుగా చూపించి విద్య‌, ఇళ్ల కొనుగోలు, వ్యాపార అవ‌స‌రాల‌కు రుణాలు తీసుకోవ‌చ్చు. ఈ త‌ర‌హా రుణాలలో వ‌డ్డీరేట్లూ త‌క్కువ‌గానే ఉండే అవ‌కాశ‌ముంది.

ఒక‌వేళ రుణ‌గ్ర‌హీత తీసుకున్న రుణాన్ని స‌కాలంలో చెల్లించ‌క‌పోతే, రుణ‌మిచ్చిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవ‌చ్చు. అయితే చెల్లించాల్సిన రుణం కంటే ఆస్తి విలువ ఎక్కువున్న సంద‌ర్భాల్లో రుణ‌గ్ర‌హీత‌కు చ‌ట్ట ప‌రంగా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు, మీ ఆర్థిక స‌ల‌హాదారును లేదా లాయ‌ర్‌ను కలవాల్సి ఉంటుంది.

నాన్‌-ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీలు: రుణాల‌పై హామీగా చూపించేందుకు అన్ని ర‌కాల జీవిత బీమా పాల‌సీలు పనికిరావు. ఉదాహర‌ణ‌కు యూనిట్ లింక్డ్‌ ఇన్సూరెన్స్ పాల‌సీలు (యూలిప్స్‌), ట‌ర్మ్ పాల‌సీలు ఇందుకు అన‌ర్హం. అయితే ఎండోమెంట్, మ‌నీబ్యాక్ లాంటి సంప్ర‌దాయ బీమా ప‌థ‌కాల ద్వారా రుణాలు పొందొచ్చు. అయితే రుణం తీసుకునేముందు ఏ త‌ర‌హా జీవిత బీమా పాల‌సీలకు అర్హ‌త ఉందో ప‌రిశీలించుకుని ముంద‌డుగు వెయ్యిండి.

అలాగే మీ పాలసీపై ఉన్న హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌లు అయినంత మాత్రాన మీకు రూ.10 ల‌క్ష‌ల రుణం ల‌భించ‌దు. పాల‌సీ స‌రెండ‌ర్ విలువ ఆధారంగా రుణ మొత్తం మంజూరు చేస్తారు. మీరు స్వ‌చ్ఛందంగా పాల‌సీని స‌రెండ‌ర్ చేసిన‌ప్పుడు ఆ పాల‌సీకి ఉన్న విలువ‌ను స‌రెండర్ విలువ అంటారు. చాలా సంద‌ర్భాల్లో స‌రెండ‌ర్ విలువ‌లో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణాన్ని ఇస్తారు. అలాగే ఈ స‌మ‌యంలో నో బోన‌స్‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు.

ప్ర‌భుత్వ బాండ్లు: పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోలో బాండ్లు, డిపాజిట్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల వంటివి ఉంటే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రుణం తీసుకునేందుకు వీటిని హామీగా పెట్టొచ్చు. ప్ర‌భుత్వ బాండ్ల‌లో నాబార్డ్, సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు వంటి వాటిని రుణం తీసుకునేందుకు పూచీక‌త్తుగా చూపించొచ్చు. అయితే ఈ త‌ర‌హా పెట్టుబ‌డుల్లో ప్ర‌భుత్వ విశ్వాసం, భద్ర‌త ఉన్న‌ప్ప‌టికీ, ఇత‌ర ప‌థ‌కాల‌తో పోలిస్తే వీటికి న‌గ‌దు ల‌భ్య‌త త‌క్కువ‌.

జాతీయ పొదుపు ప‌త్రాలు: జాతీయ పొదుపు ప‌త్రాల ద్వారా వ్య‌క్తులు నిరభ్యంతరంగా రుణాలు పొందొచ్చు. మిగిలిన సంప్ర‌దాయ వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే వీటి పూచీక‌త్తుగా ఇచ్చే రుణాలపై వ‌డ్డీ రేట్లూ త‌క్కువ‌గానే ఉంటాయి. ఈ నిబంధ‌న‌లు ఒక్కో బ్యాంకులో ఒక్కో ర‌కంగా ఉంటాయి. ఈ ప‌త్రాల కాలావ‌ధి ఆధారంగా రుణాల మంజూరు అవుతాయి. మొత్తం స‌ర్టిఫికెట్ విలువ‌లో 85 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది. మూడేళ్ల కాల‌వ‌ధి గ‌ల స‌ర్టిఫికెట్లపై ఎక్కువ మొత్తంలో రుణం పొందొచ్చు. అలాగే రుణ గ‌డువు తీర‌క‌ముందే అప్పుల‌ను చెల్లించే సౌల‌భ్యం ఇందులో ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు: బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లనూ పూచీక‌త్తుగా చూపించి రుణాలు పొందొచ్చు. సంప్రదాయ రుణాల‌తో పోలిస్తే ఈ త‌ర‌హా త‌న‌ఖా రుణాల‌లో వ‌డ్డీ రేట్లూ త‌క్కువే. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను త‌న‌ఖా పెట్టి తీసుకునే వ్య‌క్తిగ‌త రుణాలు ఒక్క రోజులోనే మంజూర‌య్యే అవ‌కాశం ఉంది. రుణగ్ర‌హీతలు త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు సంబంధించిన ప‌త్రాల ర‌శీదులు, ఇత‌ర పత్రాలు చూపించి సుల‌భంగా రుణాలు పొందొచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని