close
అటో.. ఇటో..

మదుపర్ల రక్షణాత్మక వైఖరి
దిగ్గజ కంపెనీల దివాలా ప్రక్రియే కారణం
ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా దృష్టి
నిఫ్టీ చలనం 10900-11200 మధ్య
11000 పైన నిలదొక్కుకుంటేనే ముందుకు
ఉక్కు, భారీ యంత్రపరికరాల షేర్లు రాణించే అవకాశం
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

ఈవారం స్టాక్‌ మార్కెట్‌ కదలికలు ఎలా ఉండొచ్చనే అంశంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో  పెట్టుబడులపై మదుపర్లు రక్షణాత్మక వైఖరి అవలంబిస్తుండటమే ఇందుకు కారణం. సానుకూల.. ప్రతికూల పరిణామాలు సంభవించినా తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తుండటంతో సూచీలు ఏ దిశలో కదలాడుతాయో చెప్పలేని పరిస్థితి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్‌కామ్‌ సహా ఇటీవల దిగ్గజ కంపెనీల్లో కొన్ని దివాలా ప్రక్రియకు వెళ్లడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం పడిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వారం చాలా షేర్లు స్తబ్దుగా చలించొచ్చని, ఏమైనా సాంకేతిక అంశాలు కలిసొస్తే తిరిగి పుంజుకునే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. ఈ వారం నిఫ్టీ 10900- 11200 మధ్య చలించొచ్చని,. 11000 స్థాయికి పైన నిలదొక్కుకుంటేనే సూచీ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుందన్నది అభిప్రాయం. ఈవారంలో వెల్లడికానున్న ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా సూచీలపై ఉంటుంది. కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో ఈవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటి ఆధారంగా ఆయా రంగాల షేర్ల కదలికలు ఉంటాయి. మార్చి 1లోపు చైనా అధ్యక్షుడితో సంప్రదింపులు ఉండకపోవచ్చనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఈ వారం ఆయా రంగాలు, షేర్ల కదలికలపై విశ్లేషకుల అంచనాలు ఇలా..
* బ్యాంకింగ్‌ షేర్లు ప్రధాన మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా చలించే అవకాశం ఉంది. మూలధన సాయంలో చివరి విడత నిధుల జారీపై ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు వెలుగులోకి రావచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు కూడా ఈ షేర్లకు దిశానిర్దేశం చేస్తాయి.
* వాహన రంగ షేర్లు బలహీన పడొచ్చు. టాటా మోటార్స్‌ అత్యధిక త్రైమాసిక నష్టాన్ని నమోదు చేయడమే ఇందుకు నేపథ్యం. జనవరిలో వాహన అమ్మకాలు తగ్గడం వల్ల ఈ షేర్లపై ఒత్తిడి కొనసాగొచ్చు.
* ఐటీ రంగ షేర్లు స్తబ్దుగా చలించొచ్చు. కీలక రేట్ల కోత నేపథ్యంలో వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే రంగాల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. రూపాయి కదలికలు దిశానిర్దేశం చేస్తాయి.
* భారీ యంత్రపరికరాల రంగ షేర్లు రాణించొచ్చు. కీలక రేట్లు తగ్గించడం వీటికి సానుకూలత తెచ్చిపెట్టొచ్చు.
* లోహ రంగ షేర్లు చాలా సానుకూలంగా కదలాడొచ్చు. ఫిబ్రవరి, మార్చిలో అధిక గిరాకీ దన్నుతో ఉక్కు ధరలు పుంజుకునే అవకాశం ఉండటం, ఈ రంగ షేర్ల విలువలు బాగా తగ్గడం కలిసి రావొచ్చని అంచనా. ఈ వారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో హిందాల్కో షేర్లు వెలుగులోకి రావచ్చు.
* ఔషధ రంగ షేర్లు ఒక శ్రేణిలో చలించే అవకాశం ఉంది. గ్లెన్‌మార్క్‌ ఫార్మా, సన్‌ ఫార్మా ఈ వారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ప్రామాణిక సూచీల నుంచి ఈ రంగ షేర్లు సంకేతాలు అందిపుచ్చుకుంటాయి. అమెరికా- చైనాల మధ్య జరిగే చర్చలపై కన్నేసి ఉంచాలి.
* తాత్కాలిక బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గానికి ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాలు, రైతులకు పెట్టుబడి సాయం, ఆర్‌బీఐ కీలక రేట్ల కోత లాంటి వాటితో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లలో సానుకూల ధోరణి నెలకొంది. వినియోగం పెరిగేందుకు ఇవి కారణమవుతాయని, ఫలితంగా ఈ రంగ షేర్లు రాణించొచ్చని పేర్కొంటున్నారు.
* సిమెంట్‌ రంగ షేర్లకు లాభాలు రావొచ్చు. సిమెంటు ధరలు పెరిగిన నేపథ్యంలో జనవరి-మార్చి త్రైమాసికంలో మార్జిన్లు పెరగొచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. అయితే ధరల పెంపును ఉపసంహరించుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నందున.. దానిపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఒకవేళ ఇదే జరిగితే సెంటిమెంటు ప్రతికూలంగా మారే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం సిమెంటు కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నందున, వీటిని కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.
* కీలక పరిణామాలేవీ లేనందున టెలికాం రంగ షేర్ల కదలికలు స్తబ్దుగా ఉండొచ్చు. అంతర్లీనంగా ప్రతికూల ధోరణి కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు గణనీయ సంఖ్యలో చందాదార్లను కోల్పోయిన నేపథ్యంలో ఆ ప్రభావం ఈ కంపెనీల షేర్లపై కొనసాగొచ్చని భావిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.