close
గాంధీ రాక వెనుక?

యెస్‌ బ్యాంక్‌లో ఏంజరుగుతోంది

యెస్‌ బ్యాంకు గత ఏడాది కాలంగా అన్నీ ప్రతికూలతలనే చవిచూస్తోంది. ఒక దాని వెంట ఒకటి వచ్చిపడుతుండడంతో గతేడాది రూ.400కు పైగా పలికిన షేరు ధర ఇపుడు రూ.140 స్థాయికి పడిపోయింది. తాజాగా ఆ బ్యాంకు బోర్డులో ఆర్‌బీఐ తన నామినీని నియమించింది. మరి ఈ పరిణామం వల్ల యెస్‌ బ్యాంకు షేరు కోలుకుంటుందా? లేదా ఇంకా ఒత్తిడికి లోనవుతుందా?

తాజాగా యెస్‌ బ్యాంకు బోర్డులోకి ఆర్‌బీఐ మాజీ అధికారి వచ్చారు. తన నామినీగా ఆర్‌బీఐ నియమించింది. అయితే ఇదేమీ మదుపర్లలో సానుకూలతలను తెచ్చిపెట్టే అంశం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీ కాక మరింత ప్రతికూలతగా మారవచ్చేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. నామినీ నియామకం వల్ల ఇప్పటికిప్పుడు మదుపర్లు పొలోమని వచ్చి బ్యాంకు షేర్లలో పెట్టుబడులేమీ పెట్టరని యెస్‌ బ్యాంకుకు మర్చంట్‌ బ్యాంకరుగా పనిచేసిన ఒక సీనియర్‌ బ్యాంకరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే..: నామినీ ప్రభావం ప్రతికూలతలనే తెచ్చిపెడుతుందనడానికి విశ్లేషకులు సహేతుక కారణాలనే చెబుతున్నారు. సెప్టెంబరు 2016లో బ్యాంకు బిలియన్‌ డాలర్లను సంస్థాగత మదుపర్ల నుంచి సమీకరించాలని భావించినా.. నియంత్రణపరమైన మార్పుల కారణంగా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మార్చి 2017లో 750 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే చివరి సమీకరణ. బిలియన్‌ డాలర్ల సమీకరణకు బోర్డు అనుమతి ఇప్పటికే ఉన్నా కూడా బ్యాంకు షేరు ధర బాగా క్షీణించడంతో సమీప భవిష్యత్‌లో సమీకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే మదుపర్లకు ఆందోళనకర అంశంగా మారింది. ఇపుడు ఆర్‌బీఐ డైరెక్టరును యెస్‌ బ్యాంకు బోర్డులోకి వచ్చిన నేపథ్యంలో సమీకరణ మరింత ఆలస్యమవుతుందన్నది వారి ఆలోచనగా ఉంది. ఇప్పటికే మూలధనం లేకపోవడంతో నిధుల సమీకరణ అత్యంత ఆవశ్యకంగా మారింది. అయితే ప్రస్తుతానికి నిధుల సమీకరణ అన్నది ఇప్పట్లో జరిగేలా లేదు.

వృద్ధి.. కనిపించుట లేదు: కొద్ది నెలలుగా యెస్‌ బ్యాంకు పరిస్థితి బావుండడం లేదు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌లకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడంతో అక్టోబరు-డిసెంబరులో బ్యాంకు గణాంకాలు డీలా పడ్డాయి. సెప్టెంబరులో రాణాకపూర్‌కు మరో మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించడానికి ఆర్‌బీఐ నిరాకరించడంతో.. కపూర్‌ వారసుడిగా వచ్చిన రవ్‌నీత్‌ గిల్‌ బ్యాంకును ప్రక్షాళించడానికి ప్రయత్నించారు. అయితే జనవరి-మార్చిలో రూ.1510 కోట్ల నికర నష్టం ప్రకటించి స్టాక్‌ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురి చేశారు. రుణ వ్యయాల విషయానికొస్తే 2018-19కి 80 బేసిస్‌ పాయింట్లుగా బ్యాంకు అంచనా కట్టింది. అయితే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ల వల్ల అది కాస్తా 209 బేసిస్‌ పాయింట్లుగా నమోదైంది. 2019-20లో అంచనాలను రెట్టింపు చేసి 125 బేసిస్‌ పాయింట్లుగా ప్రకటించింది. 2020-21లో సాధారణ స్థాయికి రుణ వ్యయాలను చేరుస్తామని బ్యాంకు ఆశాభావంతో ఉంది. అయితే మొండి బకాయిలు, నికర నష్టాలను చూస్తే మాత్రం సమీప భవిష్యత్‌లో పరిస్థితి మెరుగుపడతుందన్న భావనలు కలగడం లేదు.

ఆర్‌బీఐ చర్యల వల్ల ఏమవుతుంది?
మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీని యెస్‌ బ్యాంకు బోర్డులోకి వచ్చారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో ఉంటారు. గిల్‌ నియామకం జరిగినా..యెస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐకున్న అనుమానాలను ఇది ధ్రువపరుస్తోందని విశ్లేషకులు అనుకుంటున్నారు. సాధారణ ప్రజల, బ్యాంకు ప్రయోజనాలను కాపాడడం కోసం గాంధీ నియామకాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆర్‌బీఐ ప్రకటించింది. ఇపుడు గాంధీ నియామకం ద్వారా ఏప్రిల్‌-జూన్‌, ఆ తర్వాతి త్రైమాసికాల్లో యెస్‌ బ్యాంకు ఖాతాలను మరింతగా ప్రక్షాళించాలన్నది ఆర్‌బీఐ ఉద్దేశంగా ఉందా అన్నదే ఇక్కడ కీలకం. అదే జరిగితే ఫలితాలు స్తబ్దుగా, మొండి బకాయిలు ఎక్కువగా నమోదవుతాయి. ఈ నేపథ్యంలో బోర్డులో గాంధీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారా లేదా స్తబ్దుగా ఉంటారా అన్నది తెలుసుకోవడానికి మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే అదే మధ్య నుంచి దీర్ఘకాలంలో బ్యాంకు భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.