Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119933
            [news_title_telugu_html] => 

కదం తోక్కి.. మళ్లీ వెనక్కి..

[news_title_telugu] => కదం తోక్కి.. మళ్లీ వెనక్కి.. [news_title_english] => [news_short_description] => ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ఎన్నికల ఫలితాల సరళి ప్రతిబింబించడంతో ఉదయాన్నే స్టాక్‌ మార్కెట్‌ దూసుకెళ్లింది. సూచీలు ఉవ్వెత్తున ఎగిసి కొత్త శిఖరాలను తాకాయి. అక్కడ నుంచి క్రమక్రమంగా లాభాలు ఆవిరవుతూ వచ్చాయి. లాభాల స్వీకరణతో చివరకు నష్టాలతో ముగిశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏనే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినా.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,1, ) )
కదం తోక్కి.. మళ్లీ వెనక్కి.. - EENADU
close
కదం తోక్కి.. మళ్లీ వెనక్కి..

తొలిసారి 40000 మైలురాయికి సెన్సెక్స్‌
 లాభాల స్వీకరణతో చివరకు నష్టాల్లోకి
 12000 పాయింట్లను తాకిన నిఫ్టీ

సెన్సెక్స్‌ అంచనా 45,000

2020 జూన్‌ కల్లా సెన్సెక్స్‌ 45000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గత సంస్కరణలు, విధాన లక్ష్యాలు కొనసాగుతాయనే అంచనాలతో ఈ విశ్లేషణను చేసింది. స్థిరమైన ప్రభుత్వం కావడంతో కొత్త సంస్కరణలను చేపట్టే విషయంలో దూకుడును  ప్రదర్శించే వీలుంటుందని అభిప్రాయపడింది.
సెన్సెక్స్‌ మైలురాళ్లు

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ఎన్నికల ఫలితాల సరళి ప్రతిబింబించడంతో ఉదయాన్నే స్టాక్‌ మార్కెట్‌ దూసుకెళ్లింది. సూచీలు ఉవ్వెత్తున ఎగిసి కొత్త శిఖరాలను తాకాయి. అక్కడ నుంచి క్రమక్రమంగా లాభాలు ఆవిరవుతూ వచ్చాయి. లాభాల స్వీకరణతో చివరకు నష్టాలతో ముగిశాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏనే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినా.. ఏ మూలో మదుపర్లలో సందేహం. ఏమైనా జరగొచ్చేమోననే భయం. అందుకే ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది.

ఉదయం 8 గంటలు
గడియారం 8 గంటలు కొట్టడంతో మదుపర్లు, విశ్లేషకులు టీవీలకు అతుక్కుపోయారు. ఏ పార్టీ గెలుస్తుందో.. స్టాక్‌ మార్కెట్‌ ఎలా కదలాడుతుందోననే అంచనాలను వేస్తూ కొందరు. గమనిస్తూ మరికొందరు. కాసేపటికి ఫలితాల సరళి రావడం ప్రారంభమైంది. ఎన్‌డీఏ ఆధిక్యంలో ఉందన్న విషయం తెలుసుకొని మదుపర్లు, విశ్లేషకులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభమయ్యే వరకు కూడా ఇదే ఒరవడి కొనసాగింది.

9.15: ఫలితాల సరళి నింపిన ఉత్సాహంతో సూచీలు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 482 పాయింట్లు పెరిగింది. ఫలితాల సరళిలో ఎన్‌డీఏ గెలుపుపై మరింత స్పష్టమైన సంకేతాలు రావడంతో గం.10.30 ప్రాంతంలో తొలిసారి 40,000 మైలురాయిని తాకింది. ఆ తర్వాత కూడా అదే ఉత్సాహంతో 40,125 పాయింట్లను చేరింది. ఇది సూచీకి జీవనకాల గరిష్ఠ స్థాయి.

10.45: జీవనకాల గరిష్ఠ స్థాయిని చేరాక మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఓ వైపు ఎన్‌డీఏ మెజార్టీ పెరుగుతున్నా కూడా వీళ్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడం గమనార్హం. దీంతో క్రమక్రమంగా సూచీల లాభాలు ఆవిరవుతూ వచ్చాయి. మధ్యమధ్యలో ఒడుదొడుకులకూ లోనయ్యాయి.

మధ్యాహ్నం 2.30 గంటలు
లాభాల స్వీకరణ కొనసాగడంతో అనంతరం ఎక్కడా కూడా సూచీలు తిరిగి పుంజుకోలేకపోయాయి. మధ్నాహ్నం గం.2:30 తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. తిరిగి లాభాల్లోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. గం.3:15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 459 పాయింట్లు వరకు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి లెక్కేస్తే 1473 పాయింట్లు కోల్పోయింది.

3.30: తుదవరకు అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు సెన్సెక్స్‌ 299 పాయింట్లు నష్టపోయి 38,811.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 80.85 పాయింట్లు కోల్పోయి 11,657.05 వద్ద స్థిరపడింది.

లాభాల స్వీకరణ అందుకే..
ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడైన మర్నాడే భాజపా గెలుస్తుందనే అంచనాలతో సూచీలు భారీ లాభాలను నమోదుచేశాయి. అందువల్ల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పటికే సూచీలపై పడినందున, గురువారం ఆరంభంలో పెరిగినా ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ  కారణంతోనే చివరకు మార్కెట్‌ నష్టాలతో ముగిసిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు తేలడంతో ఇక నుంచి కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలు, వర్షపాతం, అమెరికా- వాణిజ్య యుద్ధ పరిణామాలు మార్కెట్‌కు దిశనిర్దేశం చేస్తాయని చెబుతున్నారు.

సగం.. సగం.. 

సెన్సెక్స్‌ 30 షేర్లలో సగం లాభాలతో ముగియగా.. సగం నష్టాలను చవిచూశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 5.23 శాతం పెరిగింది. కోల్‌ ఇండియా (1.56%), యెస్‌ బ్యాంక్‌ (1.53%), హీరో మోటోకార్ప్‌ (1.51%), పవర్‌గ్రిడ్‌ (1.29%), ఐసీఐసీఐ బ్యాంక్‌ (1.26%), ఎల్‌అండ్‌టీ (1.04%), భారతీ ఎయిర్‌టెల్‌ (1%) రాణించిన వాటిలో ఉన్నాయి. వేదాంతా 5.53% నష్టపోగా.. ఐటీసీ (3.69%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (2.94%), టాటా మోటార్స్‌ (2.48%), బజాజ్‌ ఫైనాన్స్‌ (2.48%), సన్‌ ఫార్మా (1.76%) డీలాపడిన వాటిల్లో ఉన్నాయి. రంగాల సూచీల్లో టెలికాం, భారీ యంత్రపరికరాలు, పరిశ్రమలు, స్థిరాస్తి, విద్యుత్‌ సూచీలు కళకళలాడాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహాలు, సాంకేతికత, ఆరోగ్య సంరణ సూచీలు కుంగాయి. 

అదానీ షేర్లు రయ్‌రయ్‌..

మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని  ఎన్నికల ఫలితాలు సంకేతాలు ఇవ్వడంతో అదానీ గ్రూపు షేర్లు పరుగుతీశాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 7 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 52 శాతం పెరగడం గమనార్హం. నాలగు రోజుల క్రితం రూ.119 స్థాయి నుంచి ప్రస్తుతం రూ.161 స్థాయిని చేరింది. అలాగే ఈ  వారంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ గ్యాస్‌, అదానీ పవర్‌ షేర్లు 26 శాతం వరకు లాభపడ్డాయి.

* 1473 పాయింట్లు 
గురువారం ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్‌ పతనమైన పాయింట్లు. 11 ఏళ్లలో ఒక రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్‌ దిగిరావడం ఇదే మొదటిసారి. 
* రూ.2.87 లక్షల కోట్లు 
గురువారం పెరిగిన మదుపర్ల సంపద. బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2,87,028.80 కోట్ల నుంచి రూ.1.53,56,153 కోట్లకు చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ తో తగ్గింది. 
* రూ.75 లక్షల కోట్లు
మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఐదేళ్ల కాలంలో పెరిగిన మదుపర్ల సంపద ఇది. ప్రస్తుతం బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.150.25 లక్షల కోట్లకు చేరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.