close
దేశీయ ఫార్మాపై యూఎస్‌లో ముప్పేట దాడి..

ధరలు, నాణ్యతపై అపోహలు రేకెత్తించే ప్రయత్నం
తిప్పికొట్టే యత్నాల్లో పరిశ్రమ వర్గాలు, ఫార్మాగ్జిల్‌
ఈనాడు - హైదరాబాద్‌

నదేశ ఔషధ కంపెనీలకు యూఎస్‌ మార్కెట్‌ ఎంతో కీలకం. దేశం నుంచి ఏటా నమోదయ్యే ఔషధ ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు యూఎస్‌ వాటానే ఉంటోంది. పెద్ద మార్కెట్‌, అధిక అమ్మకాలకు తోడు లాభాలు కూడా అక్కడ ఎక్కువే. అందుకే గత కొన్నేళ్లలో అక్కడ ఔషధాల విక్రయానికి అనుమతులు సంపాదించిన భారత కంపెనీల సంఖ్య బాగా పెరిగింది. వ్యయాలను తగ్గించుకోవటానికి జనరిక్‌ ఔషధాలను యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో అవకాశాలు అందివచ్చి క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం మన ఫార్మా కంపెనీలకు వచ్చింది. క్రమంగా యూఎస్‌ మార్కెట్‌ను భారతీయ కంపెనీ కొల్లగొడుతున్నాయని గుర్తించిన మీదట,  ముకుతాడు వేయాలనే ధోరణి అక్కడ పెరిగిపోతోందని స్థానిక ఔషధ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందువల్లే పలు ఆరోపణలు చేస్తున్నారు.


ఔషధ రంగం అమెరికా సమస్య

‘ఫిక్సింగ్‌’ ఆరోపణలు...

అనూహ్యంగా మనదేశానికి చెందిన కొన్ని కంపెనీలు అమెరికాలో ఔషధాల ధరల ‘ఫిక్సింగ్‌’ ఆరోపణల్లో చిక్కుకున్నాయి. యూఎస్‌లో 50 రాష్ట్రాలు ఉండగా, అందులో 44 రాష్ట్రాలు ‘యాంటీ-ట్రస్ట్‌ చట్టాలను’ కొన్ని ఔషధ కంపెనీలు ఉల్లంఘించాయంటూ న్యాయస్థానాల్లో ఫిర్యాదు దాఖలు చేశాయి. జనరిక్‌ ఔషధాల ధరలను కృత్రిమంగా పెంచి అధిక లాభాలు గడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ కంపెనీలపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఇందులో మనదేశానికి చెందిన సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, జైడస్‌... తదితర కంపెనీలు ఉన్నాయి. న్యాయస్థానంలో ఈ వివాదాన్ని ఎదుర్కొనటం అనేది పెద్ద సవాలు.


నాణ్యతపై విమర్శలు

భారతీయ కంపెనీలు నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయనే విషయం యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిందంటూ... కొన్ని ఉదాహరణలు జత చేస్తూ అమెరికాలో కేథరిన్‌ ఎబన్‌ అనే రచయిత ఒక పుస్తకం తీసుకువచ్చారు. దీనిపై అక్కడ పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. భారత ఔషధ కంపెనీలపై ఆరోపణలు చేయటానికి పీటర్‌ బేకర్‌ అనే యూఎస్‌ఎఫ్‌డీఏ మాజీ అధికారి అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇదంతా ఎంతో పాతకాలం నాటి సమాచారమని మనదేశంలో పరిశ్రమ వర్గాలు కొట్టివేస్తున్నాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న ఔషధ తయారీ యూనిట్ల సంఖ్య యూఎస్‌ వెలుపల అధికంగా ఉన్నది మనదేశంలోనే అనేది తెలిసిన విషయమే. కొంతకాలంగా  యూఎస్‌లో జనరిక్‌ ఔషధాల అనుమతులను పెద్ద సంఖ్యలో భారతీయ కంపెనీలు సంపాదిస్తున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడితే యూఎస్‌ఎఫ్‌బాఏ తనిఖీలను ఎదుర్కొనటం, ఔషధ అనుమతులు సాధించటం ఎలా వీలుపడుతుందని పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


‘స్కాట్‌ గాట్లిబ్‌’ మద్దతు

జనరిక్‌ ఔషధాలపై మనదేశంలో ఉన్నట్లుగానే యూఎస్‌లోనూ ఎన్నో సందేహాలు ఉన్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడవలసి వస్తుందనేది ప్రధానమైన ఆరోపణ. కానీ జనరిక్‌ ఔషధాలతో వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఇవి బ్రాండెడ్‌ ఔషధాలు ఇచ్చిన ఫలితాన్నే ఇస్తాయనేది ఎక్కువ మంది వాదన. బ్రాండెడ్‌కు- జనరిక్‌కు మధ్య తేడా ధర విషయంలోనే తప్పించి నాణ్యత విషయంలో కాదనేనది ప్రధానమైన వాదన. ఇటీవల వరకు యూఎస్‌ఎఫ్‌డీఏ కమిషనర్‌గా పనిచేసిన స్కాట్‌ గాట్లిబ్‌ తన వైఖరిని స్పష్టీకరించారు. ‘జనరిక్‌ ఔషధాలు మంచివే’ అనేది  ఆయన విశ్వాసం. జనరిక్‌ ఔషధాలపై యూఎస్‌ఎఫ్‌డీ…ఏ పర్యవేక్షణ ఇటీవల ఎంతో పెరిగింది... అంటూ, నాణ్యత విషయంలో అవి వెనుకబడిపోయే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నేనే జనరిక్‌ ఔషధాలు వాడుతున్నా, నాకు బాగానే ఉంది’ అన్నారాయన. తద్వారా జనరిక్‌ ఔషధాలకు గట్టి మద్దతు పలికినట్లు అయింది.


అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నాం...

‘‘మనదేశంలో ఔషధ కంపెనీలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాయి. ‘ప్రపంచ ఔషధశాల’ అనే పేరు మనదేశానికి ఊరకే రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఔషధ అవసరాల్లో 10 శాతం వరకూ మనమే తీరుస్తున్నాం. నాణ్యత లేకపోతే ఎన్నో దేశాలు ఇక్కడి నుంచి మందులు ఎందుకు కొనుగోలు చేస్తాయి? భారతీయ ఔషధాల నాణ్యతను ప్రశ్నిస్తూ యూఎస్‌కు చెందిన రచయిత కేథరిన్‌ ఎబన్‌ అనే రచయిత ‘బాటిల్‌ ఆఫ్‌ లైస్‌’ అనే పుస్తకం రాయటం ప్రస్తుత విమర్శలకు మూలం. కానీ ఇది సరైన వాదన కాదు. మనదేశంలో ఫార్మా కంపెనీల సత్తాను గుర్తించటంలో ఈ రచయిత విఫలం అయినట్లు చెప్పవచ్చు. ఇటీవల వరకూ యూఎస్‌ఎఫ్‌డీఏ కమిషనర్‌గా ఉన్న స్కాట్‌ గాట్లిబ్‌ జనరిక్‌ ఔషధాల నాణ్యత విషయంలో ఎంతో సానుకూలంగా ఉన్నారు. అమెరికాలో 40 శాతం జనరిక్‌ ఔషధాలు మనదేశానికి చెందిన కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ ఇటీవల పరీక్షించిన 323 ఔషధాల్లో 100 ఔషధాలు మనదేశానికి చెందినవి కాగా, ఇవన్నీ యూఎస్‌ ఫార్మాకోపియా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.’’

- ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయభాస్కర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.