close
నీదీ.. నాదీ ఒకే కథ

ఇబ్బందుల్లో యెస్‌ బ్యాంక్‌, జమ్ము & కశ్మీర్‌ బ్యాంక్‌

సాధారణంగా ప్రైవేటు రంగ బ్యాంకులు రాణిస్తుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కాస్త వెనకబడి ఉంటాయి.
కానీ.. ఓ ప్రైవేటు రంగ బ్యాంకు గత మూడు నెలల్లో మూడింట రెండొంతుల మార్కెట్‌ విలువను పోగొట్టుకుంది.
అదే సమయంలో ఒకప్పుడు షేరు ధర విషయంలో ప్రైవేటు రంగ బ్యాంకులకు దీటుగా పరుగులు తీసిన ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు సైతం డీలా పడింది.
వేర్వేరు కారణాలతో చతికిలపడుతున్న ఈ బ్యాంకుల మధ్య ఒక పోలిక ఉంది. బ్యాంకు సూచీల్లో అధ్వాన పనితీరు కనబరుస్తున్నవాటిలో ఈ రెండూ ఉన్నాయి.
ఇందులో ఒకటి యెస్‌ బ్యాంకు కాగా..
మరొకటి జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌.

త కొద్ది నెలల్లో అటు యెస్‌ బ్యాంకులో.. ఇటు జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లో యాజమాన్య మార్పులు చోటు చేసుకున్నాయి. విచిత్రం ఏమింటంటే అవి బలవంతంగా చేపట్టినవే కావడం గమనార్హం. బలవంతపు యాజమాన్య మార్పు.. తదనంతరం వచ్చిన ఆస్తుల నాణ్యత అంశాలు యెస్‌ బ్యాంకుపై ప్రభావం చూపగా.. జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంకుకు వేరే సమస్యలు ఎదురు నిలిచాయి.

భారత్‌లో ఏకైక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంకే. కొన్ని ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యాన్ని తొలగించారు. ఆ తర్వాత బ్యాంకు కార్యకలాపాల్లో రాష్ట్రప్రభుత్వ ప్రభావం పడడంతో ఒకప్పుడు షేరు విలువ పరంగా ప్రైవేటు బ్యాంకుగా పరిగణించిన మదుపర్లు దానిని ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇపుడు భావిస్తున్నారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, దేవాన్‌ హౌసింగ్‌ల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు ఈ సంక్షోభానికి దూరంగా ఉన్న బ్యాంకు షేర్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ మార్పు ఈ రెండు బ్యాంకులపైనా పడే అవకాశం లేకపోలేదు.

యెస్‌ బ్యాంకు తక్షణం 
మూలధనం కావాల్సిందే..

న్న సమస్యలకు తోడు గత నెలలో యెస్‌ బ్యాంకు రేటింగ్‌ను మూడీస్‌ తగ్గించింది. బలహీన ఎన్‌బీఎఫ్‌సీలకు, స్థిరాస్తి రంగానికి ఆ బ్యాంకు ఇచ్చిన రుణాలను ఉదహరిస్తూ.. ‘రేటింగ్‌ తగ్గింపు కోసం సమీక్షిస్తున్న’ట్లు తెలిపింది. మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేసుకోవాలంటే తక్షణం మూలధనాన్ని పెంచుకోవాలని సూచించింది. యెస్‌ బ్యాంక్‌ స్క్రిప్‌ మీద తిరిగి మదుపర్లకు విశ్వాసం కలగాలంటే ఆ పని చేయకతప్పదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు ఉదాహరణకు యాక్సిస్‌ బ్యాంకు తన షేర్ల పతనాన్ని మూలధన పెంపు ద్వారా ఎలా అడ్డుకుందో చెబుతున్నారు. తాజాగా మూలధనాన్ని సమీకరించడానికి పెట్టుబడుదార్లను వెతకడం పెద్ద కష్టమేమీ కాదన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే చాలా వరకు బ్రోకరేజీలు యెస్‌ బ్యాంకు షేరును ‘విక్రయించవచ్చు’ అంటూ సలహాలిస్తున్నాయి. అదే సమయంలో ‘లక్ష్యం’ ధరను సైతం తగ్గిస్తున్నాయి. ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో 9.47 శాతం వాటాను; రిలయన్స్‌ పవర్‌లో 3.21 శాతం వాటాను తనఖా షేర్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా పొందిన నేపథ్యంలో ఈ బ్యాంకు ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు పెరిగాయనే చెప్పాలి. రాణాకపూర్‌కు మరోసారి అవకాశమివ్వడానికి ఆర్‌బీఐ తిరస్కరించడంతో ఆయన స్థానంలో బ్యాంకు అధిపతిగా రవ్‌నీత్‌ గిల్‌ భుజాలపై ఇపుడు పెద్ద బాద్యతే ఉంది. స్వల్పకాల వృద్ధిని త్యాగం చేసైనా భవిష్యత్‌ వృద్ధిని ఎలా కాపాడుకుంటారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. అంతక్రితం అనుకున్నట్లుగా రిటైల్‌, చిన్న, మధ్య స్థాయి రుణ పోర్ట్‌ఫోలియోలను పెంచడం, కార్పొరేట్‌ లావాదేవీ బ్యాంకింగ్‌ వ్యాపారంపై దృష్టి సారించడం వంటి వాటిని కొనసాగించాలి. మొత్తం మీద ఆర్థిక స్థిరత్వం విషయంలో మదుపర్లకు బ్యాంకుపై విశ్వాసం కలిగించేలా  చేయాల్సినబాధ్యత గిల్‌దే.

జమ్ము & కశ్మీర్‌ బ్యాంక్‌ 
కొంత కాలం వేచిచూడాల్సిందే

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకైనా మదుపర్లు జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌పై దృష్టి సారించే విషయంలో ఆగాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నవంబరు 2018 నుంచీ రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము అండ్‌ కశ్మీర్‌ రాష్ట్రంలో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించనుంది. జూన్‌ 30 నాటికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులో 59.23 శాతం వాటా ఉంది. యాజమాన్య మార్పులు చేపట్టడంతో పాటు బ్యాంకు కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటుండం వల్ల మార్కెట్‌ సెంటిమెంటు సానుకూలంగా మారడానికి కొంత సమయం పట్టవచ్చని పేరు బయటకు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బ్రోకరేజీ సంస్థ అంటోంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే అవినీతి, పక్షపాత ధోరణి ఆరోపణలపై ఆ బ్యాంకు సీఎండీ పర్వేజ్‌ అహ్మద్‌ను తొలగించారు. కార్పొరేట్‌ కుంభకోణంలో కొంత మంది ఉద్యోగులు పాలుపంచుకున్నట్లు కూడా ఉన్నట్లు ఒప్పుకోవడం ఇందుకు నేపథ్యం. ఇక కొత్త యాజమాన్యం అంతక్రితంలా పెదవి విప్పకుండా ఉండడాన్ని మాని.. అందరు వాటాదార్లకు విశ్వాసం కలిగేలా చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంటుందని.. తాజా మార్పుల వల్ల వాటిపై ప్రభావం పడదని అందరికీ గట్టిగా చెప్పాల్సి ఉందన్నారు. అత్యుత్తమ పాలన ప్రమాణాలను పాటిస్తామని తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆర్‌.కె. చిబ్బర్‌ అంటున్నప్పటికీ..బ్యాంకు భవిష్యత్‌ అంతా  రాష్ట్ర ప్రభుత్వం ఆ బ్యాంకుపై చూపే  ప్రభావంపైనే ఆధారపడి ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.