close
అందరి బంధువయ..

బ్యాంకు అంటే అందరూ డబ్బులు దాచుకునే ‘ధనాలయం’. అంతేనా.. ఇంకా చాలా చాలా ఉంది. ఒకప్పుడు బ్యాంకు అంటే.. జమీందారులు, భూస్వాములకు మాత్రమే.. పేదలకు ఆమడ దూరంలో.. గ్రామీణులకైతే అందనంత దూరంలో ఉండేది.  ఇదంతా 1969కి ముందు.. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 1969 జులై 19న బ్యాంకింగ్‌ చరిత్రలో ఓ మహోధ్యాయానికి అంకురార్పణ జరిగింది. అదే బ్యాంకుల జాతీయీకరణ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ ముఖ చిత్రాన్నే మార్చివేసింది. బ్యాంకులపై ప్రజల్లో అప్పటివరకు ఉన్న అపభ్రమలు తొలిగి, విశ్వాసం ఇనుమడించేందుకు.. దేశ పురోగతికి దన్నుగా ఉండే పారిశ్రామిక రంగానికి పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు.. దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రుణాలిచ్చి అండదండగా నిలిచేందుకు.. ఈ పరిణామం దారి చూపింది. పట్టణం.. పల్లె అనే తేడాలేకుండా.. వారు.. వీరు అనే భేదాల్లేకుండా అందరి బంధువులుగా మారిపోయాయి బ్యాంకులు.  బ్యాంకుల జాతీయీకరణ నూటికి నూరు శాతం ప్రయోజనాలు ఇచ్చిందని చెప్పలేం కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇదో మేలిమలుపు లాంటి సంఘటనే!! బ్యాంకుల జాతీయీకరణ జరిగి నేటికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘ఈనాడు, హైదరాబాద్‌ / వాణిజ్య విభాగం’ అందిస్తున్న ప్రత్యేక కథనాలు

జులై 19, 1969... భారత బ్యాంకింగ్‌ రంగ చరిత్రలో మర్చిపోలేని రోజు. అప్పటిదాక విడివిడిగా పోటీపడుతున్న బ్యాంకుల్లో తొలివిడతగా 14 బ్యాంకులు జాతీయమైన రోజు. అప్పటి నుంచి దేశ ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణవిస్తరణ... వంటి వివిధ విభాగాల్లో బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఇంతింతై వటుడింతై.. అన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశం నలుమూలలా, పట్టణ- గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. ఈ జాతీయీకరణ జరిగి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు. ఈ అయిదు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ బ్యాంకుల పయనం ఎలా సాగింది, ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నాయి, భవిష్యత్తు ఎలా కనిపిస్తోంది..? అనేది ఎంతో ఆసక్తికరమైన అంశం. 1955లో ఇంపీరియల్‌ బ్యాంకును రిజర్వు బ్యాంకు, భారత ప్రభుత్వం సొంతం చేసుకొని దాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)గా మార్చాయి. 1969 నాటికి అదొక్కటే ప్రభుత్వ రంగ బ్యాంకు. మిగిలినవి అన్నీ ప్రైవేటు బ్యాంకులే. కొన్ని వ్యాపార కుటుంబాల అజమాయిషీలో ఆ బ్యాంకుల కార్యకలాపాలు సాగేవి. ప్రైవేటు బ్యాంకులపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. పైగా కొన్ని బ్యాంకులు నిలుస్తాయో, నీరసిస్తాయో... తెలియని పరిస్థితి. 1947-55  మధ్యకాలంలో 361 ప్రైవేటు బ్యాంకులు కుప్పకూలాయి. ఎంతోమంది డిపాజిటర్లు సొమ్ము పోగొట్టుకున్నారు. పైగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఆశించిన రీతిలో ఆర్థికాభివృద్ధి కనిపించలేదు. వ్యవసాయ రంగానికి అప్పులు దొరికే పరిస్థితి లేదు. కొద్దిమంది ధనికులకు, వ్యాపార వర్గాలకు మాత్రమే బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్న రోజులు అవి. పైగా ప్రజల్లో జాతీయవాదం బలంగా ఉంది. వివిధ రంగాల్లోని ప్రైవేటు సంస్థలను జాతీయం చేయాలనే డిమాండ్లు అధికంగా ఉన్న సందర్భం కూడా. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు రంగంలోని 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేస్తూ జులై 19, 1969న ఒక ఆర్డినెన్స్‌ (బ్యాంకింగ్‌  కంపెనీస్‌ - అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) జారీ చేశారు. ఆతర్వాత దాన్ని చట్టం చేశారు. దీంతో అప్పటి 70 శాతం బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రభుత్వ అజమాయిషీ కిందకు వచ్చినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని ఎంతోమంది సమర్థించగా, కొందరు మాత్రమే వ్యతిరేకించారు.

ఎలా జరిగింది?

బ్యాంకులను జాతీయం చేయాలని అప్పట్లో ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీపై ఎంతో ఒత్తిడి వచ్చింది. దేశంలో రుణ అవసరాలను తీర్చటంలో ప్రైవేటు బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించటం లేదని, అందువల్ల బ్యాంకులను జాతీయం చేసి ప్రభుత్వ అజమాయిషీ కిందకు తీసుకువస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే వాదన బలంగా ఉండేది.
కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా ఆమె బ్యాంకుల జాతీయీకరణ వైపు మొగ్గే విధంగా చేశాయి. ప్రభుత్వంలో, ప్రజల్లో పట్టు సంపాదించేందుకు ఇదొక అవకాశమని ఆమె భావించారు. అనుకున్నట్లుగానే బ్యాంకుల జాతీయీకరణ తర్వాత ఇందిరా గాంధీకి ఎన్నో వర్గాల ప్రజల మద్దతు లభించింది. 
అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న మెరార్జీ దేశాయ్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద బ్యాంకులను స్వాధీనం చేసుకున్నంత మాత్రన ఒరిగేదేమీ ఉండదన్నారు. అయినా ఇందిరాగాంధీ ఆర్డినెన్స్‌ జారీ చేయటంతో బ్యాంకుల జాతీయీకరణ కార్యరూపం దాల్చింది. 
మలిదశ జాతీయీకరణ 1980లో జరిగింది.  అందులో ఆంధ్రా బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకు, న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయా బ్యాంకు, కార్పొరేషన్‌  బ్యాంకు, ఓబీసీ ఉన్నాయి. న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను 1993లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 
గత ఏడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయ బ్యాంకు, దేనా బ్యాంకులు కలిసిపోయాయి. దీంతో ఎస్‌బీఐని మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 17కు పరిమితం అయింది. 

చుట్టుముట్టిన సంక్షోభం
చూస్తూండగానే బ్యాంకుల జాతీయీకరణ జరిగి అర్ధ శతాబ్ది గడిచిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరించినట్లుగానే బ్యాంకింగ్‌ రంగం కూడా శరవేగంగా విస్తరించింది. అదే స్థాయిలో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అధికారంలో ఉన్న నాయకులు ‘రుణ మేళా’ పేరుతో బ్యాంకుల సొమ్మును ఇష్టానుసారం అప్పులు ఇప్పించి ఇబ్బందుల పాలు చేసిన ఉదంతాలు 1980 దశకంలో ఉండగా, ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు అధికారంలో ఉన్న వారి ఆదరణ పొందటం కోసం తగిన జాగ్రత్తలు లేకుండా అప్పులు ఇచ్చి, కుంభకోణాలకు పాల్పడి ఆయా బ్యాంకుల మనుగడను ప్రశ్నార్థకం చేశారు. ఇక మలిదశ సంక్షోభం బ్యాంకులకు 2010 నుంచి మొదలైంది. 2003 తర్వాత దేశంలో అమలైన ఉదారవాద ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ ఎన్నో కొత్త వ్యాపారాలకు ద్వారాలు తెరిచాయి. ఈ సమయంలో బ్యాంకింగ్‌ రంగం అప్రమత్తంగా లేదు. తగిన జాగ్రత్తలు పాటించలేదు. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన లేక ఇష్టానుసారం పోటీలు పడి వివిధ రంగాల్లో ప్రాజెక్టులకు, కంపెనీలకు పరిమితి మించి రుణాలు ఇచ్చాయి. ముఖ్యంగా విద్యుత్తు, టెలికామ్‌, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఇచ్చిన ఎన్నో రుణాలు మొండి బాకీలుగా మారిపోయాయి. దీన్ని తట్టుకోలేక బ్యాంకులు తల్లడిల్లిపోయాయి. ప్రభుత్వ బ్యాంకులు కావటం, ప్రభుత్వ మద్దతు ఉండటంతో మనగలిగాయి కానీ లేని పక్షంలో కొన్ని బ్యాంకులు ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక దివాలా తీసి ఉండేవనేది బ్యాంకింగ్‌ నిపుణుల విశ్లేషణ. గత ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం బ్యాంకింగ్‌  రంగానికి రూ.13 లక్షల కోట్ల వరకూ నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.10 లక్షల కోట్ల వరకూ ఉండటం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం రెండు, మూడు విడతలుగా మూలధనాన్ని సమకూర్చాల్సి వచ్చింది.

మరి భవిష్యత్తు?

బ్యాంకులను మొదటిసారి జాతీయం చేసిన సమయంలో దేశంలో సామ్యవాద భావజాలం బలంగా ఉంది. ప్రజల ఉమ్మడి ఆస్తులపై ప్రభుత్వానికే పెత్తనం ఉండాలి కాని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం ఏమిటనే ప్రశ్న అప్పుడు సమాజంలో ఉంది. అందుకే బ్యాంకుల జాతీయీకరణకు మద్దతు లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు అంతా ప్రైవేటు... జమానా. అందుకే వ్యాపార రంగంలో ప్రభుత్వానికి ఏమి పని...? బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే సరిపోతుంది కదా? అనే వాదనలు వినిపించే వారు కనిపిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల పాలై, మూలధనం కోసం ప్రభుత్వంపై ఆధారపడటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోపక్క ప్రభుత్వం బ్యాంకుల స్థిరీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక్కొక్కటిగా విలీనం చేస్తోంది. తత్ఫలితంగా ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య సమీప భవిష్యత్తులో తగ్గిపోనుందని స్పష్టమవుతోంది. దీనికి తోడు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం కంటే కిందకు తగ్గించుకోవాలనే వాదన కూడా తెరమీదకు వస్తోంది. అంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయటమే. అదే జరిగితే  బ్యాంకులను జాతీయం చేసిన ప్రభుత్వం మళ్లీ వాటిని ప్రైవేటు పరం చేసినట్లు అవుతుంది. ఏదేమైనా జాతీయీకరణ జరిగిన 50 ఏళ్లకు,  అంటే ఇప్పుడు చూస్తే... ప్రభుత్వ రంగ బ్యాంకుల భవిష్యత్తు విషయంలో స్పష్టత కొరవడినట్లు కనిపిస్తోంది. కానీ దేశానికి  ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరం ఉందనేది నిపుణుల వాదన. వాటిని పూర్తిగా లేకుండా చేయటం సరికాదు, బదులుగా వాటిని బలోపేతం చేయాలి, వృత్తి నైపుణ్యంతో అవి పనిచేసే పరిస్థితి కల్పించాలి, ప్రభుత్వ జోక్యం తగ్గాలి, అప్పుడు దేశానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.

జాతీయీకరణ ఫలితాలు

* బ్యాంకింగ్‌ రంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రెండో దశలో మరికొన్ని బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత దేశంలో 80 శాతం బ్యాంకింగ్‌ రంగం ప్రత్యక్షంగా ప్రభుత్వ అజమాయిషీ కిందకు వచ్చినట్లు అయింది. దీనివల్ల ప్రభుత్వం తలపెట్టిన సబ్సిడీ/ సంక్షేమ పధకాలను ప్రజల వద్దకు తీసుకుళ్లేందుకు వీలు కలిగింది.
* కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా బ్యాంకింగ్‌ సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువయ్యాయి. చిన్న గ్రామాల్లో సైతం ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ఏర్పాటయ్యాయి. 1969లో బ్యాంకు శాఖల సంఖ్య 8,261 కాగా, 2000 సంవత్సరం నాటికి ఇది 65,521కి పెరిగింది.
* బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించే అలవాటు ప్రజల్లో విస్తరించింది.
* వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధికంగా రుణాలు లభించటం మొదలైంది. ‘ప్రాధాన్య రంగం’ కింద  వ్యవసాయ రుణాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితిని బ్యాంకులకు ప్రభుత్వం కల్పించింది.
* చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) పరిశ్రమలకు రుణ లభ్యత పెరిగింది. ఆశించినంతగా ఈ రంగానికి రుణాలు దొరకనప్పటికీ అంతకు ముందు నాటి పరిస్థితితో పోలిస్తే జాతీయీకరణ తర్వాత బ్యాంకుల నుంచి రుణ లభ్యత పెరిగినట్లు చెప్పుకోవచ్చు.
* 1990 తర్వాత ప్రైవేటు బ్యాంకులు విస్తరించటం మొదలైంది. టెక్నాలజీని అందిపుచ్చుకొని కొన్ని ప్రైవేటు బ్యాంకులు శరవేగంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ బ్యాంకుల ప్రాభవం తగ్గలేదు. దేశంలో ఇప్పటికీ రుణాల్లో 66 శాతం, డిపాజిట్లలో 65 శాతం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావటం గమనార్హం.

* బ్యాంకులపై పెత్తనం రాజకీయ నాయకులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనేది నిర్వివాదాంశం. బ్యాంకులపై పెత్తనం అంటే... పరోక్షంగా దేశ సంపద మీద పెత్తనం అన్నట్లే. అందుకే పలువురు నాయకులు అధికారంలోకి రాగానే తమ అనుయాయులకు ఇష్టానుసారం రుణాలు ఇప్పించటం, తమకు కావలసిన వారికి బ్యాంకుల్లో ఉన్నత స్థాయి పదవులు కట్టబెట్టటం వంటివి చేశారు. దీనివల్ల బ్యాంకులకు కలిగిన నష్టం అంతాఇంతా కాదు.

 

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.