close
వాహనాలు కదలడం లేదు

అమ్మకాల్లో భారీ క్షీణత
పన్ను తగ్గింపు, ప్రోత్సాహకాలు అవసరం
ఇకపై ఏడాదికో కొత్త మోడల్‌
త్వరలో విద్యుత్తు కారు నిస్సాన్‌ లీఫ్‌

‘ఈనాడు’ ఇంటర్వ్యూ
నిస్సాన్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌
హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌

దేశీయ వాహన పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ (కమర్షియల్‌) హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలంలో అమ్మకాలు 20 శాతం వరకు తగ్గాయని, ఈ రంగంలోని దాదాపు అన్ని సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం సత్వరమే ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పాటు పన్ను భారం తగ్గించని పక్షంలో, పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద వాహన విక్రయాల్లో క్షీణత తప్పదనిపిస్తోందని వివరించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఇబ్బందుల్లో కూరుకుపోయి వినియోగదార్లకు రుణ లభ్యత తగ్గడం, వడ్డీరేట్లు దిగిరాక పోవడం, అధిక పన్ను రేట్లు ప్రస్తుత సంక్షోభానికి కారణమని విశ్లేషించారు. దేశంలో వాహన రంగ స్థితిగతులు, సవాళ్లు, నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ప్రణాళికలపై హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ముఖ్యాంశాలివీ..
? దేశీయంగా కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. దాదాపు అన్ని కంపెనీల ఆదాయాల్లో క్షీణత కనిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి
రుణ లభ్యత తగ్గడం, వడ్డీరేట్లు, అధిక పన్ను భారం, కాలుష్య ఉద్గార ప్రమాణాలు మారుతుండటం, విద్యుత్తు వాహనాల ప్రవేశం వంటి ఎన్నో అంశాలు వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు నగదు లభ్యత తగ్గడం వల్ల,  గతంలో మాదిరిగా కార్ల కొనుగోలుదార్లకు సులువుగా రుణాలు అందటం లేదు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు  దరఖాస్తులను అన్నిరకాలుగా పరిశీలించాక, ఆచితూచి రుణం మంజూరు చేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లు తగ్గిస్తున్నా, బ్యాంకులు తమ ఖాతాదార్లకు సత్వరం బదిలీ చేయడం లేదు. పన్ను భారం అధికంగా ఉంది. బీఎస్‌-6 ప్రమాణాలు అమల్లోకి రాబోతున్నందున, వినియోగదార్లు కారు ఇప్పుడు కొనుగోలు చేద్దామా, లేక కొత్త ప్రమాణాలు కలిగినవి వచ్చే వరకు ఆగుదామా అనే సందిగ్ధంలో ఉంటున్నారు. విద్యుత్తు వాహనాలు కూడా నెమ్మదిగా అడుగుపెడుతున్నాయి. కొంతమంది అవి వచ్చేవరకు చూద్దాం అనుకుంటున్నారు.

? అమ్మకాలు పెరగాలంటే ఏం చేయాలి
వాహన పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ముందుగా రుణ లభ్యతను పెంపొందించాలి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లను తగ్గించాలి. ప్రస్తుతం చిన్నకార్ల మీద 18 శాతం, మధ్యశ్రేణి కార్ల మీద 28 శాతం, విలాసవంత కార్ల మీద 45 శాతం జీఎస్‌టీ అమల్లో ఉంది. ఈ రేట్లను హేతుబద్ధం చేయాలి. అదేవిధంగా వడ్డీరేట్లు దిగిరావాలి.

? ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన అమ్మకాలు ఎలా ఉండొచ్చు
గత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అమ్మకాలు బాగా తగ్గాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమ్మకాల్లో 10 శాతం తగ్గుదల ఉండొచ్చు. అలా కాకూడదంటే మిగిలిన 8 నెలల కాలంలో అమ్మకాలు అనూహ్యంగా పెరగాలి. ఏం జరుగుతుందో చూడాలి.

?దేశీయంగా చిన్న కారు నుంచి విలాసవంత కార్ల వరకు వాహనాలు అందించగలిగితేనే క్రియాశీలక సంస్థగా నిలవడం సాధ్యం. ఆ దిశగా నిస్సాన్‌ మోటార్‌ ప్రయత్నాలు చేస్తుందా
‘డాట్సన్‌’ రెడీ గో నుంచి, నిస్సాన్‌ కిక్స్‌ వరకూ చూసుకుంటే... మేం దాదాపు అన్ని విభాగాల్లో కనిపిస్తాం. ఒకటి రెండు విభాగాలకు సంబంధించిన మోడళ్లు లేవు. వాటిని భర్తీ చేసుకోవాలి.

? కొత్త మోడళ్ల ప్రణాళిక ఏమిటి
ఇకపై ఏటా ఒక కొత్త మోడల్‌ కారును దేశీయ విపణిలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. దీనికోసం సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయి విద్యుత్తు కారు ‘నిస్సాన్‌ లీఫ్‌’   తీసుకురాబోతున్నాం. దీనిపై జపాన్‌లో పూర్తిస్థాయిలో కసరత్తు జరగుతోంది. ఇది ప్రీమియం శ్రేణి వాహనంగా ఉంటుంది. ఎలక్ట్రిక్‌ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ సంపాదించిన మోడల్‌ నిస్సాన్‌ లీఫ్‌. దాన్ని ఇక్కడి వినియోగదార్లకు అందిస్తాం.

? దేశీయంగా కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా
నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఇప్పటి వరకూ భారతదేశంలో 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7 వేల కోట్లు) పెట్టుబడి పెట్టింది. చెన్నైలో తయారీ ప్లాంటు, పరిశోధనా కేంద్రం ఉన్నాయి. మేం ఇక్కడ దీర్ఘకాలం పాటు కొనసాగాలనే దృక్ఫథంతో ఉన్నాం. ఈ మధ్యనే తిరువనంతపురంలో ‘నిస్సాన్‌ డిజిటల్‌ హబ్‌’ ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా నిస్సాన్‌ డిజిటల్‌ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తాం. ఇలా సందర్భం, అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు పెట్టుబడి పెడుతూనే ఉంటాం.

? మీ భాగస్వామ్య సంస్థ అయిన రెనో తో ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వాటి ప్రభావం ఇక్కడ సంస్థ మీద ఏమైనా ఉందా
లేనే లేదు. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

? దేశంలో విద్యుత్తు వాహనాల వైపు అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. ఈ మార్పు క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి
ఎన్నో ఉన్నాయి. ఛార్జింగ్‌ సదుపాయాలు ప్రధాన అవరోధం. ప్రభుత్వం అన్ని పెట్రోలు బంకుల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అదొక సానుకూల అంశం. విద్యుత్తు వాహనాల నిర్వహణ, ఇంధన వ్యయాలు ఎంతో తక్కువ. కానీ వాటి కొనుగోలు ధర ఎక్కువగా ఉంది. పెట్రోలు- డీజిల్‌ కార్ల కొనుగోలు ధర తక్కువగా, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వినియోగదార్లు ఎక్కువ ధర చెల్లించి విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేయటం తొలుత కొంత కష్టంగా ఉండొచ్చు. పెట్రోలు, డీజిల్‌ కార్ల ధరలో లభిస్తేనే విద్యుత్తు కార్లకు పెద్దఎత్తున ఆదరణ లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను భారాన్ని తగ్గించడం అవసరం. ప్రభుత్వం ఇటీవల విద్యుత్తు కార్లకు జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది. నా దృష్టిలో ఇంకా తగ్గించాలి. వాహన కంపెనీలు, ప్రభుత్వం ఉమ్మడిగా కృషి చేస్తే తక్కువ సమయంలో విద్యుత్తు వాహనాల వైపు వినియోగదార్లను మళ్లించవచ్చు.

? మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి
దేశీయ వాహన విపణిలో మాకు 1 శాతానికి పైగా వాటా ఉంది. ‘సి’ తరగతి స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) నిస్సాన్‌ కిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల రూ.10 లక్షల కంటే దిగువ ధరకు డీజిల్‌ నిస్సాన్‌ కిక్స్‌ను ఆవిష్కరించాం. దీంతో అమ్మకాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నాం. డాట్సన్‌ రెడీ గో వాహనాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ బాగా ఉంది. అందువల్ల గ్రామీణ/ సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లను విస్తరించి డాట్సన్‌ రెడీ గో వాహనాల అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం.

? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల మార్కెట్‌లో మీ అమ్మకాలు ఎలా ఉన్నాయి
దేశం మొత్తం మీద చూస్తే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్‌ మాకు ఆకర్షణీయమైనదని చెప్పగలను. అందులో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఎంతో ముఖ్యమైన ప్రాంతాలు. నిస్సాన్‌ మోటార్‌ ఇండియా వార్షిక అమ్మకాల్లో 10 శాతం ఈ రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో క్రియాశీలకంగా ఉన్నాం. ఇక్కడ మా డీలర్‌ నెట్‌వర్క్‌ కూడా పెద్దదిగా ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.