close
క్రూడత్వం

ఆరని చమురు మంటలు
సెన్సెక్స్‌కు 642 పాయింట్ల భారీ నష్టం
11000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రూ. 2.37 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముడిచమురు (క్రూడ్‌) మంటలు మరింత తీవ్రమయ్యాయి. సౌదీ అరేబియా సంస్థపై దాడుల వల్ల, పెరిగిన చమురు ధరలతో భారత్‌పై అదనపు భారం పడొచ్చని మదుపర్లు కలవరపడ్డారు. ఇప్పటికే నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థకు మరింత చేటు కలుగుతుందనే భావనతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశ కరెంటు ఖాతా, ద్రవ్య లోటులపై చమురు అధిక ధరలు ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యల ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గి 71.78 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో.. షాంఘై, హాంగ్‌సెంగ్‌ నష్టాల్లో, నిక్కీ, కోస్పి లాభాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మార్కెట్‌ పతనం నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.37 లక్షల కోట్లు తగ్గి
రూ.139.70 లక్షల కోట్లకు చేరింది.

స్టాక్‌ మార్కెట్‌కు వరుసగా రెండో రోజూ చమురు ధరల సెగ తాకింది. దీంతో సూచీలు భారీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్‌ ఉదయం 37,169.46 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏదశలోనూ కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో 36,419.09 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌, చివరకు 642.22 పాయింట్ల నష్టంతో 36,481.09 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 185.90 పాయింట్లు కోల్పోయి 10,817.60 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,796.50- 11,000.10 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 నష్టాలు చవిచూశాయి. హీరో మోటోకార్ప్‌ 6.19%, టాటా మోటార్స్‌ 5.13%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.62%, టాటా స్టీల్‌ 4.62%, మారుతీ సుజుకీ 4.39%, ఎస్‌బీఐ 3.78%, బజాజ్‌ ఆటో 3.50%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.12%, యెస్‌ బ్యాంక్‌ 2.91%, ఎం అండ్‌ ఎం 2.77%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.76%, హెచ్‌డీఎఫ్‌సీ 2.43% చొప్పున డీలాపడ్డాయి. హెచ్‌యూఎల్‌ 0.84%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.69%, ఇన్ఫోసిస్‌ 0.44% మేర రాణించాయి. బీఎస్‌ఈలో 1696 స్క్రిప్‌లు ప్రతికూలంగా, 829 షేర్లు సానుకూలంగాను ముగిశాయి. 147 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

మార్కెట్‌ నష్టాలకు కారణాలివే..

* సౌదీ చమురు సంక్షోభం: సోమవారం బ్రెంట్‌ చమురు భారీగా పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మంగళవారం ధరలు స్థిరపడినప్పటికీ.. చమురు సరఫరాపై అనిశ్చితి పోలేదు. రెండు క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో సౌదీలో చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది.
* చైనా మందగమనం: ఆగస్టులో చైనా పారిశ్రామికోత్పత్తి 4.4 శాతంగా నమోదైంది. ఇది 17 ఏళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. చైనా తయారీ మందగమనాన్ని ఇది సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
* వాహన విలాపం: ముడిచమురు ధరలు దూసుకెళ్లడంతో గిరాకీ మరింత తగ్గొచ్చన్న అంచనాలతో వాహన షేర్లు విలవిలలాడాయి. హీరో, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీలతో కూడిన నిఫ్టీ వాహన సూచీ 3.83 శాతం క్షీణించింది.
* ఫెడ్‌ సమావేశం: అమెరికా ఫెడ్‌ పరపతి సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని మార్కెట్లు భావిస్తున్నాయి. మరిన్ని గణాంకాల కోసం ఫెడ్‌ ఎదురుచూడొచ్చనీ అంటున్నారు.

పెట్రోలు, డీజిల్‌ ధరలు పైపైకి..

అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పడింది. చమురు మార్కెటింగ్‌ కంపెనీల వద్ద లభ్యమవుతున్న ధరల సమాచారం ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు ధర 14 పైసలు పెరిగి రూ.72.17కు చేరింది. డీజిల్‌ 15 పైసలు అధికమై రూ.65.58కు ఎగబాకింది. బడ్జెట్‌ తర్వాత మళ్లీ పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. జులై 5న బడ్జెట్‌లో ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.2.50 చొప్పున పెరిగాయి. గిరాకీ బలహీనంగా ఉండి.. చమురు ధరలు పెరిగితే  భారత్‌లో స్టాగ్‌ఫ్లేషన్‌ (వృద్ధి నెమ్మదించడం, నిరుద్యోగిత - ద్రవ్యోల్బణం పెరగడం) ఏర్పడవచ్చని జపాన్‌కు చెందిన  నోమురా తన నివేదికలో పేర్కొంది.

సరఫరాపై నెల రోజుల ప్రభావం
ఎస్‌అండ్‌పీ

సౌదీ ఆరామ్‌ కో సంస్థలో సగం వరకు ఉత్పత్తి నిలిచిపోవడంతో.. కనీసం నెల రోజులు పాటు రోజుకు మూడు మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చని ఎస్‌అండ్‌పీ ప్లాట్స్‌ అభిప్రాయపడింది. ‘తాను చమురు ఎగుమతి చేసే దేశాలకు సరఫరా విషయంలో ఎటువంటి అంతరాయం ఉండకపోవచ్చని సౌదీ అరేబియా చెప్పే అవకాశం ఉంది. అయితే రోజులు గడిచే కొద్ది సమస్య జఠిలం అవ్వొచ్చు. సరఫరా జాప్యం అవుతున్నట్లుగా ఏమాత్రం సంకేతాలొచ్చినా.. రానున్న వారాలు, నెలల్లో చమురు ధరలు మరింత పెరుగుతాయ’ని పేర్కొంది.

బ్రెంట్‌ క్రూడ్‌ 100 డాలర్లకు?

సౌదీ అరేబియా 40% ఉత్పత్తిని వెంటనే పునరుద్ధరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నప్పటికీ.. ఉత్పత్తి యథా స్థితికి వచ్చేందుకు పట్టే సమయంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం కల్లా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే.. చమురు ధర బ్యారెల్‌ మళ్లీ 60 డాలర్లకు (బ్యారెల్‌కు) దిగివస్తుందని లండన్‌కు చెందిన కేపిటల్‌ ఎకనమిక్స్‌ అభిప్రాయపడింది. ఉత్పత్తి పూర్తిస్థాయి పునరుద్ధరణకు నెలల సమయం పట్టి, ఉద్రిక్తతలు కొనసాగితే బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇంకొందరు విశ్లేషకులైతే.. మరో 30 రోజుల్లో బ్యారెల్‌ 100 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అంచనాల కంటే వేగంగానే సౌదీ ఉత్పత్తిని పునరుద్ధరించొచ్చన్న అంచనాలతో మంగళవారం చమురు ధరలు 5%  మేర తగ్గడం విశేషం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.