close
మందగమనానికి పన్నుచికిత్స

కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించిన ప్రభుత్వం
అభివృద్ధికి ఊతం, పెట్టుబడులు పెరుగుతాయి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి చేరిన సమయాన.. నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ఠానికి పెరిగిన వేళ.. పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలను స్థాపించడంతో పాటు వృద్ధిని పరుగు పెట్టించడమే లక్ష్యంగా కార్పొరేట్‌ పన్నులో 10 శాతం వరకు తగ్గింపును నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది.  చైనా, దక్షిణ కొరియా ప్రధాన పోటీ దేశాలకు దీటుగా పన్ను రేట్లను తీర్చిదిద్దింది.  ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు ప్రకటించిన ఉద్దీపనలు ఒక ఎత్తైతే.. శుక్రవారం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను రాయితీలు దేశ పారిశ్రామిక రంగాలన్నింటిలోనూ జోష్‌ నింపాయి. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని అమెరికా కంపెనీలు చైనా నుంచి తమ తయారీ కార్యకలాపాలను వియత్నాం, మరికొన్ని ఇతర దేశాలకు మళ్లిస్తున్నాయి. ఇటువంటి సంస్థలను మనదేశం వైపు ఆకర్షించటం కూడా తాజా నిర్ణయం ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

కార్పొరేట్‌ సంస్థలకు  ప్రకటించిన రాయితీలు
*  దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను 22 శాతానికి తగ్గింపు. ఎటువంటి రాయితీలు/ మినహాయింపులు (ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌) యూనిట్లకు వర్తించే పన్ను సెలవు, యాక్సెలరేటెడ్‌ తరుగుదల వంటివి) తీసుకోని కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కార్పొరేట్‌ పన్ను ఇప్పటి వరకు 30 శాతంగా ఉంది.
*  ఈ తగ్గింపు వల్ల కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను భారం అన్ని సెస్‌లు, సర్‌ఛార్జీలతో కలిపి 25.17 శాతానికి పరిమితం అవుతుంది. ఇంతకు ముందు ఇది 34.94 శాతంగా ఉండేది.
*  అంతేగాక ఇకపై ఇటువంటి కంపెనీలు మ్యాట్‌ (కనీస ప్రత్యామ్నాయ పన్ను) చెల్లించాల్సిన పనిలేదు.
*  ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి మనదేశంలో కొత్తగా ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు 15 శాతం కార్పొరేట్‌ పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు ఇలాంటివి 25 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కొత్త కంపెనీలకు ఈ పన్ను భారం బాగా తగ్గింది. సెస్‌లు, సర్‌ఛార్జీలతో కలిపి పన్ను భారం 17.01 శాతం మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు అన్నీ కలిపి 29.12 శాతం పన్ను భారం ఉంది. ఇవి మ్యాట్‌ చెల్లించాల్సిన పనిలేదు. కాకపోతే ఇటువంటి కంపెనీలు ఎటువంటి ఇతర రాయితీలు/ మినహాయింపులు తీసుకోకూడదు. అంతేగాక మార్చి 31, 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలి. ప్రధానంగా అమెరికాతో పాటు ఇతర దేశాల తయారీ రంగ కంపెనీలను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
*  పలు రకాల మినహాయింపులు, రాయితీలు పొందుతున్న కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది.
*  ఈక్విటీ షేర్లపై వచ్చిన మూలధన లాభాలకు సంబంధించి పెంచిన ‘సూపర్‌-రిచ్‌ ట్యాక్స్‌’ తొలగించారు.
*  విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులకు (ఎఫ్‌పీఐ) మూలధన లాభాలపై పెంచిన సర్‌ఛార్జీని రద్దు చేశారు.
*  ఈక్విటీ షేర్ల విక్రయంపై ఎస్‌టీటీ (సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌) చెల్లిస్తే, ఆ షేర్లపై వచ్చిన మూలధన లాభంపై ఇటీవల బడ్జెట్‌లో విధించిన అదనపు సర్‌ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు.
*  స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీలు ఈ ఏడాది జులై 5వ తేదీ కంటే ముందు ప్రకటించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌పై పన్ను లేదు.
*  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల పరిధిని విస్తృతం చేశారు.
*  ఈ పన్నుల తగ్గింపు ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుంది.
*  ఈ మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తీసుకువస్తుంది.
*  కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇతర మినహాయింపుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల మేరకు పన్ను ఆదాయం తగ్గిపోతుంది. అయితే వ్యవస్థలోకి ఈ నిధులు రావడం వల్ల, గిరాకీ పెరిగి, కొనుగోళ్లకు అనుగుణంగా కొంతవరకు ప్రత్యామ్నాయ పన్ను రూపేణ ఆదాయం సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
*  జులై 5 కంటే ముందు బైబ్యాక్‌ ప్రకటన చేసిన నమోదిత కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌పై 20శాతం పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఇన్ఫోసిస్‌, విప్రోలకు ఉపశమనం.

ఇరుగుపొరుగు దేశాలతో సమానంగా..

మనదేశంలో కార్పొరేట్‌ పన్ను 1997 లో 38.05 శాతం ఉంది. తర్వాత అది తగ్గుతూ 30 శాతానికి వచ్చింది. పొరుగున ఉన్న చైనాలో కార్పొరేట్‌ పన్ను 25 శాతం మాత్రమే. ఇండోనేషియా, దక్షిణ కొరియాలో కూడా ఇదే పన్ను రేటు. మలేషియాలో 24 శాతమే. హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌లో అయితే ఇంకా తక్కువ. సింగపూర్‌లో 17 శాతం, హాంగ్‌కాంగ్‌లో 16.5 శాతం పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. థాయ్‌ల్యాండ్‌, వియత్నాంలో 20 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మనదేశంలోనూ కార్పొరేట్‌ పన్ను ఇతర ఆసియా దేశాల స్థాయిలో ఉన్నట్లు అవుతోంది. 

ద్రవ్యలోటు అదుపు తప్పుతుందా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి మించరాదని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం రూ.1.45 లక్షల కోట్ల మేరకు తగ్గుతోంది. ఇందువల్ల ద్రవ్యలోటు 4.1 శాతానికి చేరుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని ఎలా పూడ్చుకోవాలనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను పెద్దఎత్తున ఉపసంహరించుకునే ప్రక్రియ చేపట్టటం ద్వారా కొంతమేరకు ఆదాయ నష్టాన్ని పూడ్చుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలుస్తుంది. అయినా తగినంతగా ఆదాయం రాకపోతే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ద్రవ్యలోటు పరిమితి మించిపోవటంతో పాటు వడ్డీరేట్లు పెరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించగలిగితే కొంత వెసులుబాటు కలుగుతుంది
- ఈనాడు, బిజినెస్‌ బ్యూరో

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.