close
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాలు

5000 మందికి మార్చి లోపు శిక్షణ
ప్రత్యేక పథకాన్ని ఆవిష్కరించిన టీసీఎస్‌
సీఐఐ, ప్రభుత్వ భాగస్వామ్యం
తొలి బృందం 67 మందికి 2 రోజుల శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిర్ణయించింది. విద్యాబోధనను మరింత ఆకర్షణీయంగా, సమర్థంగా చేయడంతో పాటు పాఠశాల నిర్వహణ విధులను సులభతరం చేయడం వల్ల బోధనపైనే దృష్టి సారించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు వీలవుతుందని సంస్థ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తొలుత తెలంగాణా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతుండగా, క్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. వారంలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉంటుంది. పాఠ్యాంశాల బోధన (థియరీ)తో పాటు ల్యాబ్‌లో ప్రాక్టికల్‌ శిక్షణ కూడా ఉంటుంది. ఇందుకోసం 100 మంది వాలంటీర్ల (సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల)ను టీసీఎస్‌ కేటాయిస్తోంది. మొత్తం 500 మంది వాలంటీర్లు కావాలి కనుక ఇతర సాఫ్ట్‌వేర్‌ సంస్థలనూ భాగస్వాములను చేస్తామని పేర్కొంది. తొలివిడతగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 67 మంది ఉపాధ్యాయులకు శిక్షణను శనివారం హైదరాబాద్‌లోని టీసీఎస్‌ సినర్జీ పార్కులో ప్రారంభించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 5,000 మంది ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలన్నది తమ ప్రణాళిక అని టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని, ప్రతి పాఠశాల నుంచి ఆసక్తి కలిగిన చురుకైన ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులదేనని వివరించారు. హైదరాబాద్‌ సమీపంలోని వారికి టీసీఎస్‌ ప్రాంగణంలో, ఇతర ప్రాంతాల వారికి ఆ సమీప ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలను ఇందుకోసం వినియోగిస్తామన్నారు. వీరితో అనుసంధాన బాధ్యతలను సీఐఐ చూసుకుంటుంది.

ఈ అంశాల్లో శిక్షణ
ఎంఎస్‌ ఆఫీస్‌లోని వర్డ్‌, పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఎక్సెల్‌ షీట్‌తో పాటు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మెయిల్‌ ద్వారా ఎలా సమర్థంగా రాయాలో తెలుపుతారు. విద్యార్థులకు సిలబస్‌ ప్రణాళిక, టైమ్‌టేబుల్‌, హాజరు, మార్కుల పట్టికలు, పాఠశాల సిబ్బంది వేతన పట్టికలు రూపొందించడం బాగా సులువవుతుందని వివరించారు.

500 మందికి పీహెచ్‌డీ ప్రాయోజితం
దేశంలో డాక్టరేట్‌ల సంఖ్య పెంచేందుకు, తద్వారా పరిశోధనల వృద్ధికి టీసీఎస్‌ కట్టుబడి ఉందని రాజన్న తెలిపారు. 2010లో తమ సీఈఓ ప్రకటించిన ఈ పథకం కింద వరంగల్‌ ఎన్‌ఐటీ నుంచి ఇద్దరు, హైదరాబాద్‌ ఐఐఐటీ నుంచి 22 మంది వినియోగించుకున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోని అర్హులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారికి స్టైఫండ్‌తో పాటు పేపర్‌ ప్రెజెంటేషన్‌ కోసం సంబంధిత సమావేశాలకు హాజరయ్యేందుకు ఖర్చులను కూడా టీసీఎస్‌ భరిస్తుందన్నారు.

స్వచ్ఛభారత్‌ నిధుల్లో అధికం మనకే
ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్‌ కింద ఆడపిల్లల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తమ గ్రూప్‌ కేటాయించిన రూ.100 కోట్లలో అధికశాతం నిధులను తెలుగు రాష్ట్రాలకే వినియోగించినట్లు రాజన్న తెలిపారు. 1500 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయి, నిర్వహణ బాధ్యతలు కూడా తామే చేపట్టినట్లు వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.