
‘అనైతిక’ చర్యలకు పాల్పడ్డారు
ఆదాయ, లాభాలు పెంచడానికి అవకతవకలు
కీలక సమాచారాన్ని తొక్కిపట్టారు
మాట వినని ఉద్యోగులను సెలవుపై పంపారు
సీఈఓ, సీఎఫ్ఓలపై ఉద్యోగుల బృందం ధ్వజం
బోర్డు, అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు లేఖ
బెంగళూరు
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తు తెలియని బృందం ఒకటి తీవ్ర ఆరోపణలు చేసింది. స్వల్పకాలంలో ఆదాయ, లాభాలను పెంచడం కోసం కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్‌లు ‘అనైతిక కార్యకలాపాల’కు పాల్పడ్డారంటూ బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఆ బృందం లేఖ రాసింది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పాటు.. ప్రస్తుత త్రైమాసికంలోనూ అదే తరహా చర్యలు చేపట్టినట్లు సెప్టెంబరు 20 తేదీతో ఉన్న ఆ లేఖలో వారు ఆరోపించారు. ‘నైతిక ఉద్యోగులు’, ‘ప్రజావేగులు’గా తమకు తాము చెప్పుకున్న ఆ బృందం.. ఇందుకు సంబంధించి సాక్ష్యాలుగా పలు ఇమెయిళ్లు; వాయిస్రికార్డులు ఉన్నట్లు తెలిపింది. బోర్డు తక్షణం దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
లేఖలోని ఆరోపణలు..
* వీసా ఖర్చుల వంటి వాటిని పూర్తిగా గుర్తించరాదని గత త్రైమాసికంలో కంపెనీ కోరింది. అయితే ఆడిటర్ ససేమిరా అనడంతో.. ఆ విషయాన్ని వాయిదా వేశారు.
* ఈ త్రైమాసికంలోనూ ఎఫ్డీఆర్ కాంట్రాక్టుకు సంబంధించిన 50 మి. డాలర్ల చెల్లింపుల ఖాతాకు సంబంధించి కూడా ఖాతా ప్రమాణాలకు వ్యతిరేకంగా మాపై చాలా ఒత్తిడి తెచ్చారు. ఎందుకంటే వాటిని ఫలితాల్లో గుర్తిస్తే లాభాలు తగ్గి.. షేర్లపై ప్రభావం పడుతుంది.
* వెరిజోన్, ఇంటెల్, జపాన్‌లో కొన్ని జేవీల వంటి పెద్ద కాంట్రాక్టులు, ఏబీఎన్ ఆమ్రో కొనుగోలు.. వంటి వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా తొక్కిపట్టారు.
* పెద్ద స్థాయి ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని ఆడిటర్లకు చెప్పరాదని మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘బోర్డులో ఎవరూ వీటిని అర్థం చేసుకోలేరు.. షేర్ల ధరలు పెరిగినంత కాలం వాళ్లు సంతోషంగానే ఉంటార’ని సీఈఓ మాతో అన్నారు.
* గత కొన్ని త్రైమాసికాలుగా పలు భారీ ఒప్పందాలకు మార్జిన్లు చాలా తక్కువ(సున్నా)గా ఉన్నాయి. ఒప్పంద ప్రతిపాదనలు, మార్జిన్లు, బయటకు వెల్లడించని చెల్లింపు మొత్తాలు తదితరాల గురించి ఆడిటర్లను తనిఖీ చేయమని బోర్డు కోరాలి. ఎందుకంటే ఆడిటర్లకు మొత్తం సమాచారాన్ని వెల్లడించలేదు.
* విధానాల్లో మార్పు చేయడం ద్వారా ఎక్కువ లాభాలను చూపాలని సీఈఓ, సీఎఫ్ఓలు మమ్మల్ని కోరారు. దీని వల్ల స్వల్పకాల లాభాలు కనిపిస్తాయి. 20ఎఫ్‌లో కీలక సమాచారాన్ని వెల్లడించొద్దని వారు మమ్మల్ని కోరారు. మంచి, అసంపూర్తి సమాచారాన్నే మదుపర్లు, విశ్లేషకులతో పంచుకోవాలని సూచించారు.
* ఎవరైనా వారు చెప్పినట్లు వినకపోతే వారిని లీవులో పంపిస్తారు. లేదంటే పక్కనపెడతారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఒత్తిడి భరించలేకే బయటకు వెళ్లారు.
* మా వద్ద వీటన్నిటికి సంబంధించిన వాయిస్ రికార్డులు, ఇమెయిళ్లు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో వాటిని బట్టబయలు చేస్తాం.
అమెరికాకు చెందిన విజిల్బ్రోవర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌కు కూడా ఈ ‘ప్రజావేగులు’ అక్టోబరు 3నే ఫిర్యాదు చేశారు. గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వక తప్పుడు ప్రకటనలు, ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు అందులో పేర్కొన్నారు.
ఆడిట్ కమిటీకి చెప్పాం..కంపెనీ: సాధారణంగా ఇటువంటి ఫిర్యాదులు వచ్చినపుడు చేసినట్లే.. ఇపుడు కూడా ఆ ‘ప్రజావేగు’ ఫిర్యాదును ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- సినిమా పేరు మార్చాం
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు