close
ఈసారి ఏమవుతుందో?

‘అనైతికం’పై కొనసాగుతున్న పరిణామాలు
దావా సిద్ధం చేస్తున్న రోజెన్‌ లా ఫిమ్‌
దర్యాప్తు మొదలుపెట్టిన ఇన్ఫోసిస్‌
భారీ స్థాయిలో షేరు ధర పతనం
అప్పటి ‘సంఘర్షణ’లో సిక్కా రాజీనామా

రెండేళ్ల తర్వాత మళ్లీ ఇన్ఫోసిస్‌లో ‘సంఘర్షణ’ వాతావరణం కనిపిస్తోంది. అప్పట్లో సహ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదం కాస్తా.. సిక్కా రాజీనామాకు దారి తీసింది. మరి ఈసారి జరుగుతున్న ‘యాజమాన్యం’, ‘నైతిక ఉద్యోగుల’ బృందం మధ్య సంఘర్షణ ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. త్వరగా శుభం కార్డు పడకపోతే నష్టపోయేది మదుపర్లే.

రెండేళ్ల కిందట వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య జరిగిన సంఘర్షణ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మాజీ ఉన్నతాధికారుల ప్యాకేజీల విషయంలో సహ వ్యవస్థాపకులు, యాజమాన్యం వద్ద వివాదం నడిచింది. ఆ తర్వాతి పరిణామాల్లోనూ విశాల్‌ సిక్కా నిష్క్రమణ చోటు చేసుకుంది. అప్పుడే కంపెనీని నడిపించడానికి నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా వచ్చారు. గతేడాది జనవరిలో సీఈఓగా సలీల్‌ పరేఖ్‌ను తీసుకొచ్చారు. ఇపుడు మళ్లీ అదే తరహాలో ఇన్ఫోసిస్‌లో మరో సంఘర్షణ చోటు చేసుకుంది. ఇపుడు యాజమాన్యం, ఉద్యోగుల మధ్య రగడ మొదలైంది. సీఈఓ, సీఎఫ్‌ఓలు..గత కొద్ది త్రైమాసికాలుగా ఖాతాల్లో పలు అవకతవకలకు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం ద్వారా లాభాలు ఎక్కువ వచ్చేలా చూపించారని ఆ ‘నైతిక ఉద్యోగుల బృందం’ అంటోంది. చాలా వరకు విషయాల్లో ఆడిటర్లకు పూర్తి సమాచారం వెళ్లకుండా తమపై ఒత్తిడి తెచ్చారని సోమవారం ఆరోపించారు. అంతే కాదు.. అమెరికాకు చెందిన ‘ఆఫీస్‌ ఆఫ్‌ విజిల్‌బ్లోవర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌’కు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాలన్నీ.. ఇపుడు రెండేళ్ల కిందట సంక్షోభం అనంతరం పగ్గాలు చేపట్టిన నీలేకనికి కత్తిమీద సామే కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి సంక్షోభంలో సిక్కా రాజీనామా చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి ఈ సారి సంక్షోభాన్ని ఎంత త్వరగా ముగిస్తారు? ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
రెండేళ్ల నుంచీ ఇన్ఫోసిస్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. గత సంక్షోభంతో పోలిస్తే కంపెనీ విలువ 50 శాతం పెరిగింది. ఇపుడిపుడే మదుపర్లు భారత్‌లోనే అత్యంత పారదర్శక కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఇన్ఫీని నమ్మడం మొదలుపెట్టారు. కానీ ఇపుడు సీఈఓ, సీఎఫ్‌ఓలపైనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమని తేలితే మాత్రం ఇన్ఫీ ప్రతిష్ఠ
బాగా మసకబారుతుంది.

రంగంలోకి అమెరికా సంస్థ
ఐటీ దిగ్గజం ‘అనైతిక కార్యకలాపాలకు’ పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మదుపర్లు పొందిన నష్టాలను రికవరీ చేసేందు కోసం ఆ దేశానికి చెందిన రోజెన్‌ లా ఫిమ్‌ దావా(క్లాస్‌ యాక్షన్‌ సూట్‌) సిద్ధం చేస్తోంది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌వైఎస్‌ఈ)లో ఇన్ఫీ షేర్లు ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రజావేగు ఫిర్యాదు’లు అక్కడికీ చేరడంతో సోమవారం అమెరికాలో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు కుప్పకూలిన విషయం విదితమే. దీంతో ఇన్ఫోసిస్‌ మదుపర్లు పొందిన నష్టాలను రికవరీ చేయించేందుకు ఒక క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
పూర్తి స్థాయి దర్యాప్తు: ఛైర్మన్‌
మరో పక్క, సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఖాతాల విషయంలో అవకతవకలకు పాల్పడడం ద్వారా లాభాలను ఎక్కువ చేసి చూపి, ‘అనైతిక కర్యాకలాపాలు’ పాల్పడ్డారని సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై ‘నైతిక ఉద్యోగుల’ బృందం ఒకటి  కంపెనీ బోర్డుకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే.. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లు సంస్థ ఛైర్మన్‌, సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లో ఇన్ఫీ షేరు ఒక రోజులోనే రూ.127.90 కోల్పోయింది.

భారీ స్థాయి కాంట్రాక్టుల నుంచి ఆదాయాలను గుర్తించే విషయంలో ఖాతా ప్రమాణాలకు విరుద్ధంగా నడుచుకోవాలని పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌ తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సెప్టెంబరు 20 తేదీతో ‘నైతిక ఉద్యోగుల’ పేరిట ఒక లేఖ బోర్డుకు వెళ్లింది. అవకతవకలకు సంబంధించిన ఇ-మెయిళ్లు, కాల్‌ రికార్డులు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. 

ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారమిదీ..
సెప్టెంబరు 20 తేదీతో సెప్టెంబరు 30 తేదీన ఒక బోర్డు సభ్యుడికి రెండు గుర్తు తెలియని ఫిర్యాదులు అందాయని.. ‘కలతపెడుతున్న అనైతిక చర్యలు’ , ‘ప్రజా వేగు ఫిర్యాదు’ శీర్షికలతో అవి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ రెండింటిని అక్టోబరు 10, 2019న ఆడిట్‌ కమిటీ ముందు; ఆ తర్వాతి రోజు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల ముందు ఉంచినట్లు తెలిపారు. అక్టోబరు 11, 2019 నాటి బోర్డు సమావేశానంతరం స్వతంత్ర ఆడిటర్‌ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై)తో ఆడిట్‌ కమిటీ చర్చలు జరిపి స్వతంత్ర సంస్థ అయిన శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కోకు స్వతంత్ర దర్యాప్తు పనులు అప్పగించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు నీలేకని సమాచారం అందించారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఆడిట్‌ కమిటీతో చర్చించి బోర్డు చర్యలు చేపడుతుందని వివరించారు. కాగా, వాషింగ్టన్‌ డీసీలోని ‘ఆఫీస్‌ ఆఫ్‌ విజిల్‌బ్లోవర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌’కు సైతం అక్టోబరు 3 తేదీతో ఒక లేఖ వెళ్లినట్లు తమకు తెలిసిందని నీలేకని స్పష్టం చేశారు. 
‘సీఈఓ, సీఎఫ్‌ఓలను దూరం పెడతాం’
కాగా, ‘ఫిర్యాదులకు సంబంధించిన ఎటువంటి ఇమెయిళ్లు, వాయిస్‌ రికార్డులు మాకు అందనప్పటికీ.. ఈ ఫిర్యాదులపై పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు స్వతంత్రతను కాపాడడం కోసం సీఈఓ, సీఎఫ్‌ఓలను ఈ అంశాలకు దూరంగా ఉంచనున్నామ’ని నీలేకని తెలిపారు. ఇన్ఫోసిస్‌కు చట్టబద్ధ ఆడిటర్లయిన డెలాయిట్‌ ఇండియాకు ఈ అంశంపై మొత్తం సమాచారాన్ని అక్టోబరు 11 నాటి సమావేశానంతరం అందజేశామని నీలేకని వెల్లడించారు. 
అత్యధిక నష్టాలు ఈ షేరుకే
కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓలపై ఫిర్యాదులు.. ఆపైన చేపట్టిన దర్యాప్తుల వార్తల నేపథ్యంలో ఇన్ఫీ షేర్లు మంగళవారం మార్కెట్లో భారీ నష్టాల పాలయ్యాయి. ఒక రోజులోనే 16.21 శాతం కోల్పోయి రూ.643.30 వద్ద ముగిశాయి. ఒక దశలో 16.86 శాతం కోల్పోయి రూ.638.30 వద్ద కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ స్థాయిలో ఇన్ఫోసిస్‌ షేరు నష్టపోవడం ఏప్రిల్‌ 2013 తర్వాత ఇదే తొలిసారి. ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ షేరు 16.65 శాతం కోల్పోయి రూ.640 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.53,450.92 కరిగిపోయి రూ.2,76,200.08 కోట్లకు పరిమితమైంది. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనించదగ్గ విషయం. మొత్తం బీఎస్‌ఈలో 117.70 లక్షల షేర్లు ట్రేడ్‌ కాగా, ఎన్‌ఎస్‌ఈలో 9 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.

అమెరికా మార్కెట్లోనూ: సోమవారం అమెరికా మార్కెట్లో 14% దాకా కుంగి 9.18 డాలర్ల వద్ద ముగిసిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ షేర్లు మంగళవారం కూడా 2 శాతం దాకా నష్టంతో కదలాడుతున్నాయి.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.