
ప్రీమియం పెరిగినా ప్రయోజనమే
దీర్ఘకాలిక రక్షణకే ప్రాధాన్యం
ఐఆర్డీఏ కొత్త మార్గదర్శకాలు
ఈనాడు - హైదరాబాద్
జీవిత బీమా పాలసీదారులకు మేలు చేకూరే విధంగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) తీసుకొచ్చిన నిబంధనలు చర్చకు దారి తీస్తున్నాయి. పాత పాలసీలు తీసుకోవాలా? కొత్త పాలసీలు వచ్చేదాకా ఆగాలా? ఏవి తీసుకుంటే లాభం అనే సందేహం ఇప్పుడు పాలసీదార్ల మదిలో మెదులుతోంది. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ఆర్థిక అవసరాలు ఎంతో మారాయి. బీమా ప్రాధాన్యమూ పెరిగింది. వ్యక్తుల ఆదాయం.. బాధ్యతలు, దీర్ఘకాలిక లక్ష్యాలు వీటన్నింటికీ తగిన భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటినీ తీర్చేందుకు బీమా పాలసీలను మించిన ప్రత్యామ్నాయం మరోటి లేదనే చెప్పొచ్చు. వీటిని ఎప్పటికప్పుడు మెరుగ్గా మార్చేందుకు ఐఆర్డీఏఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ప్రతిపాదించిన మార్పులతో సంప్రదాయ పాలసీలతో పాటు, యూనిట్ ఆధారిత, పింఛను పాలసీల్లోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి.
కొత్తవే మేలు.. ఇప్పటి వరకూ ఉన్న సంప్రదాయ పాలసీలతో పోలిస్తే డిసెంబరు 1 నుంచి రాబోతున్న కొత్త పాలసీలే మెరుగైనవిగా ఉంటాయని బీమా నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పాలసీని స్వాధీనం (సరెండర్) చేసే వ్యవధి రెండేళ్లకు తగ్గనుంది. గతంలో పాలసీలను గడువుకు ముందే వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం చాలా తక్కువగా ఉండేది. బీమా ప్రీమియం నుంచి ఏజెంటు కమిషన్, ఇతర ఖర్చులు పోను పెద్దగా మిగిలేది కాదు. బీమా పాలసీల విషయంలో ఖర్చులు తగ్గించుకొని, స్వాధీన విలువను అధికంగా చెల్లించాలని నియంత్రణ సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న పాలసీలను రెండేళ్ల తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. పాలసీని 4, 5 ఏళ్ల తర్వాత స్వాధీనం చేస్తే.. అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియంలో 50శాతం వరకూ వెనక్కివ్వాలని పేర్కొంది. ఏడేళ్ల తర్వాత స్వాధీనం చేస్తే ఎంత వస్తుందన్నది పాలసీ పత్రంలోనే ముద్రించాలి. గడువు ముగిసే రెండేళ్ల ముందు పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటే.. అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియంలో 90శాతం వెనక్కి వస్తుంది. పాలసీదారులకు ఇది మేలు చేసే అంశమే. అనుకోకుండా భారీ ప్రీమియం పాలసీలను తీసుకొని, వాటికి ఏటా ప్రీమియం చెల్లించలేని వారు.. ఇప్పటి వరకూ పెద్ద మొత్తాన్నే నష్టపోయేవారు. ఇక నుంచి ఇది కాస్త తగ్గనుంది. దీంతోపాటు పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత ప్రీమియం తగ్గించుకునే వెసులుబాటు కల్పించడమూ గమనించాల్సిన అంశమే. |
వ్యవధి పెరగనుంది.. కొత్తగా జారీ అయ్యే పాలసీలు దీర్ఘకాలిక బీమా రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలని ఐఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యంగా మార్కెట్ ఆధారిత పెట్టుబడులను పెట్టే.. యులిప్‌లను తీసుకున్న వారు.. స్వల్పకాలానికే పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం వల్ల నష్టపోయిన సంఘటనలు ఎన్నో. దీనిని అడ్డుకునేందుకు యులిప్‌ల కనీస ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఏడేళ్లు లేదా పదేళ్లు చేయాలని ఐఆర్డీఏ భావిస్తోంది. బీమా కంపెనీలు కొత్తగా విడుదల చేసే పాలసీలు 7 లేదా 10 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలనే నిబంధనతో రావచ్చు. ఇక సంప్రదాయ మనీ బ్యాక్ పాలసీలకూ ఇదే సూత్రం వర్తించనుంది. ఇప్పటి వరకూ కొన్ని సంస్థలు 10, 12 ఏళ్ల వ్యవధికీ ఈ పాలసీలను ఇచ్చేవి. వీటి కనీస వ్యవధి 15 ఏళ్లు చేయాలని ఐఆర్డీఏ కొత్త మార్గదర్శకాల్లో ఉంది. ఇలా వ్యవధి పెరగడం వల్ల జీవిత బీమా పాలసీ రక్షణ ఎక్కువ కాలం కొనసాగేందుకు వీలవుతుందని నిపుణులు భావిస్తున్నారు. |
పింఛను పాలసీల్లో... బీమా సంస్థలు అందించే పింఛను పాలసీలను ఎంచుకున్నప్పుడు.. వ్యవధి తీరిన తర్వాత తప్పనిసరిగా ఆ బీమా సంస్థ అందించే యాన్యుటీ పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. పింఛను నిధిలో నుంచి 50 శాతం వరకూ ఇతర బీమా సంస్థల యాన్యుటీల కొనుగోలుకు వాడుకోవచ్చు. పింఛను పాలసీదారు తమ పెట్టుబడిని ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలన్నదీ నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పింఛను పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత పింఛను నిధిలో మూడోవంతే తీసుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం 60 శాతం వరకూ వెనక్కి ఇచ్చేస్తారు. పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలూ ఉంది. పిల్లల చదువులు, పెళ్లి, తీవ్ర వ్యాధులు, ఇంటి నిర్మాణంలాంటి అవసరాలకు పింఛను నిధిలో 25 శాతం వరకూ ఉపసంహరించుకోవచ్చు. ఈ మార్పులను పరిశీలిస్తే.. ఇప్పుడున్న పింఛను పాలసీలకన్నా.. కొత్తగా రాబోతున్నవి మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. |
భారమవుతాయా? సంప్రదాయా బీమా పాలసీలతోపాటు, యూనిట్ ఆధారిత పథకాల్లోనూ కొత్త పాలసీలు అమల్లోకి వచ్చాక కాస్త ప్రీమియం భారం పెరగవచ్చనేది అంచనా. ప్రధానంగా పాలసీని కొనసాగించే వ్యవధితోపాటు, స్వాధీన విలువ పెరగడం వల్ల ఈ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా యులిప్‌లలో అనుబంధ రైడర్లకు చెల్లించాల్సిన రుసుమును పాలసీదారుకు కేటాయించిన యూనిట్ల నుంచి మినహాయించుకునే వారు. ఇలా చేయడం వల్ల పాలసీ వ్యవధి తీరాక వచ్చే మొత్తంలో కొంత తగ్గేది. ఇక నుంచి అనుబంధ రైడర్లను ఎంచుకునేప్పుడు వాటికోసం అదనపు ప్రీమియాన్ని వసూలు చేయొచ్చు. సంప్రదాయ పాలసీల్లో.. స్వాధీన విలువ పెరిగినందున కొద్దిగా ప్రీమియం పెరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు. |
కమీషన్ తగ్గుతుందా? సంప్రదాయ పాలసీల్లో ఖర్చులు తగ్గించుకొని, స్వాధీన విలువ పెంచాలని నియంత్రణ సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు తమ ఆదాయాలను కాపాడుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తొలుత చేసే పని ఏజెంట్ల/బీమా సలహాదార్ల కమీషన్ తగ్గించడం. బీమా సంస్థ, పాలసీల రకాలను బట్టి సంప్రదాయ పాలసీల్లో 10-20శాతం వరకూ ఏజెంట్లకు కమీషన్ అందుతుంది. యూనిట్ ఆధారిత పాలసీల్లో ఇది సగటున 8శాతం వరకూ ఉంటుంది. 2014లో బీమా సంస్కరణలు వచ్చినప్పుడు ఏజెంట్ల కమీషన్ తగ్గిపోయింది. ఆ తర్వాత చాలామంది బీమా రంగంలో అంత చురుగ్గా పని చేయడం లేదు. డిసెంబరు 1 నుంచి కొత్త పాలసీలు అందుబాటులోకి వచ్చాక కమీషన్ 5శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా. ‘ఇప్పటికే ఆన్లైన్ పాలసీలతో బీమా ఏజెంట్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారూ తగ్గిపోయారు. ఉన్నవారిలోనూ 15-20శాతం మందే చురుగ్గా ఉంటున్నారు. మిగతావారు తమ కోడ్‌ను కాపాడుకోవడానికి అడపాదడపా పాలసీలను విక్రయిస్తున్నారు. కమీషన్ తగ్గితే.. పూర్తిగా బీమాపైనే ఆధారపడిన ఎంతోమంది ఏజెంట్లకు ఇబ్బందిగానే పరిణమిస్తుంది’ అని ఒక బీమా ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలసీల రూపు మారి, అవి అందుబాటులోకి వస్తేనే కమీషన్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. |