close

ఫలితాల ముందు అప్రమత్తత

 స్వల్ప శ్రేణికి సూచీలు పరిమితం
డీలాపడిన బ్యాంకింగ్‌ షేర్లు

సమీక్ష

నాలుగు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇంట్రాడేలో 20 పైసలు తగ్గి 70.66 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 5 పైసలు పెరిగి 70.41 వద్ద ముగిసింది. అమెరికా- చైనా చర్చల అనిశ్చితి, బ్యారెల్‌ చమురు ధర 60 డాలర్లను దాటడం నష్టాలకు తోడయ్యాయి. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా షేర్లు నీరసంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 36,258 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. మదుపర్ల అప్రమత్తతతో స్వల్ప శ్రేణిలోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 36,269.31 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 36,070.76 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 106.41 పాయింట్ల నష్టంతో 36,106.50 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 33.55 పాయింట్లు కోల్పోయి 10,821.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,801.80- 10,859.35 పాయింట్ల మధ్య కదలాడింది.

* అంతర్జాతీయ ముడిచమురు ధరలు 60 డాలర్ల స్థాయిని అధిగమించడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌, అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌ 2.38%, బీపీసీఎల్‌ 1.60%, ఐఓసీ 1.59%, ఓఎన్‌జీసీ 1.37%, ఆయిల్‌ ఇండియా 1.05% చొప్పున నష్టాలు నమోదు చేశాయి.

* ఆడిటర్ల రాజీనామా వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు లేవని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రకటించడంతో వక్రంజీ షేర్లు 4.99 శాతం లాభంతో రూ.37.90 దగ్గర స్థిరపడ్డాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టాలు చవిచూశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.15%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 1.42%, ఓఎన్‌జీసీ 1.37%, మారుతీ సుజుకీ 1.07%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.05%, సన్‌ఫార్మా 0.79%, హెచ్‌డీఎఫ్‌సీ 0.72% చొప్పున డీలాపడ్డాయి.  టాటా మోటార్స్‌ 1.34%, ఎన్‌టీపీసీ 1.09%, ఎం అండ్‌ ఎం 0.99%, బజాజ్‌ ఆటో 0.86%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.63%లు రాణించిన వాటిలో ఉన్నాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌, చమురు- గ్యాస్‌, పీఎస్‌యూ షేర్లు 1 శాతం వరకు పడ్డాయి. మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాలు, వాహన, ఐటీ స్క్రిప్‌లు మాత్రం రాణించాయి. బీఎస్‌ఈలో 1390 షేర్లు ప్రతికూలంగా, 1215 స్క్రిప్‌లు సానుకూలంగాను ముగిశాయి. 149 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.